నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం..50 మందికి పైగా మృతి
- March 17, 2025
నార్త్ మెసిడోనియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నైట్ క్లబ్లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 59 మంది సజీవదహనమయ్యారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్లో స్థానిక పాప్ బృందం కన్సర్ట్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ కార్యక్రమంలో బాణాసంచా కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని కోరింది.
దీంతో ఏం జరిగిందో అర్ధంకాక గందరగోళం మధ్యే యువతీయువకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ లోపే దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే. మరణించిన వారిలో ఇప్పటివరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమని, చాలా మంది యువతీ యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశానికి పూడ్చలేని నష్టంగా ఆయన అభివర్ణించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







