ఘనంగా అనకాపల్లి జిల్లా మినీ మహానాడు

- May 22, 2025 , by Maagulf
ఘనంగా అనకాపల్లి జిల్లా మినీ మహానాడు

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో మినీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. హోం మంత్రి వంగలపూడి అనిత నాయకత్వంలో ఈ మహానాడు జరిగింది.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యేలు, టిడిపి ముఖ్యనాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మినీ మహానాడులో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.సుమారు   పది వేల మంది టిడిపి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు నాకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాలలో పాయకరావుపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండూ  సమాంతరంగా నడుస్తున్నాయి అని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.పాయకరావుపేట అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే అంటూ పార్టీ పట్ల నిబద్ధతను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి ప్రతి నాయకుడు ఎంతో నేర్చుకోవాలి అంటూ అభినందించారు. జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ,రాష్ట్ర ప్రజలు జగన్ వస్తే రాష్ట్రం అయోమయానికి లోనవుతుందని స్పష్టంగా చెప్పారు. ప్రజలు ఇటీవల చూపిన 'సినిమా' ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఉంది అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన నాయకులను,కార్యకర్తలను సన్మానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com