ఆంధ్రా ఆక్టోపస్ - లగడపాటి రాజగోపాల్
- February 16, 2025
లగడపాటి రాజగోపాల్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆంధ్రా ఆక్టోపస్‌గా ప్రసిద్ధి చెందిన ఈయన పారిశ్రామికవేత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే విజయవాడ ఎంపీగా వరుసగా రెండు సార్లు ఎన్నికయ్యారు. కరుడుగట్టిన సమైక్యవాదిగా రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుల్లో రాజగోపాల్ ముఖ్యులు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకోని క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. నేడు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.
లగడపాటి రాజగోపాల్ 1964, ఫిబ్రవరి 16న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు తాలూకా అమరపనాయుడు కండ్రిగ గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన లగడపాటి వెంకట రామానాయుడు, రామలక్షమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి రామానాయుడు వ్యాపారరీత్యా రాజగోపాల్ చిన్నతనంలోనే కుటుంబం గుంటూరుకు తరలివచ్చింది. గుంటూరులోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం ఇంటర్ కోసం విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. ఆ తర్వాత వి.ఆర్.సిద్దార్థ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేశారు. ఇదే కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజగోపాల్‌కు సన్నిహిత మిత్రుడు.
రాజగోపాల్ తండ్రి రామానాయుడు ఆయన సోదరుడైన అమరప్ప నాయుడులు ల్యాంకో గ్రూప్ పేరుతో గుంటూరు కేంద్రంగా రవాణా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వ్యాపారంలోకి అడుగుపెట్టి పెద్ద పెద్ద సంస్థలకు గుత్తేదారుగా ఉంటూ మైనర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండేవారు. రాజగోపాల్ సైతం చదువుకునే రోజుల నుంచే కుటుంబ వ్యాపారాల్లో భాగమయ్యారు. 1986లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరవాత పూర్తి స్థాయిలో వ్యాపారంలోకి ప్రవేశించారు. 1986 నుంచి 2002 వరకు ల్యాంకో గ్రూప్‌ను విజయవంతంగా నడిపిన ఆయన కేవలం నిర్మాణ రంగానికే పరిమితం కాకుండా ఇంజనీరింగ్, పవర్ ప్లాంట్స్, మైనింగ్, ఫెర్రో అలోయిస్ రంగాల్లోకి అడుగుపెట్టారు. 2002 నాటికి ల్యాంకో గ్రూప్ వందల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.
1999 నాటికే రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నప్పటికి వ్యాపార బాధ్యతల వల్ల రాలేకపోయారు. 2002 నాటికి తన సోదరులైన మధుసూదన్ రావు, శ్రీధర్(సినీ నిర్మాత) లకు వ్యాపార బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి ల్యాంకో ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. రాజగోపాల్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గురించి విన్న అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం మరియు టీడీపీ అధినేత చంద్రబాబు 2004 సాధారణ ఎన్నికల్లో మైలవరం అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానన్నప్పటికి పార్లమెంట్‌కు వెళ్లాలనే ఉద్దేశంతో ఆ అవకాశాన్ని వద్దనుకున్నారు. ఇదే సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్సార్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేపట్టిన పాదయాత్రలో సైతం పాల్గొన్నారు.
2004లో కాంగ్రెస్ తరపున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి 1 లక్ష 14 వేల 487 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయవాడ ఎంపీగా నియోజవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధికి చాలా కృషి చేశారు. జగ్గయ్యపేట పరిధిలోని పెనుగంచిప్రోలు, వేదాద్రి ఆలయాలను బాగా అభివృద్ధి చేయించారు. మొదటి టరంలోనే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అత్యంత ఆప్తుడిగా మారారు.
2009 లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి రెండో సారి ఎంపీగా ఎన్నికైన రాజగోపాల్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్ర యూపీఏ ప్రభుత్వంపైనే పోరాడటం మొదలుపెట్టారు. ఈ పోరాటం చేస్తున్న సమయంలోనే భాగ్యనగరంలో ఉన్న తన కంపెనీ కార్యాలయాలపై తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేసి ఆస్తి నష్టాన్ని కలిగించడంతో తన కంపెనీలను ఢిల్లీకి మార్చారు. 2014న పార్లమెంట్ కేంద్రంగా రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీమాంధ్ర ఎంపీలపై దాడులకు తెగబడిన సమయంలో పెప్పర్ స్ప్రే ప్రయోగించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అప్పటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నాడు. ప్రతి సారి ఎన్నికలప్పుడు, ఎన్నికలకు ముందు లగడపాటి తిరిగి రాజకీయాల్లో వస్తారని ప్రచారం నడుస్తూనే ఉంటుంది.
లగడపాటి రాజగోపాల్‌ను ఆంధ్రా ఆక్టోపస్ అంటారు. అసలు ఇంతకి ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , ప్రజారాజ్యం, టీడీపిల మధ్య పోటీ హోరా హోరిగా నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదనే సంకేతాలు రావడంతో అప్పటి సీఎం వైఎస్ సైతం డీలా పడ్డ సమయంలోనే లగడపాటి తానూ చేయించిన ఎన్నికల సర్వేలను చూపించి తిరిగి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నదని జోస్యం చెప్పారు.
లగడపాటి చెప్పినట్లే ఆ ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో ఆయన సర్వేలపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో నమ్మకం ఏర్పడింది. భవిష్యత్తును పసిగట్టడంలో ఆక్టోపస్ ఎలా వ్యవహరిస్తుందో, అదే విధంగా రాజకీయ పార్టీల భవిష్యత్తును తన సర్వేల ద్వారా చెప్పడంలో రాజగోపాల్ దిట్ట కాబట్టి ఆయన్ని ఆంధ్రా ఆక్టోపస్‌గా ప్రసిద్ధి చెందారు. 2009-19 వరకు ఆయన సర్వేలు వంద శాతం నిజమవుతూ వచ్చాయి. అయితే. 2018 తెలంగాణ, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వేలకు భిన్నంగా ఫలితాలు రావడంతో సర్వేలు చేయించడం ఆపేశారు.
లగడపాటి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నది దశాబ్ద కాలమే! అయినప్పటికీ తన వ్యక్తిత్వం, మంచితనం మరియు అభివృద్ధి రాజకీయాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడ ప్రాంత ప్రజల్లో ఎప్పటికి చెరిగిపోని గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి రాబోయే రోజుల్లో మళ్ళీ క్రియాశీలకం అవుతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









