ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన.. ఫుల్ షెడ్యూల్ విడుదల

- April 24, 2025 , by Maagulf
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన.. ఫుల్ షెడ్యూల్ విడుదల

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మే2వ తేదీన ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు.అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేలా కూటమి నేతలు ప్రణాళిలకు సిద్ధం చేశారు.దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం.. మే 2వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.1కిలో మీటరు మేర 15 నిమిషాలపాటు రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తరువాత 3.45గంటలకు అమరావతి పెవిలియన్ ను మోదీ సందర్శిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభంతోపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు అమరావతి ప్రాంతం నుంచి తిరిగి పయణమవుతారు. సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గన్నవరం నుంచి బయల్దేరి 5.20గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.

ప్రధాని సభ కోసం అధికారులు మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక పై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ముఖ్యులు ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై సుమారు 100 మంది కూర్చొనేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణానికి ఎనిమిది రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 11 పార్కింగ్ స్థలాలను కూటమి నేతలు సిద్ధం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com