యాంగ్రీ స్టార్....డా.రాజశేఖర్
- February 04, 2025
తెలుగు చిత్ర సీమలో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌కు, పర్‌ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు. ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు రాజశేఖర్. పవర్‌ఫుల్ యాక్షన్ మూవీసే కాకుండా సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిన సినిమాల్లోనూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు రాజశేఖర్. మాతృభాష తమిళ్ అయినప్పటికీ తెలుగులోనే నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు.నేడు యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ జన్మదినం.ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం మీద ప్రత్యేక కథనం ..
డా.రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడులోని తేనీ జిల్లా లక్ష్మీపురం గ్రామంలో వరదరాజన్ గోపాల్, ఆండాళ్లు దంపతులకు జన్మించారు.ఆయన తండ్రి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు.ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో తమిళనాడు క్యాడర్లో చేరారు. తండ్రిని చూస్తూ పెరిగిన రాజశేఖర్ ఆయనలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు. కానీ, తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించారు. ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత చెన్నయ్‌లో కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.
స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా రంగం మీద ఆసక్తి కలిగింది. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న తర్వాత దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన పుథుమై పెన్ చిత్రంతో విలన్‌గా పరిచయమయ్యారు. తెలుగులో ఘనవిజయం సాధించిన నేటి భారతం ఆధారంగా తమిళ్‌లో రూపొందిన పుతియ తీర్పు చిత్రంలో రాజశేఖర్ నటన చూసి తను తెలుగులో రూపొందిస్తున్న ప్రతిఘటన చిత్రంలో అవకాశం ఇచ్చారు దర్శకుడు టి.కృష్ణ. ఆ సినిమా తర్వాత రాజశేఖర్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వందేమాతరం చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తలంబ్రాలు చిత్రంలో పోషించిన నెగెటివ్ క్యారెక్టర్ రాజశేఖర్‌కు చాలా మంచి పేరు తెచ్చింది.
ఆహుతి, శ్రుతిలయలు, ఆరాధన వంటి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం చిత్రం రాజశేఖర్ కెరీర్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆయన పోషించిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ పాత్ర ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకు స్ఫూర్తినిచ్చింది. అంకుశం చిత్రం తర్వాత రాజశేఖర్ చేసిన సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి. ప్రజా తీర్పు, చెన్నపట్నం చిన్నోళ్లు, ధర్మయుద్ధం, మంచివారు మావారు, వింత దొంగలు సినిమాలు.. అంకుశం రేంజ్ విజయాలు అందుకోలేకపోయాయి.
అక్కమొగుడు చిత్రం సూపర్‌హిట్ కావడంతో రాజశేఖర్ కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత అహంకారి, బలరామకృష్ణులు చిత్రాలు నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చాయి. యాక్షన్ హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరిప్రియుడు చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించడమే కాకుండా మ్యూజికల్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో రాజశేఖర్ రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిన సినిమాల్లో గోరింటాకు, రాజసింహం, రౌడీయిజం నశించాలి, అన్న, సింహరాశి, సూర్యుడు, శివయ్య, మనసున్న మారాజు, ఎవడైతే నాకేంటి ముఖ్యమైనవి.
రాజశేఖర్ కెరీర్‌లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన చాలా సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. తమిళ్‌లో విక్రమ్ హీరోగా నటించిన సేతు చిత్రాన్ని తెలుగులో జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో శేషు పేరుతో రీమేక్ చేశారు. భారీ వ్యయంతో రాజశేఖర్ సొంతంగా నిర్మించిన ఈ సినిమా నటుడుగా అతనికి పేరు తెచ్చినా కమర్షియల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత జీవిత దర్శకత్వంలో నిర్మించిన మరో సినిమా సత్యమేవ జయతే చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
రాజశేఖర్ తన కెరీర్‌లో 90కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఇందులో హిట్ అయిన సినిమాల శాతం తక్కువే అయినా హీరోగా అతని రేంజ్‌ని బాగా పెంచాయి. తన అభిరుచి మేరకు సినిమాలు చెయ్యాలన్న కోరికతో సొంత నిర్మాణ సంస్థ ద్వారా చేసిన సినిమాలు చాలా వరకు పరాజయాన్ని చవిచూశాయి.అయితే, ఇదే సమయంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన psv గరుడవేగ చిత్రం సక్సెస్ అయ్యి రాజశేఖర్ కెరీర్ ముగిసిపోలేదని ఇండస్ట్రీ వర్గాలకు తెలియజెప్పిన చిత్రంగా నిలిచింది.ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్న రాజశేఖర్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష