మ్యాన్లీ స్టార్-జగపతి బాబు

- February 12, 2025 , by Maagulf
మ్యాన్లీ స్టార్-జగపతి బాబు

జగపతి బాబు.. గత మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ మోస్ట్ డిమాండబుల్ ఇండియన్ స్టార్ యాక్టర్‌గా రాణిస్తున్నారు.తన నటనతో అభిమానులను ఎమోషనల్ చేసిన ఈ స్టార్ ఇప్పుడు పవర్ఫుల్ విలన్గా కనిపిస్తూ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. నేడు మ్యాన్లీ స్టార్ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన మీద ప్రత్యేక కథనం ...

జగపతి బాబు పూర్తి పేరు వీరమాచినేని జగపతి రావు చౌదరి. 1962, ఫిబ్రవరి 12న ఉమ్మడి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సంపన్న కుటుంబానికి చెందిన వి.బి.రాజేంద్రప్రసాద్ దంపతులకు జన్మించారు. తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ ‘జగపతి ఆర్ట్‌ పిక్చర్స్’ అధినేతగా సుప్రసిద్ధులు. రాజేంద్రప్రసాద్ దర్శకనిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్ తండ్రి పేరు సైతం జగపతి రావు చౌదరి.ఆ పేరునే తన తనయునికి పెట్టుకున్నారు. అంత పెద్ద దర్శకనిర్మాత తనయుడు కాబట్టి జగపతిబాబుకు చిత్రసీమ ఎర్రతివాచీ పరచిందేమీలేదు.

మద్రాస్‌లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. చదువుకునే సమయంలో రోజుకు 3 - 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్నిరోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని.. తన నాన్నగారు పెద్ద నిర్మాత అయినప్పటికి ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు.

అలా కో-డైరెక్టర్ నుంచి విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్.. తన కొడుకు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి తండ్రి తొలుత జగపతిబాబు హీరోగా 1989లో ‘సింహస్వప్నం’ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత ఆ తర్వాత రెండు మూడేళ్ల పాటు జగపతిబాబు నటించిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. చివరకు జగపతిబాబు గొంతు కూడా కొందరు దర్శకులకు నచ్చలేదు. దాంతో వేరేవారితో డబ్బింగ్ చెప్పించేవారు.

‘పెద్దరికం’ చిత్రం హీరోగా బాబుకు బ్రేక్ నిచ్చింది. ఈ చిత్రంలో జగపతిబాబుకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. తరువాత రామ్ గోపాల్ వర్మ ‘గాయం’నటునిగా గుర్తింపు తెచ్చింది. అందులో జగపతిబాబు తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అతన్ని స్టార్‌గా నిలబెట్టాయి. 1994 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జేబీ.  

ఎస్. వి. కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్ళి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు జగపతి బాబు. సౌందర్యతో ఈయన కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. తెలుగునాట ‘నట భూషణ్’ శోభన్ బాబు తర్వాత అత్యధిక చిత్రాల్లో ఇద్దరు కథానాయికలతో నటించి ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు స్టార్ డమ్ దక్కించుకున్నారు. ఒకే మూసలో వెళ్లకుండా అప్పుడప్పుడూ అంతఃపురం, మనోహరం లాంటి సినిమాలు కూడా చేసాడు జగపతిబాబు. ఈ రెండు సినిమాలకు నందులు అందుకున్నారు జేబీ. కామెడీ కారెక్టర్స్ కూడా బాగానే చేసారు  ఈయన.

జగపతిబాబు కాల్ షీట్స్ కు ఒకానొక సమయంలో విశేషమైన డిమాండ్ ఉండేది. ప్రేమికునిగా, ఇంటిపెద్దకొడుకుగా, ఓ మంచిభర్తగా, అన్యాయాన్ని ఎదిరించే ఆదర్శభావాల నాయకునిగా, న్యాయం కోసం పోరాడే యోధుడుగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విలక్షణమైన పాత్రల్లో అలరించారు జగపతిబాబు. అయితే హీరోగా తన స్టార్ డమ్ మసకబారుతున్న సమయంలోనే జగపతిబాబు కేరెక్టర్ రోల్స్ వైపు మళ్ళారు. కానీ, అప్పుడు అంతగా ఆకట్టుకోలేక పోయారు.

 35 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కొన్న జగపతిబాబు.. కెరీర్ పూర్తిగా డల్ అవుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్‌ చిత్రంలో విలన్ పాత్రను పోషించాడు. అక్కడ్నుంచి మళ్లీ జేబీ కెరీర్ గాడిన పడింది.సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈయన నటించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాలు జగపతిబాబుకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా ఇంత బాగుంటుంది అని స్టైలిష్ విలనిజాన్ని వెండితెరకి పరిచయం చేశారు జగ్గూ భాయ్. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మోస్ట్ డిమాండబుల్ స్టార్ ఆర్టిస్టుగా కంటిన్యూ అవుతున్నారు.

ఒకే తరహా పాత్రల్లో నటించినా, వాటిలో మూసధోరణి కనిపించకుండా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నంలో ఉన్నారు జగపతిబాబు. తాను ఎంత బిజీగా ఉన్నా, తనకు నచ్చిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ అలరిస్తున్నారు. నవతరం కథానాయకుల చిత్రాలలో జగపతిబాబు నటిస్తూండడం ఓ ఎస్సెట్ గా మారింది.రాబోయే చిత్రాలతో జగపతిబాబు మరింతగా జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com