భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న కష్టకాలం

- July 09, 2016 , by Maagulf
భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న కష్టకాలం

హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి, అధిక ఆదాయం పొందుతున్న భారత ఐటీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఇక ఈ వీసాలకు అనుమతి ఇవ్వరాదని డెమోక్రాటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల ద్వైపాక్షిక సభ్యులు ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు శరాఘాతమే. ఇక ఈ వీసాల ద్వారా అమెరికాలో ప్రవేశించటం దాదాపు కష్టమైనట్లే.
ప్రస్తుతం అధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల మీద ఆధారపడి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వీసాల సంస్కరణలకు న్యూజెర్సీకి చెందిన డెమోక్రాటిక్‌ సభ్యుడు బిల్‌ పాస్క్రెల్‌, కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్‌ సభ్యుడు దానా రోరబాచర్‌లు ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందితే హెచ్‌-1బి ద్వారా ఒక కంపెనీలో ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను 50 కంటే ఎక్కువ మందిని లేదా మొత్తంలో 50శాతం మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది.
'అమెరికా మంచి నిపుణులను తయారు చేస్తోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు కళాశాలల నుంచి వస్తున్నారు. అయితే వారికి ఉపాధి ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీసా సంస్కరణలు అనివార్యం' అని పాస్క్రెల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
పాస్క్రెల్‌, దానా రోరబాచర్‌లు 2010లో ఇలాంటి బిల్లునే ఒకదానిని సభలో ప్రవేశపెట్టారు. అయితే మెజారిటీ సభ్యుల ఆమోదం లేక ఆ బిల్లు వీగిపోయింది. ప్రస్తుతం కూడా ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు సంతకం చేయాలంటే మొదట దీనిని అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com