పొలిటికల్ స్టేట్స్ మ్యాన్-మాధవ్ రావ్ సింధియా
- March 11, 2025
మాధవ్ రావ్ సింధియా...భారతదేశ రాజకీయాల్లో సమర్థతకు పర్యాయ పదంగా నిలిచిన నాయకుడు.గ్వాలియర్ రాజవంశానికి చెందిన ఆయన 16 ఏళ్లకే మహారాజుగా భాద్యతలు చేపట్టారు. రాచ బిడ్డ అయినప్పటికి తన స్వశక్తితో రాజకీయాల్లో రాణించారు. మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఓటమెరుగని నాయకుడిగా ఆయన నిలిచారు. రైల్వే శాఖ మంత్రిగా భారత రైల్వే రంగాన్ని సంస్కరణల బాట పట్టించారు. గాంధీలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీలో తన సమర్థతతో ప్రధాన మంత్రి అభ్యర్థి స్థాయికి ఎదిగారు. నేడు కేంద్ర మంత్రి మాధవ్ రావ్ సింధియా జయంతి సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం...
మాధవ్ మహారాజ్ లేదా భయ్యాజీగా దేశ రాజకీయాల్లో అత్యంత సుపరిచితులైన మాధవ్ రావ్ జీవాజి రావ్ సింధియా 1945, మార్చి 10వ తేదీన బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరంలో గ్వాలియర్ చివరి అధికారిక మహారాజు సర్ జీవాజి రావ్ సింధియా, విజయరాజే సింధియా దంపతులకు జన్మించారు. మాధవ్ రావు తండ్రి జీవాజీ రావ్ మధుమేహ వ్యాధితో మరణించగా 16 ఏళ్లకే గ్వాలియర్ మహారాజుగా పట్టాభిషిక్తులయ్యారు. తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను ఇంగ్లాండ్ దేశంలోని ఆక్స్ఫర్డ్ న్యూ కాలేజీలో పూర్తి చేశారు.
సింధియాలు తోలి నుంచి దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మాధవ్ రావ్ తండ్రి జీవాజి రావ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1956 వరకు మధ్యభారత్ (నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రం) రాష్ట్రానికి రాజ ప్రముఖుడిగా ఉన్నారు. ఆయన తర్వాత తల్లి రాజమాత విజయరాజే సింధియా భాజపా వ్యవస్థాపకురాలు మరియు 8 సార్లు లోక్ సభకు, 1 పర్యాయం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. తల్లి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్ రావ్ తొలుత భాజపా పూర్వ రూపమైన జనసంఘ్ పార్టీ తరపున తొలిసారి గుణ నుంచి ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రభనజనంలో స్వతంత్ర అభ్యర్థిగా రెండో సారి ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ అనువంశిక యువరాజు సంజయ్ గాంధీతో ఉన్న సహచర్యం వల్ల 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుణ నుంచి పోటీ చేసి మూడోసారి ఎన్నికయ్యారు. 1984 ఎన్నికల్లో మాజీ ప్రధాని వాజపేయ్ ను ఓడించి దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 1989,1991,1996,1998,1999లలో వరసగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 1985-89 వరకు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో రైల్వే శాఖ (సహాయ, స్వతంత్ర) మంత్రిగా పనిచేశారు. 1991-96 మధ్యలో నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక, పౌర విమానయానం మరియు మానవ వనరుల శాఖల మంత్రిగా పనిచేశారు.1999 నుంచి 2001 వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఉపపక్ష నేతగా వ్యవహరించారు.
రాజకీయాల్లో ఆసక్తి లేకుండానే వచ్చిన మాధవ్ రావ్ తన తల్లి రాజకీయాలతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి తుదిశ్వాస విడిచే వరకు దేశ రాజకీయాల్లో అగ్రనేతగా రాణించారు. తన పనితీరుతో రాజీవ్ గాంధీకి దగ్గరైన అతికొద్ది మంది నేతల్లో వీరు ఒకరు. రాజీవ్ ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో తెరమరుగు కానీయకుండా కాపాడుతూ వచ్చిన మాధవ్ రావ్ మాజీ ప్రధాని నరసింహరావు రాజకీయంగా దెబ్బ తీయాలని చూసినప్పటికి ఆ ప్రయత్నాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రాజకీయ పోరాట యోధుడిగా నిలిచారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంలో సైతం వీరి పాత్ర కీలకం. సోనియా లోక్ సభకు ఎన్నికైన తర్వాత ఎటువంటి భేషజాలు లేకుండా ఆమెను పార్టీ పక్షనేతగా ఆమోదించారు.
మాధవ్ రావ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది రైల్వే రంగం. 1985లో బన్సీ లాల్ పర్యవేక్షణలో కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలుత భారత రైల్వే రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత నష్టాల్లో క్రమక్రమంగా కూరుకుపోతున్న రైల్వేలను లాభాల పట్టించేందుకు అప్పటి ప్రధాని రాజీవ్, కేంద్ర రైల్వే మంత్రి బన్సీలాల్ ఆమోదంతో స్వతంత్రంగా పనిచేస్తూ రైల్వే రంగంలో గూడ్స్ రవాణా ట్రాఫిక్ పెంచి లాభాలను తెచ్చిపెట్టారు.
