కన్నడ రెబల్ స్టార్-అంబరీష్
- May 29, 2025
అంబరీష్... కన్నడ చిత్ర పరిశ్రమను శాసించిన స్టార్ హీరో. ప్రతినాయకుడిగా సినీ జీవితాన్ని మొదలుపెట్టి, కృషి, పట్టుదలతో కొద్దీ కాలానికే టాప్ హీరోగా నిలిచారు. రాజ్ కుమార్, విషువర్థన్ హావాను తట్టుకొని తన మాస్ చిత్రాలతో కన్నడ బి,సి థియేటర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. కన్నడ పరిశ్రమ సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేశారు. నేడు కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....
కన్నడ సినీ పరిశ్రమలో రెబల్ స్టార్, అంబి, అప్పాజీ ఇలా పలు పేర్లతో ప్రసిద్ధమైన అంబరీష్ అసలు పేరు మాళవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. 1952, మే 29న ఒకప్పటి మైసూర్ రాష్ట్రంలోని అవిభక్త మాండ్య జిల్లా దొడ్డరాశినకెరే గ్రామంలో హుచ్చెగౌడ, పద్మమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో ఆరవవాడిగా జన్మించారు. మైసూర్ మహారాజా ఆస్థానంలో వయోలిన్ వాయిద్యకారుడైన చౌడయ్య గారు వీరి దగ్గరి బంధువు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం, మాండ్యలలో సాగగా, ఆ తర్వాత మైసూర్ వెళ్లి పీయూసీ పూర్తి చేశారు. ఆ డిగ్రీని మధ్యలోనే ఆపేసి ఇంటికొచ్చేశారు.
అంబరీష్ ‘దేనికీ పనికి రాడు' అనే ప్రగాఢమైన నమ్మకం ఉండేదట వాళ్ల ఇంట్లో. ఆయన టీనేజీకి వచ్చే సమయానికి అన్నయ్యలు, అక్కలందరూ ఇంజినీర్, డాక్టర్లుగా స్థిరపడ్డారు. అప్పటికి అంబరీష్ ఖాళీగా ఉండేవారు. 'నాగరాహువు' సినిమా కోసం కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ కొత్త వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ హీరోగా విష్ణువర్థన్‌ను ఎంపిక చేసుకున్నారు. విలన్ కావాలి. అంబరీష్ ఇష్టానికి వ్యతిరేకంగా స్క్రీన్ టెస్ట్ కోసం దర్శక-నిర్మాతలకు తన పేరుని సూచించారు ఆయన మిత్రులు.
చూడటానికి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాలా ఉండటం, స్క్రీన్ టెస్ట్‌లో ఒకటే టేక్‌లో చేతిలో సిగరెట్‌ను నోట్లో వేసుకోవడంతో పుట్టన్న కనగళ్ ఇంప్రెస్ అయిపోయారు. అమర్నాథ్‌ను అంబరీష్‌గా కన్నడ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేశారు. ఆ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. అలా అనుకోకుండా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారాయన. కన్నడ పరిశ్రమకు విష్ణువర్థన్, అంబరీష్ అనే ఇద్దరు స్టార్స్‌ను అందించిన సినిమాగా నాగరాహువు కన్నడ సినీ చరిత్రలో నిలిచింది. ఆ సినిమాలాగే వీళ్ల ఫ్రెండ్షిప్ సూపర్ హిట్. స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ విష్ణువర్థన్, అంబరీష్‌ల స్నేహానికి పోటీ, అహం అనే సమస్యలు ఎప్పుడూ అడ్డురాలేదు. అంబరీష్, విష్ణువర్థన్ ఇద్దరూ కలసి 'స్నేహితర సవాల్, స్నేహ సేదు, మహా ప్రచండరు, అవల హెజ్జే, దిగ్గరాజు' వంటి సినిమాల్లో కనిపించారు.
