ప్రపంచ వారసత్వ దినోత్సవం

- April 19, 2025 , by Maagulf
ప్రపంచ వారసత్వ దినోత్సవం

దేశచరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను  ప్రతిబింబించే ‘పురాతన కట్టడాలు’ ప్రపంచ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునెస్కో’ ఆధ్వర్యంలో ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాల’ గుర్తింపు,నిర్వహణ  జరుగుతోంది. ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకు ఒకరికొకరు సహకరించుకోవాలనే ముఖ్యోద్దేశంతో ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.కాగా ఆఫ్రికా ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18న అంతర్జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై 'ఐక్యరాజ్యసమితి', 'అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది.

ఇందులో వివిధ దేశాల ప్రతినిధులిచ్చిన సలహాలు, సూచనలతో యునెస్కోకి ప్రతిపాదనలు పంపించగా 1983లో ఆమోదం పొందింది. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్‌ 18వ తేదీనే 'ప్రపంచ వారసత్వ దినోత్సవం' గా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వారసత్వ సంపదపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతుండగా.. దాదాపు ఎనిమిది వందలకు పైగా పురాతన కట్టడాలు, స్థలాలను పరిరక్షిస్తుండటం విశేషం.


యునెస్కో మానవాళికి అత్యుత్తమ విలువగా పరిగణించే విలక్షణమైన సాంస్కృతిక లేదా భౌతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను గుర్తించి, వాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చుతోంది.  ముఖ్యంగా వివిధ దేశాల వైవిధ్యమైన అడవులు, పర్వతాలు, సరస్సులు, ఎడారులు, కట్టడాలు, నగరాలను, యునెస్కో  ప్రపంచ వారసత్వ  ప్రదేశాల జాబితాలో చేరుస్తున్నది.  ఒక దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ దేశ వారసత్వాన్ని భావితరాలకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.


ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలలో 993 సాంస్కృతిక,  227 సహజ సిద్ధ,  39 మిశ్రమ స్థలాలను గుర్తించింది. వీటిలో 42 భారత్లో ఉన్నాయి.  ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఆరవ స్థానంలో ఉంది. భారతదేశంలో పురాతన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే వారసత్వ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. సింధు నాగరికత,  బౌద్ధ, అశోకుని కాలం నుంచి మొదటగా చారిత్రక నిర్మాణాలు, శిల్పకళా సంపద ఆరంభమైనది. రాజుల శిలా శాసనాలు, గుహలు, దేవాలయాలు, కోటలు వంటి కట్టడాలు మన చారిత్రక వారసత్వ సంపదకు గొప్ప నిదర్శనాలు.  

మన రాజ్యాంగంలో సైతం ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలలో ‘వారసత్వ సంపద పరిరక్షణ’ అంతర్భాగంగా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారసత్వ ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా ప్రకటించి ఆర్థిక వనరుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. వారసత్వ కట్టడాల అభివృద్ధికి  కేంద్ర ప్రభుత్వం 2015లో ‘హృదయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దత్తత విధానంలో వాటి అభివృద్ధికి  ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ,  ప్రైవేట్ భాగస్వామ్యంతో స్మారక కట్టడాల అభివృద్ధికి కృషి చేయనున్నారు. మన పురాతన చారిత్రక కట్టడాలను దేశీయంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వీక్షించే అవకాశం లేకుండా పోతున్నది.  ప్రయాణం, వసతి ఖర్చులు భారీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.కాబట్టి,  ప్రభుత్వాలు పథకాల ద్వారా స్మారక కట్టడాలను పేద ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించాలి.  

-డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com