అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి

- March 24, 2025 , by Maagulf
అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి

విజయవాడ: అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో, ప్రొస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం ‘రెజ్యూమ్’ను రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్ లతో కలసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక చికిత్సతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడం సాధ్యమవుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. ప్రశాంత్ హాస్పిటల్ ఆవిష్కరించిన ‘రెజ్యూమ్’ ప్రోస్టేట్ సంబంధిత వ్యాధుల చికిత్సలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం, ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోని మొట్టమొదటి సమగ్ర చికిత్సా విభాగంగా ప్రశాంత్ హాస్పిటల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రోస్టేట్ సంబంధిత సమస్యలన్నింటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీని అందుబాటులోకి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.ఈ చికిత్స యుఎస్ఎఫ్డీఏ ఆమోదితమైన, అత్యంత సరళతరమైన అత్యాధునిక చికిత్స అని తెలిపారు. ఈ రెజ్యూమ్ థెరపీ బీహెచ్పీ చికిత్సల్లో అతి పెద్ద మార్పు తీసుకువస్తుందని చెప్పారు. రెజ్యూమ్ వాటర్ థెరపీలో, పెద్ద శస్త్రచికిత్స అవసరం లేదని, జనరల్ అనస్థీషియా కూడా అవసరం ఉండదని అన్నారు. అతి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉంటుందని, సెక్సుయల్ ఫంక్షన్‌కి ఎటువంటి హాని ఉండదని చెప్పారు. దీర్ఘకాలిక మందులు వాడాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ థెరపీ ద్వారా నీటి ఆవిరిని ఉపయోగించి ప్రోస్టేట్ గడ్డలను తగ్గించడం ద్వారా, మూత్ర సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ థెరపీ ద్వారా ఇది రోగులకు సురక్షితంగా, వేగంగా, జీవిత నాణ్యతను కాపాడుతూ చికిత్స అందించవచ్చని డాక్టర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ కె. ధీరజ్, హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ కె.ప్రీతమ్, యూరో గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పి. హరిత, హైరిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్వేత సీవోవో బి. రమేష్, నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com