హైదరాబాద్‌:అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వాన...మరో 48గంటల్లో...

హైదరాబాద్‌:అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వాన...మరో 48గంటల్లో...

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది.  ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సహా పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి . అటు వర్షాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు చురుకుగా మారాయని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.హైదరాబాద్‌ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం భానుడు ప్రతాపం చూపించాడు. అయితే సాయంత్రానికి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. చిరు జల్లులుగా ప్రారంభమైన వర్షం.. అర్ధరాత్రి సమాయానికి బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, మారెడ్‌పల్లి, అడ్డగుట్ట, బోయిన్‌పల్లి, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, అబిడ్స్‌, లక్డీకాపూల్‌, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నాచారం, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో... ముందస్తుగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 

ఈ సారి నైరుతి రుతుపవనాలు ప్రారంభంలోనే ఆశాజనకంగా కనిపించాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి రెండ్రోజులు వర్షాలు బాగానే కురిసినా..ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి. నైరుతి రుతుపవనాలు వచ్చినా.. గత వారం రోజులుగా భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో ఏపీలో భానుడి ధాటికి ప్రభుత్వం సెలవులను కూడా ప్రకటించింది. అయితే ఉపరితల ఆవర్తనం వల్ల వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినా...చాలా ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతంగా మారింది.

బంగాళాఖాతంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల నుంచి 4.5 కి.మీ ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో.. ఇప్పటివరకు బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాలు.. బలపడే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల  ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇటు తెలంగాణలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత వాన కురిసింది. వేములవాడ, చందుర్తి, కొనరావుపేట, బోయింపల్లి, వీర్నవల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో భారీ వర్షం పడింది. వేములవాడలో కురిసిన వర్షానికి రాజన్న ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. తొలకరి జల్లులకు విత్తనాలు నాటుకున్న రైతుల్లో ఈ వర్షం ఆనందం నింపింది. అటు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనానికి.. ఆహ్లాదాన్ని పంచింది. 

Back to Top