ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం...!
- May 03, 2025
జర్నలిజాన్ని ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.నిష్పాక్షికమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. ప్రపంచ స్థాయిలో మీడియా పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరియు జర్నలిస్టులు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రపంచానికి తెలియజేయడానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు.నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ...
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి 1991లో మొదటి సారి యునెస్కో సమావేశంలో ప్రతిపాదన రాగా,1993లో ఐక్యరాజ్యసమితి పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని మే3న జరపాలని నిర్ణయించింది. అలా ప్రతి సంవత్సరం మే3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటున్నాం. పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈరోజు గుర్తు చేస్తోంది. ఈరోజు ప్రతికా స్వేఛ్చా. మరియు వృత్తిపరమైన నీతి సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనావేయడం, దాన్ని పరిరక్షించడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం వంటివి పత్రికా స్వేచ్ఛ దినోత్సవ లక్ష్యాలు. ఒక సంఘటన, కుంభకోణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి ప్రజలకు వెల్లడించే ప్రయత్నంలో ప్రాణాలను పణంగా పెట్టిన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. వారి కృషిని అభినందించే ప్రయత్నమే ఈ దినోత్సవ కీలక ఉద్దేశంగా చెప్పవచ్చు.
ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే.. మీడియా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వతంత్ర స్థితిని అంచనావేయడం, జర్నలిస్టులు, మీడియా నిపుణులను వారి వృత్తి నిర్వహణలో ఎదురయ్యే దాడుల నుంచి రక్షించడం మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. సెన్సార్షిప్, బెదిరింపులు, వేధింపులు, జైలుశిక్ష, హింసవంటి వాటిని ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు అండగా నిలిచి అవగాహన కల్పించడం మరో ముఖ్యవిధిగా నిర్ణయించారు. సత్యాన్వేషణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల జ్ఞాపకాలను మననం చేసుకుని ప్రపంచ పత్రికా దినోత్సవం
సందర్భంగా వారికి నివాళి అర్పిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజలు, పత్రికాస్వేచ్ఛ, జర్నలిస్టుల నిబద్ధతను గౌరవించవలసిన అవసరాన్ని యునెస్కో నొక్కి చెబుతుంది. గతంలో నిర్వహించిన దినోత్సవాల్లో వార్తా మాధ్యమాల ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే చర్యలపై ప్రస్తావించారు. ఇంటర్నెట్ కంపెనీల పారదర్శకతను నిర్ధారించే యంత్రాంగాలపై నిర్దిష్ట చర్చ చోటు చేసుకుంది. సమాచార హక్కును సమర్థించడంలోనూ, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలోనూ స్వేచ్చాయుత, స్వతంత్ర పత్రికా యంత్రాంగం పోషించే కీలకపాత్రను ఈ స్వేచ్ఛా దినోత్సవం గుర్తు చేస్తుంది.
ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సమాజంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాల సమగ్ర సమాచారాన్ని పౌరులకు పత్రికలే అందజేస్తాయి. ఆ సమాచారం ప్రాధాన్యతను విశ్లేషించి వాటికి భాష్యం చెప్పాలి. సంపాదకీయాలు, వ్యాసాలు పత్రికలే ప్రచురించాలి. వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేయాలి. వినోదాన్ని కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించడం పత్రికల సామాజిక బాధ్యతగానే పరిగణించాలి. దీనికి పత్రికలకు స్వేచ్ఛ కూడా అత్యవసరం. భారతదేశంలో పత్రికల పాత్ర పరిశీలిస్తే.. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకూ ప్రజలను చైతన్యం చేసే ముఖ్య సాధనాలు పత్రికలే.
పత్రికలు ప్రజా చైతన్యానికి పెద్ద పీట వేసి, అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్రికలు మరింత బాధ్యతగా, విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పత్రికలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కాగా, భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లతో, ప్రతిపక్షాల ఎత్తుగడలతో సతమతవుతున్న నేటి ప్రభుత్వాలకు మన పత్రికలు ‘ఎజెండా’ తయారుచేసి సమర్పించేవిధంగా ఉండాలి. పేదల కష్టాలను, నిరుద్యోగుల వెతలను, అధికారుల అవినీతిని ఎండగట్టి ప్రజలు, ప్రభుత్వాల ముందు ఉంచాలి. దేశంలోని క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా పత్రికలు వ్యవహరించాలి.
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాల కనుసన్నల్లో నడిచే పత్రికల సంఖ్య ఇటీవల రోజు రోజుకూ పెరుగుతోంది. పేదలను విస్మరిస్తూ ధనికుల వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విలువలకు తిలోదకాలిస్తూ ప్రభుత్వ విధానాలను ఢంకా మోగించే కరపత్రాలుగా పత్రికలు మారుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ పేరుతో పత్రికలు వాస్తవాలను కూడా వక్రీకరించడం జరుగుతోంది.