'నాగరాహువు' తర్వాత వచ్చిన సినిమాలను వచ్చినట్టు వరుసగా ఒప్పేసుకున్నారు అంబరీష్. సహాయ నటుడిగా, విలన్‌గా సినిమాలు చేస్తూ పోతున్నారు. 'అంత'లో పోషించిన పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర ఆయన కెరీర్‌కు బ్రేక్ అనుకోవచ్చు. 'రెబల్' అనే లేబుల్ అంబరీష్ పేరు ముందు ఫిక్స్ అవ్వడానికి పునాదిగా మారిన సినిమా అది. ఆ తర్వాత నటించిన ఎక్కువశాతం సినిమాల్లో రెబల్ పాత్రలే ఆయనకు రావడం, దర్శక - రచయితలు కూడా అవే టైప్ రోల్స్ రాయడంతో 'రెబల్‌స్టార్ అంబరీష్'గా మారిపోయారు.
'చక్రవ్యూహ, నాగరాహువు, రంగనాయకీ, మసండ హూవు, గండు బేరుండ' వంటి పలు సినిమాలు అంబరీష్ సినీ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.మెగాస్టార్ చిరంజీవి, అర్జున్ 'శ్రీమంజునాథ' సినిమాలో మహరాజు పాత్రలో అంబరీష్ కనిపించారు. ఆ చిత్రం తెలుగు- కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. అంబరీష్ తన సినిమాల్లో స్టంట్స్, డ్యాన్స్‌లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. డ్యాన్స్ ఉందంటే క్రేన్ తెచ్చుకొని లాంగ్ షాట్లో కెమెరా పెట్టుకోండి అని దర్శక నిర్మాతలకు సూచించేవారు.
ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే అంబరీష్ రాజకీయాల్లో అడుగుపెట్టారు.1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994-96 వరకు ఆ పార్టీలోనే కొనసాగిన అంబి, రాజకీయంగా విభేదాలు రావడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, 1996లో మాజీ ప్రధాని దేవెగౌడ సమక్షంలో జనతాదళ్ పార్టీలో చేరారు. 1996-99 వరకు ఆ పార్టీలో ఉన్న సమయంలోనే జనతాదళ్ విచ్ఛిన్నం కావడం, దేవెగౌడ వారసత్వ రాజకీయాలను పెంచి పోషించడం వంటి కారణాల చేత ఆ పార్టీకి రాజీనామా చేసి ఎస్.ఎం.కృష్ణ ఆధ్వర్యంలో 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంబరీష్ తన సొంత నియోజకవర్గమైన మాండ్య లోక్‌సభ స్థానం నుంచి వరసగా మూడుసార్లు (1998,1999,2004) వరసగా ఎంపీగా ఎన్నికయ్యారు. 2006-08 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కావేరి నది జలాల ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య ఓడిన తర్వాత అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. 2013-16 మధ్యలో సిద్దరామయ్య మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
అంబరీష్ వ్యక్తిగత జీవితానికి వస్తే, ప్రముఖ నటి సుమలత ఆయన భార్య. అంబరీష్, సుమలత హీరో హీరోయిన్లుగా 'ఆహుతి, అవతార పురుషా, శ్రీమంజునాథ, కళ్లరాలై హూవగీ' తదితర సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన బోల్డ్, బ్రేవ్, రెబల్ యాటిట్యూడ్‌ను చూసే ఇష్టపడ్డానని సుమలత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అంబరీష్ ఎంత పెద్ద నటుడైనా బయట నటించడం తెలియదంటారు ఆయన సన్నిహితులు.
సాధారణంగా స్టార్ సెలబ్రిటీలంతా బయట క్లీన్ ఇమేజ్‌తో ఉండాలనుకుంటారు. కానీ, అంబరీష్ తన వ్యక్తిగత ప్రవర్తనని, స్వభావాన్ని, అలవాట్లని బయట చెప్పడానికి ఎప్పుడూ సంకోచించలేదు. షుగర్ కోటింగ్ ఇవ్వాలనుకోలేదు. పైగా తనకున్న స్మోకింగ్, మందు వంటి చెడ్డ అలవాట్లను బహిరంగంగానే ఒప్పుకునేవారు. అంబరీష్ చాలా సెంటిమెంటల్ మనిషి. సొంత ఊరిని, వారసత్వంగా లభించినవి వదులుకోవడానికి ఇష్టపడేవారు కాదట. అయితే, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన చెల్లికి ఇచ్చేశారు. కొన్ని కారణాలతో ఆమె ఆ ఇంటిని అమ్మేయడంతో చాలా బాధపడ్డానని ఆయన గతంలో పేర్కొన్నారు. అంబరీష్ మంచి భోజన ప్రియుడు. 'ఒకసారి ఏకంగా 45 దోశెల వరకూ లాగించేశా' అని నవ్వుతూ చెప్పుకొచ్చారు కూడా....