మాధవ్ పనితీరుకు మెచ్చిన రాజీవ్ 1986లో రైల్వే శాఖ పూర్తి బాధ్యతలను అప్పగించి సహాయ మంత్రిగా ఉన్న మాధవరావును స్వతంత్ర మంత్రిగా చేశారు. 1986-89 వరకు రైల్వే శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నూతన సూపర్ ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టారు. అలాగే, రైల్వే ఉద్యోగ నియామకాల్లో సిఫారసులకు మంగళం పాడి రిక్రూట్ మెంట్ పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారినే నియమించడం ఆయన హయాంలోనే మొదలైంది. టిక్కెట్ రిజర్వేషన్ల వ్యవస్థ, రైల్వే ఫైల్స్ కంప్యూటీకరణ వంటి పాలనా పరమైన సంస్కరణలు సైతం చేపట్టారు. కొంకణ్ రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడింది కూడా వీరి హయాంలోనే. మాధవ్ రావ్ సింధియా రైల్వే మంత్రిగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఆయన తర్వాత ఆ శాఖ మంత్రులుగా పనిచేసిన జార్జ్ ఫెర్నాండెజ్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ వంటి వారు మరింతగా రైల్వే రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అడుగులు పడ్డాయి.
రైల్వే మంత్రిగా అద్భుతమైన పనితీరు కనబర్చిన మాధవరావును 1991లో పి.వి.నరసింహారావు తన మంత్రివర్గంలో తొలుత పర్యాటక మరియు పౌరవిమానయాన శాఖలను అప్పగించారు. ఈ రెండు శాఖల్లో మాధవ్ రావ్ చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని చెప్పాలి. పర్యాటక రంగంలో పరిమితంగా ఉన్న టూరిజం సర్క్యూట్లను సంఖ్యను పెంచడం, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తన నేతృత్వంలోని పౌరవిమానాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ దేశంలో టూరిజాన్ని పెంచారు. పౌరవిమానయాన మంత్రిగా ఎయిర్ ట్రాఫిక్ పెంపుదల చేసేందుకు దేశవ్యాప్తంగా డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల నిర్మాణం, అప్పటికే ఉన్న ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ స్థాయికి పెంచారు. 1995-96 మధ్యలో మానవ వనరుల శాఖ మంత్రిగా సైతం విద్యారంగంలో కొన్ని పాత పద్ధతులకు స్వస్తి పలికారు.
మాధవ్ రావ్ సింధియా గొప్ప రాజకీయ వ్యూహకర్త. అటల్ బిహారీ వాజపేయ్ ను ఓడించడంతో మొదలైన ఆయన వ్యూహా చతురత కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చారు. నరసింహారావు ప్రతినిధిగా ఉన్న పార్టీ అధ్యక్షుడు సీతారామ్ కేసరిని తప్పించేందుకు ఏఐసీసీ సమావేశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. సోనియా గాంధీకి రాజకీయ ఓనమాలు నేర్పడంలో ఆయన చొరవ చూపారు. కాంగ్రెస్ వ్యవహారాలపై సోనియా ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో కాదో కూడా ఆయనే చెప్పేవారు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ కూటమిని ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంలో ప్రణబ్ ముఖర్జీతో కలిసి పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి రాదని గ్రహించిన మొదటి నాయకుడు ఆయనే కావడం విశేషం. 2004లో యూపీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ కంటే నిర్ణయించబడ్డారు అనేది బహిరంగ రహస్యం.
మాధవ్ రాజకీయాలతో పాటుగా క్రికెట్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు ఉంది. క్రికెట్ పట్ల బాల్యంలోనే మక్కువ పెంచుకున్న సింధియా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆట పట్ల అభిమానాన్ని చూపుతూ ఉండేవారు. ఎంపీగా పార్లమెంట్ క్రికెట్ జట్టు సారధిగా వ్యవహరించి పలు ప్రభుత్వ సంస్థల జట్లతో ఆడేవారు. ఎంపీలు సైతం క్రికెట్ అడగలరు అనేది ఆయన నిరూపించి చూపారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో క్రికెట్ క్రీడకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చారు. కేవలం క్రికెట్ రంగానికే కాకుండా మిగిలిన క్రీడలను ప్రోత్సహించారు. 1990-93 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సైతం తండ్రి బాటలో నడుస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.
సింధియా వ్యక్తిగత జీవితానికి వస్తే తన 20వ ఏట నేపాల్ రాణా వంశానికి చెందిన రాజ్యలక్ష్మి రాణా అలియాస్ మాధవీ రాజే సింధియాతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె చిత్రాంగద రాజే సింగ్, కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మాధవీ రాజే సింధియా కుటుంబ ధార్మిక, విద్యాసంస్థల వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఐదు సార్లు లోక్ సభకు, ఒక పర్యాయం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ మంత్రివర్గాల్లో కార్పొరేట్, ఉక్కు, పౌరవిమాయయన శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మోడీ 3.0లో కమ్యూనికేషన్స్ మరియు ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఏనాడు మహారాజుననే అధికార దర్పంతో కాకుండా అందరితో మాధవ్ రావ్ ఎటువంటి భేషజాలు లేకుండా ఇట్టే కలిసిపోయేవారు. ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులతో చివరి వరకు సత్సంబంధాలు కొనసాగించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. అవినీతికి, ఆశ్రీత పక్షానికి ఆమడ దూరంలో ఉండే ఆయన మీద బురద జల్లాలని ప్రయత్నించిన వారిపైనే బురద పడింది కానీ ఆయన మాత్రం రాజకీయ సచ్చిలుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగిన మాధవ్ రావ్ సింధియా మహారాజ్ 2001,సెప్టెంబరు 30న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా శివార్లలోని మొట్టా గ్రామం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో తన 56వ ఏట కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!