కార్పొరేట్ పొలిటీషియన్-సుజనా చౌదరి
- June 02, 2025
సుజనా చౌదరి...రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. బిజినెస్ రంగంలో సాధించిన పరపతిని, ఆర్థిక వనరులను పెట్టుబడిగా పెట్టి రాజకీయ పార్టీలకు దగ్గరయ్యారు. క్రియాశీలక రాజకీయాల్లో రాకముందు ఆయన అన్ని పార్టీలకు కావాల్సిన వాడిగా ఉండేవారు. అయితే, చంద్రబాబు ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ నచ్చి తెదేపాలో చేరారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబుకు అన్ని వ్యవహారాల్లో అండదండగా ఉంటున్నారు.బాబును కాపాడేందుకు బీజేపీలోకి వెళ్లారు. 2024లో ఢిల్లీ రాజకీయాల నుంచి ఏపీ రాజకీయాలకు బదిలీ అయ్యారు. ఈరోజు సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
రాజకీయ వర్గాల్లో సుజనా చౌదరిగా గుర్తింపు పొందిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి 1961,జూన్ 2న ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్ల గ్రామంలో యలమంచిలి జనార్దన రావు, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. వీరి స్వగ్రామం మాత్రం పామర్రు మండలంలో ఉన్న పెదమద్దాలి గ్రామం. తండ్రి ఇరిగేషన్ డిపార్టుమెంటులో అధికారి కావడంతో తరచూ బదిలీలు జరిగేవి కావడంతో హైదరాబాదులో స్థిరపడిన తాతగారింట్లో ఉంటూ చదువుకున్నారు. హైదరాబాద్ సీబీఐటీ కళాశాలలో బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసిన తర్వాత కోయబత్తూరులోని ప్రముఖ పీ. ఎస్. జి ఇంజినీరింగ్ కాలేజీలో ఎంఈ (మెషీన్ టూల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు.
సుజనా చౌదరి కుటుంబ నేపథ్యంలోకి వెళితే తాత (తండ్రి నాన్న) యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉమ్మడి మద్రాస్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోలీస్ అధికారిగా పనిచేశారు.టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి మరియు ఆచార్య రంగా వంటి ఉద్దండ రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితులు. ఆరోజుల్లోనే ఎందరో పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. తండ్రి జనార్దనరావు ఇంజనీరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు.
మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ట్రై చేయకుండా బిజినెస్ రంగంలోకి అదుపెట్టిన చౌదరి, తన తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా "సుజన" పేరుతో ఐరన్ ఫ్యాక్టరీని స్థాపించారు. అక్కడితో ఆగకుండా నిర్మాణం, పవర్ ప్లాంట్స్, టెలీ కమ్యూనికేషన్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలకు విస్తరించారు. 2000 ప్రారంభం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టాప్ 10 సంపన్న బిజినెస్ మ్యాన్స్ జాబితాలో చౌదరి ఉన్నారు. అయితే, చౌదరి బిజినెస్ ఎదుగుదల వెనుక కాంగ్రెస్, టీడీపీ పార్టీల పాత్ర చాలా కీలకం. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో సుజన గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఆర్థికంగా లబ్ది చేకూరింది. అందుకు ప్రతిఫలంగా విరాళాల పేరుతో భారీ ఎత్తున సమర్పించుకున్నారు.
బిజినెస్ బాగా విస్తరిస్తున్న సమయంలోనే తన మిత్రుడైన ల్యాంకో గ్రూప్ అధినేత లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి రాజకీయాలపై చౌదరికి ఆసక్తి ఏర్పడింది. ఎంపీగా రాజగోపాల్‌కు ఢిల్లీ స్థాయిలో లభిస్తున్న పరపతి, సివిల్ కాంట్రాక్ట్స్ వంటివి చౌదరిని బాగా ఆకర్షించాయి. అదే సమయంలో సీఎంగా ఉన్న వైఎస్సార్ సైతం చౌదరిని పార్టీలోకి తన దూతల ద్వారా ఆహ్వానం పలకడంతో పాటుగా ప్రభుత్వ సలహాదారు పదవిని అఫర్ చేశారు. అయితే, ఎంపీ పదవి మీద కన్ను ఉండటంతో ఆ అఫర్ తిరస్కరించడం జరిగింది. అయినప్పటికి పలు మార్గాల ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చినప్పటికి తను మాత్రం చేరలేదు.
