హస్తిన భాగ్య 'రేఖ'

- February 21, 2025 , by Maagulf
హస్తిన భాగ్య \'రేఖ\'

రేఖా గుప్తా...నిన్నటి వరకు ఢిల్లీ భాజపా వరకే పరిమితమైన పేరు, నేడు దేశవ్యాప్తంగా అందరికి సుపరిచితం. రెండున్నర దశాబ్దాల పాటు నిబద్దతతో కూడిన సుశిక్షితురాలైన భాజపా కార్యకర్తగా కొనసుగుతూ పార్టీ అధిష్ఠానం తనకప్పగించిన ప్రతి బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. పార్టీ పట్ల ఆమెకున్న ఈ వినయ విధేయతల వల్లే నేడు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి దోహదపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం పై ప్రత్యేక కథనం..

రేఖా గుప్తా 1974,జులై 19న హర్యానాలోని జింద్ జిల్లా జుల్నా అనే చిన్న పట్టణంలో జై భగవాన్ జిందాల్, ఊర్మిళ జిందాల్ దంపతులకు జన్మించారు.వారి స్వస్థలం మాత్రం అదే జిల్లాలోని నందగఢ్ గ్రామం.తండ్రి ఎస్బిఐ (SBI)లో ఉద్యోగి కావడంతో తరచూ బదిలీలు జరుగుతూ 1976లో ఢిల్లీకి వచ్చి స్థిరపడడం జరిగింది.ఆమె విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే జరిగింది. 1995లో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీకామ్, 2022లో చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘజియాబాద్‌లోని IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది.

రేఖ కుటుంబానికి తోలి నుండి ఆరెస్సెస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిన్నతనంలో రేఖ సైతం శాఖలకు వెళ్లేవారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే సంఘ్ విద్యార్ధి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో (ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసేవారు. 1994లో దౌలత్ రామ్ కళాశాల విద్యార్ధి సంఘం కార్యదర్శిగా,1996-97 మధ్యలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పని చేశారు.  

కాలేజీ అనంతరం రేఖ భాజపాలో చేరారు. 2003-04 వరకు ఢిల్లీ భాజపా యువ మోర్చా కార్యదర్శిగా, 2004-06 వరకు జాతీయ యువ మోర్చా కార్యదర్శిగా, 2009లో ఢిల్లీ మహిళా మోర్చా కార్యదర్శిగా, 2010లో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. 2020లో జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతున్నారు.

2007లో నార్త్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తరీ పీఠంపుర వార్డ్ కౌన్సిలర్‌గా ఎన్నికైన రేఖ 2012, 2022లలో సైతం అదే ఏరియా నుంచి ఎన్నికయ్యారు. 2007-17 వరకు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు స్టాండింగ్ కమిటీల్లో పనిచేసి పరిపాలనా దక్షురాలిగా  మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో షాలిమార్ బాగ్ నుంచి మొదటి సారి భాజపా నుంచి పోటీ చేసి 11 వేల ఓట్ల తేడాతో, 2020లో రెండో సారి  3 వేల తేడాతో ఓటమి పాలైనప్పటికి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంది కరోనా సమయంలో సైతం అక్కడే పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలిచారు. 2022లో భాజపా తరపున ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచుశారు.

2025లో జరిగిన ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి మూడో సారి పోటీ 30 వేల భారీ మెజారిటీతో సిట్టింగ్ ఆప్ ఎమ్యెల్యే బందనా కుమారి మీద విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 27 ఏళ్ళ తర్వాత భాజపా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ సీఎం పదవి కోసం పలువురు పేర్లు వినిపించినా అధిష్ఠానం అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకోని అనూహ్యంగా రేఖ వైపు మొగ్గుచూపింది. అలా, ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా, భాజపా నుంచి దివగంత సీనియర్ నేత సుష్మ స్వరాజ్ తర్వాత రేఖ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

అయితే, సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తాకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కీలక ఎన్నికల హామీలను అమలు చేయడం రేఖాగుప్తా సర్కార్‌కు కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజధాని నగరాన్ని కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టడం, మౌలిక వసతుల కల్పన, యమునా నది ప్రక్షాళన బీజేపీ ప్రభుత్వం ముందు అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయి.

ఢిల్లీలో రెండున్నర దశాబ్దాల తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా మొదట ఎన్నికల హామీలపై దృష్టిపెడతామని ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పూర్తి నిజాయితీతో, అంకితభావంతో పనిచేస్తానని సీఎం రేఖా గుప్తా ఇప్పటికే ప్రకటించారు. ఈ కోవలో ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు చెల్లించే పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. ఇది భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన పథకం.

ఇదే సమయంలో ఆప్‌ సర్కార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని భాజపా ప్రకటించినందున 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సి ఉంది. ఉచితంగా మంచినీటి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. దిల్లీలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించాల్సి ఉండగా మరో రూ.5 లక్షలు అదనంగా ఖర్చు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆప్‌ సర్కార్‌ తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్‌ల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన భాజపా నేతలు వాటిని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని ప్రక్షాళన చేయడం, రేఖా సర్కారు ముందున్న మరో సవాలు. గత పదేళ్లలో ఆప్‌ సర్కారు యమునానదిని పట్టించుకోలేదని భాజపా విమర్శిస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే యమునా నదిని శుద్ధి చేస్తామని ప్రధాని మోడీ  సైతం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది.

ఢిల్లీలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా తయారైందని భాజపా నేతలు పెద్దఎత్తున ఆప్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఫలితంగా ఆయా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత రేఖా సర్కార్‌పై ఉంది. ఢిల్లీలో వాయుకాలుష్యం అతిపెద్ద సమస్యగా తయారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానుల్లో ఢిల్లీ ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు సమర్థ విధానాలను అమలుచేయడం సహా ఎలక్ట్రిక్‌ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేఖా మాట్లాడుతూ వికసిత్ ఢిల్లీ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ఒక్క రోజు కూడా వృథా చేయదని, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తాము నెరవేరుస్తామని తెలిపారు. ఢిల్లీకి అత్యధిక కాలం సీఎంగా ఉన్న   షీలా దీక్షిత్ తరహాలో రేఖా కొనసాగుతారా ? లేక భాజపా నేత సుష్మ స్వరాజ్ వలె అతి స్వల్ప కాలంతో సరిపెట్టుకుంటారో లేదో ఆమె పనితీరు మీద ఆధారపడి ఉంటుంది.    

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com