నైతిక విలువ గుర్తెరిగి బాధ్యతాయుతంగా పత్రికలు నడుచుకోవాలి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దానికి ముఖ్య కారణం ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల విస్తృతి పెరగడమే అని పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే పత్రికలకు ప్రజలు ఎప్పుడూ చేయూతగా ఉంటారు. ప్రజాస్వామ్య వికాసంలో పత్రికా స్వేచ్ఛ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛను హరించడమే అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.
పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం అసంపూర్ణం. మీడియా స్వేచ్ఛను పునరుద్ధరించడానికి, నిష్పాక్షిక న్యాయపరమైన విచారణ, జర్నలిస్టుల సురక్షా చట్టాలు, ప్రభుత్వం-మీడియా సంబంధాల పారదర్శకత అవసరం. భారత్‌లో దాడులకు గురవుతున్న పత్రికా స్వేచ్ఛకు సంబంధించి.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ జర్నలిస్టులకు మద్దతు ఇవ్వడం కీలకం. సమాచార స్వాతంత్య్రం భారత రాజ్యాంగం యొక్క మూలసూత్రాల్లో ఒకటి. ఆ నిబద్ధతను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు వుంది.
నిర్భీతితో, నిర్భయంగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలి. పత్రికా స్వేచ్ఛ.. పౌర, రాజకీయ, మతపరమైన హక్కులకు నిలయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధి పత్రికలు. పత్రికారంగం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం. ఇది ప్రజలకు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులకు కవచంలా పనిచేస్తుంది. దీనిని కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యత.
మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయి. ఈ సమయంలో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రతికలు ప్రధానంగా వ్యవహరించాయి. భారత రాజ్యాంగంలో ఎన్నో రకాల అధికారాలున్నప్పటికీ పత్రికా స్వేచ్ఛ విషయం గురించి ఎక్కడ పేర్కొలేదు. 19A(1) అధికరణ ప్రకారం పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో ప్రస్తుతం ప్రతికలు స్వాతంత్రంగా పని చేస్తున్నాయి. 1975-77 క్రమంలో ఎమర్జెన్సీ ఏర్పడడం వల్ల పత్రికాస్వేచ్చకు చీకటి రోజులు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా ప్రతికలు కనుమరుగయ్యాయి.
ప్రస్తుతం భారత్ వ్యాప్తంగా లక్షకుపైగా వార్తా పత్రిక సంస్థలున్నాయి. వాటిలో 380పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పత్రికా స్వేచ్ఛ గురించి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ తెలుపుతుంది. ఈ సంవత్సరం వెల్లడించిన ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ మొదటి స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది. ప్రస్తుతం చాలా దేశాల్లో రాజకీయ ఒత్తిళ్ళు, ప్రభుత్వాలు పత్రికలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్ల పత్రికా స్వేచ్ఛల్లో ఆటంకాలు వస్తున్నాయి.
ప్రస్తుతం పత్రికారంగంలో పెనుమార్పులు వచ్చాయి. పత్రికలు కొత్తరూపు రేఖలను సంతరించుకున్నాయి. సమాచారాన్ని ప్రజలకు నాణ్యంగా చేరవేయడానికి పత్రికలు ప్రాధాన్యతను ఇస్తాయి. ఎలెక్ట్రానిక్ మీడియా ఉనికిలోకి రాకముందు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఈ దినోత్సవం ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగానే పరిగణనలో ఉండిపోయింది. ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా నిష్పాక్షిక జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాది.
ప్రస్తుతం దేశంలో జర్నలిజం ప్రమాదకర వృత్తిగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులు హత్య చేయబడ్డ ఘటనలు సంచలనం రేపాయి. వివిధ కేసుల్లో దోషులకు శిక్ష పడకపోవడం, బాధితులకు న్యాయం లభించకపోవడం వల్ల మరోసారి జర్నలిస్టుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో జర్నలిస్టుల హక్కులను పరిరక్షించే ప్రత్యేక చట్టాలు రూపొందించాల్సిన అవసరం వుంది. పత్రికా స్వేచ్ఛకు ప్రజల మద్దతు కూడా అవసరం. అదేవిధంగా న్యాయవ్యవస్థ జోక్యం పెరగాలి. పాత్రికేయులపైన, మీడియా సంస్థలపైన జరుగుతున్న దాడులు, అన్యాయంగా జరుగుతున్న అరెస్టులపై కోర్టులు స్వతంత్రంగా వ్యవహరించాలి.
--డి.వి.అరవింద్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!