రాజకీయవేత్త-పయ్యావుల కేశవ్

- May 14, 2025 , by Maagulf
రాజకీయవేత్త-పయ్యావుల కేశవ్

పయ్యావుల కేశవ్ .. తెలుగు నాట రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికి తన స్వశక్తితో రాజకీయాల్లో పైకి వచ్చారు కేశవ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఉరవకొండ ప్రాంతంలో ఫ్యాక్షన్, నక్సలిజానికి చెక్ పెట్టేందుకు  కృషి చేశారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅనుచరుల్లో ఒకరిగా ఉన్న కేశవ్ పార్టీ తరపున అనే ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. 

రాజకీయానికి మేధో వికాసాన్ని జతచేసి తన నియోజకవర్గ ప్రజలనే కాకుండా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. 2024లో ఎన్డీయే కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...

పయ్యావుల కేశవ్ 1965, మే 14న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి పట్టణంలో పయ్యావుల వెంకట నారాయణ, ఓబులమ్మ దంపతులకు జన్మించారు. స్వస్థలం మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా పెద్ద కౌకుట్ల గ్రామం. కేశవ్ విద్యాభ్యాసం మొత్తం  కౌకుట్ల, పుట్టపర్తి, హైదరాబాద్ మరియు మణిపాల్ ప్రాంతాల్లో చదువుకున్నారు. మణిపాల్ విశ్వవిద్యాలయం(టి.ఎ. పాయ్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్) నుండి మార్కెటింగ్ విభాగంలో  పీజీడీఎం పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగుళూరు కేంద్రంగా గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఆడియో కేసెట్స్ మరియు ఇతర వ్యాపారాలు చేసేవారు.

కేశవ్ కుటుంబం తోలి నుండి రాజకీయ కుటుంబం. తాత పయ్యావుల కేశన్న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లోనే సంపన్న భూస్వామి మరియు రాజకీయ దిగ్గజం, అనంతపురం తొలి ఎంపీ పైడి లక్ష్మయ్య నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. ఆరోజుల్లోనే వీరి కుటుంబానికి 6000 ఎకరాల ఉండేది. తండ్రి వెంకట నారాయణ  ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. కణేకల్లు సమితి అధ్యక్షుడిగా, రాయదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అన్న శ్రీనివాసులు ఉరవకొండ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

ఎన్టీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలోకి  వీరి కుటుంబం వచ్చింది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పరిమితి చట్టం కింద వీరికున్న వందలాది ఎకరాలను నిరుపేదలకు పంచి పెట్టారు. వీరి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ పిలుపు మేరకు వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. తనతో పాటుగా అప్పుడే గెలిచిన  దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ, పొన్నూరు ఎమ్యెల్యే మరియు సంగం డైయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రలతో కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు .

1994-99 వరకు కేశవ్ రాజకీయంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. భూస్వామ్య కుటుంబ నేపథ్యం, దుందుడుకు స్వభావం వల్ల అటు తెదేపాలోనూ, ఇటు నక్సలైట్లకు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే తన  నియోజకవర్గంలో పర్యటించడానికి చాలా ఇబ్బందులకు గురై, ప్రజలతో సంబంధాలు నేరుగా  కొనసాగించలేక 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 1997 - 1999 వరకు అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా కేశవ్ పనిచేశారు. 2002లో రాష్ట్ర తెదేపా కార్యావర్గంలో పనిచేస్తూ వచ్చారు.

2004,2009లలో వరసగా ఉరవకొండ నుంచి ఎన్నికైన తర్వాత జిల్లా రాజకీయాల్లో కంటే రాష్ట్ర స్థాయిలోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. దానికి తోడు చంద్రబాబు రాజకీయంగా ప్రోత్సహించడంతో 2004-09 వరకు అసెంబ్లీలో పార్టీ విప్‌గా కొనసాగారు. 2004 నుంచి 2014 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2014 తర్వాత తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు.

2004-14 వరకు సమైక్య రాష్ట్రంలో పయ్యావుల కేశవ్ రాజకీయ జీవితంలో చాల కీలకం. 2004,2009 లలో తెలుగుదేశం ఓటమి పాలైన తర్వాత శాసనసభలో ధూళిపాళ్ళ నరేంద్ర, దేవినేని ఉమా మరియు రేవంత్ రెడ్డిలతో కలిసి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ వచ్చారు. అంతేకాకుండా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలను నిత్యం ప్రజల ముందు ఉంచుతూ వచ్చారు. 

అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఈ సమయంలోనే కేశవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి మంచి ఆదరణను పొందారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి ఓటమి పాలైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం మండలిలో పార్టీ చీఫ్ విప్‌గా తన వంతు పాత్ర పోషిస్తూ వచ్చారు. 

2019లో జరిగిన ఎన్నికల్లో అప్పటి వైసీపీ హవాలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మొత్తం 23 మంది ఎమ్మెల్యేలలో కేశవ్ ఒకరు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న 52 స్థానాల్లో తెదేపా 3 సీట్లు గెలిస్తే, అందులో ఉరవకొండ నుంచి కేశవ్ నాలుగోసారి ఎన్నికయ్యారు.  2019- 24 వరకు కేశవ్ కేబినెట్ హోదా కలిగిన ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి ఐదో సారి ఎన్నికై చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర ఆర్థిక, కమర్షియల్ ట్యాక్స్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా బాద్యతలు చేపట్టారు.

కేశవ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయనలోని వాక్చతురత. 29 ఏళ్లకే ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత అన్ని వ్యవహారాల మీద విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. కేశవ్ మాటాల్లో వాడి వేడి స్పష్టంగా కనిపిస్తుంది. 

కేశవ్ శాసనసభా వ్యవస్థ మీద సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నారు. శాసనసభలో ఎంతటి క్లిష్ట సమస్యలనైనా అలవోకగా సామాన్య ప్రజానికానికి అర్ధమయ్యే రీతిలో ప్రసంగించగలరు. ఫైనాన్స్ ,వ్యవసాయం,ఇరిగేషన్, రెవెన్యూ మరియు విద్యుత్తు రంగాలపై చాలా పట్టు ఉంది. ఈ అంశాలపై ఉన్న పట్టు వల్లే ఆర్థిక వంటి కీలకమైన శాఖను దక్కించుకున్నారు.

మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అజాతశత్రువుగా నిలుస్తూ వస్తున్న కేశవ్ అంటే ప్రత్యర్థులకు సైతం మంచి సదాభిప్రాయం ఉంది. ఉరవకొండలో నక్సలిజం, ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలుస్తూ, ఆ రెండిటిని శాశ్వతంగా లేకుండా చేయడానికి అధికారంలో ఉన్నా, లేకున్నా అహర్నిశలు శ్రమించారు. కేశవ్ కృషి వల్లే ఆ ప్రాంతంలో ఈరోజు శాంతి భద్రతలు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.    

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com