ఆసక్తిగా మారుతున్న ఆంధ్ర రాజకీయాలు

- February 16, 2025 , by Maagulf
ఆసక్తిగా మారుతున్న ఆంధ్ర రాజకీయాలు

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. రాజకీయంగా బలోపేతం కావటానికి ఇదే సరైన సమయంగా బీజేపీ తో పాటుగా జనసేన భావిస్తోంది. 

ఇందు కోసం బీజేపీ అధినాయకత్వం ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఏపీ పై ఢిల్లీ ఫోకస్ 
ఏపీలో తమ పార్టీ బలం పెంచుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కూటమిలో కొనసాగుతూనే.. పార్టీని క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలోనే అమిత్ షా స్పష్టం చేసారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం గురించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించారు. అదే సమయంలో పార్టీ నాయకత్వ మార్పు పైన చర్చ జరిగింది. ఇప్పటికే పార్టీ నేతలు తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. ఏపీలో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయం లో పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

కూటమిలో కొనసాగుతున్నా... 
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి స్థానంలో మరొకరిని ఎంపిక చేసే అంశం పైన కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైన ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ సమయంలో పురందేశ్వరి ఢిల్లీ లో పార్టీ నాయకత్వానికి అందుబాటు లో ఉండనున్నారు. కూటమిలో ఉన్నా.. పార్టీలో చేరికల విషయంలో ఎలాంటి అలసత్వం వద్దని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, బీజేపీలో చేరికల పైన టీడీపీ నేతలు కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయటం పైన బీజేపీ నాయకత్వం ఆరా తీస్తోంది. కూటమిలో బీజేపీ ఉన్నా.. పార్టీలో చేరికల విషయంలో ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదని తేల్చేసారు. 

కీలక మార్పులు 
విశాఖ, గోదావరి జిల్లాల్లో వైసీపీ నుంచి కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసారు. అయితే.. టీడీపీ నుంచి వచ్చిన అభ్యంతరాలతో వారి చేరికలు ఆగినట్లు పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. బీజేపీలో చేరికల పైన ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పటం ఏంటని ఢిల్లీ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురా లేగా కొనసాగింపు పైన ప్రతిపాదనలు వచ్చాయి. అయితే... పార్టీ నాయకత్వం మార్పు పైనే ఎక్కువ గా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పురందేశ్వరికి పార్టీ జాతీయ స్థాయిలో బాధ్యతలు కేటాయిస్తారని సమాచారం. తాజా పరిణామాలతో బీజేపీ ఏపీ విషయంలో తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com