తన సినీ ప్రస్థానాన్ని గురించి చెబుతూ, 'దేనికీ పనికి రాడనుకున్న అమర్నాథ్‌ను కన్నడ ప్రజలంతా ఆరాధనతో ప్రేమించే అంబరీష్‌గా మలిచారు' అంటూ తన మొదటి చిత్ర దర్శకుడు పుట్టన్న కనగళ్ పేరును ఎప్పుడూ గౌరవంగా ప్రస్తావిస్తూనే ఉంటారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక చిత్రాల్లో (236) నటించిన రికార్డ్ కూడా ఆయనకే సొంతం. కన్నడ వెండితెర ఇలవేల్పు రాజ్‌కుమార్ 206 సినిమాల్లో యాక్ట్ చేయగా, సాహస సింహ విష్ణువర్థన్ 230 సినిమాల్లో కనిపించారు.దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులైన సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌బాబు, మమ్ముట్టి తదితరులు ఆయనకు అత్యంత ఆప్త మిత్రులు.
అంబరీష్ కన్నడ ఇండస్ట్రీ 'ట్రబుల్ షూటర్' అనే పేరుని గడించారు. కన్నడ సినీ పరిశ్రమలో రాజ్‌కుమార్, విష్ణువర్థన్‌లతో సమానంగా సూపర్ స్టార్ హోదాను అంబరీష్ అనుభవించారు. అందుకే వీరి ముగ్గురిని కన్నడ చలనచిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్స్‌గా సినీ విశ్లేషకులు పేర్కొనేవారు. రాజ్‌కుమార్, విష్ణువర్థన్‌ల మరణాంతరం ఇండస్ట్రీలో ఎటువంటి మనస్పర్థలు ఏర్పడినా, చిన్న చిన్న గొడవలైనా కూడా ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదిర్చే బాధ్యతను అంబరీష్ తీసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఆయన్ని గౌరవంగా 'అప్పాజీ' (నాన్న) అని పిలుస్తారు. 1994లో 'మాండ్య గండు' (మాండ్య నుంచి వచ్చిన మనిషి) అనే చిత్రంలో యాక్ట్ చేశారు. ఆ సినిమా తర్వాత నుంచి అదే పేరుతో ఫేమస్ అయ్యారు ఆయన.
అంబరీష్‌ను కళియుగ కర్ణ అని కూడా పిలుస్తారు. ఏ సహాయం కోసమైనా తన దగ్గరికి వచ్చేవారికి లేదనకుండా ఇచ్చేవారు. రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత ఇలా ఎలాంటి సమస్యనైనా ఆయనకి చెబితే తమ సమస్య పరిష్కారం అవుతుందని కన్నడ ప్రజానీకం చాలా గట్టిగా నమ్మేవారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ఆయన చాలా ముందుండేవారు. తన అభిమాన సంఘాల ద్వారా కూడా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహింపజేసేవారు. ఇందువల్లే ఆయనకి సినిమాల కంటే వ్యక్తిగత అభిమానులే ఎక్కువగా ఉండేవారు.
నాలుగున్నర దశబ్దాల పాటు కన్నడ ప్రేక్షకులను అలరించిన అంబరీష్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. అంబీ ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదంతో కూడిన వాతావరణం ఉంటుందని అంటారు. షూటింగ్ సమయాల్లో తానూ స్టార్ హీరోను కాబట్టి ప్రత్యేక సౌకర్యాలు కావాలని ఏనాడు కోరలేదు. యూనిట్ బృందంతో పాటే తాను కూడా కలిసి భోజనం చేసేవారు, కబుర్లు చెప్పేవారు. ఒంటరి తనం ఆయనకి నచ్చని వ్యవహారం. ఎల్లప్పుడూ ఆయన చుట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉండేవారు. జీవితాంతం అజాత శత్రువుగా నిలిచిన అంబరీష్ తన 66వ ఏట 2018, నవంబర్ 24న అనారోగ్యంతో మరణించారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!