తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ మేదోమధనం

- February 08, 2025 , by Maagulf
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ మేదోమధనం

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఎన్నికల అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహ రచన రూపొందించేలా ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. పార్టీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతూ, కాంగ్రెస్ సర్కారు మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. 

బీజేపీ పదాధికారుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై హర్షం వ్యక్తం చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం.ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నాయి.ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుంది.బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున, ప్రజలందరి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వస్తాం. కేరళ, తమిళనాడులో కూడా బిజెపి బలం పెరిగింది. అదే దిశగా కృషి చేసి తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది.నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ చైతన్యంగా ఆలోచించి ప్రజల పక్షాన నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించి ఆశీర్వదించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.  

ఈ భేటీ అనంతరం బీజేపీ పదాధికారుల సమావేశం కూడా జరిగింది.ఇందులో ప్రచార వ్యూహాలు, తదితర అంశాల పై చర్చించారు.పార్టీ నేతలు బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com