వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం: కేంద్ర మంత్రి జైశంకర్‌

- February 07, 2025 , by Maagulf
వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం: కేంద్ర మంత్రి  జైశంకర్‌

న్యూ ఢిల్లీ : వలసల విధానం పై కొత్త చట్టం తెస్తామని కేంద్రం ప్రకటించింది.వలసదారుల తరలింపు విధానంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్రం కొత్త చట్టాన్ని అమలుచేయాలని పరిశీలిస్తున్నది.దీనిని తాత్కాలికంగా ఓవర్సీస్‌ మొబిలిటీ బిల్లు-2024 అని పేరు పెట్టారు.ఈ చట్టం విదేశీ ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.వలసదారుల తరలింపుపై అమెరికా అనుసరించిన విధానాన్ని కేంద్రం సమర్థించుకుంది.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ రాజ్యసభలో మాట్లాడుతూ అమెరికా నుంచి వలసదారుల తరలింపు కొత్త విషయం కాదని అన్నారు.వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించవద్దని తాము ఆ దేశాన్ని కోరామన్నారు.విదేశాల్లో అక్రమ వలసదారులుగా గుర్తించిన భారతీయులను మన దేశానికి వెనక్కి రప్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 2012 నుంచి కొనసాగిస్తున్నదని చెప్పారు.వారి ప్రామాణిక నిర్వహణా విధానం ప్రకారం నిర్బంధ విధానాలు అనుసరిస్తారని, అయితే మహిళలు, పిల్లల పట్ల ఆ విధానం అనుసరించ వద్దని తాము కోరామన్నారు.ఎప్పటికప్పుడు యూఎస్‌ అధికారులతో టచ్‌లో ఉన్నామన్నారు.చట్టబద్దమైన చర్యను ప్రోత్సహిస్తూనే చట్టవిరుద్ధ పనులను నిరుత్సాహ పరిచినట్టు ఆయన చెప్పారు.ఇక భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది.‘గతంలోనూ ఇండియా వలసదారులను ఇలాగే పంపించారు. కానీ ఈసారి మన పౌరుల చేతికి బేడీలు వేయడం అవమానకరం' అని థరూర్ మండిపడ్డారు.దీంతో స్పందించిన కేంద్రం.. ఆ ఫొటోల్లో ఉన్నది భారతీయులు కాదని తెలిపింది. ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ డిపార్ట్‌మెంట్ ఆ ఫొటోలపై నిజ నిర్దరణ ప్రక్రియ చేపట్టగా అవి ‘ఫేక్‌’ అని పీఐబీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com