చౌదరికి రాజకీయాల్లో ఆసక్తి ఉందని గమనించిన అప్పటి ప్రతిపక్షనేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తనకు, ఆయనకు సన్నిహితులైన వారి ద్వారా పార్టీలో చేరమని ఆహ్వానం పలికారు. చంద్రబాబు ఆహ్వానం పంపిన విషయం వైఎస్సార్ చౌదరిని అటువైపు పోయినీయకుండా బిజినెస్ పరంగా ఫెవర్స్ చేయడం మొదలుపెట్టారు. తనకు కావాల్సిన అవసరాలు తీరుతున్న సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టడానికి సమయం కాదని కొద్దీ కాలం సైలెంట్ అయ్యారు.
అయితే, 2009 ఎన్నికలకు ముందు చంద్రబాబు రాజ్యసభ ఎంపీ అఫర్ ఇవ్వడంతో తెదేపా వైపు మొగ్గారు. 2009 ఎన్నికల్లో తెదేపా ఎన్నికల ఖర్చులకు బోలెడంత చేతి చమురును విదిలించడంతో ఖుషి అయిపోయిన బాబు 2010లో తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపించారు. సుజనా చౌదరి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఢిల్లీలో విస్తృతమైన కాంటాక్ట్స్ ఏర్పరచుకున్నారు. యూపీఏ కూటమి అధికారంలో ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ద్వారా తన బిజినెస్సులకు కావాల్సిన పనులు తర్వతగతిన పూర్తి చేయించుకుంటూ, ప్రతిఫలంగా ఇవ్వాల్సిన బహుమతులు ఇచ్చుకుంటూ పోయారు. తన స్వకార్యంతో పాటుగా బాబు అప్పగించిన స్వామి కార్యాన్ని పూర్తి చేస్తూ వచ్చారు.
ఢిల్లీలో అడుగుపెట్టిన కొద్దీ రోజుల్లోనే అధికార వర్గాలు, ల్యూటెన్స్ మీడియా ప్రతినిధులు, ప్రభుత్వానికి దగ్గరగా ఉండే పలువురు హై క్లాస్ సోషలైట్స్, పార్టీలకు దండిగా ఫండ్స్ ఇచ్చే బిజినెస్ పీపుల్స్ వంటి వారందరని తన సన్నిహితులుగా మార్చుకున్నారు. చౌదరికి ఉన్న విస్తృతమైన నెట్వర్క్ బాబుకు రాజధానిలో తన పనులు చక్కబెట్టుకునేందుకు తోడ్పడింది. అందువల్లనే పార్టీలో చౌదరిని బాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఇతర ఎంపీలకు కొంత ఇబ్బందికి గురయ్యేలా చేసింది. ఇందులో బాబు బావమరిది స్వర్గీయ నందమూరి హరికృష్ణ ఉన్నారు అనే వార్త అప్పట్లో బాగా చక్కర్లు కొట్టింది. ఇతర ఎంపీలకు ఇది రుచించకపోయినా బాబు మరో ముఖ్య అనుచరుడైన సీఎం రమేష్ రాజ్యసభకు వచ్చే వరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీలో చౌదరి హవానే సాగింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం కోసం చౌదరి కీలకమైన పాత్ర పోషించారు. ఢిల్లీలో తన నెట్వర్క్ ద్వారా మోడీ నేతృత్వంలో భాజపా అధికారంలోకి రాబోతుందని తెలుసుకొని, వారితో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా చాలా లాభం పొందొచ్చని బాబును బాగా కన్విన్స్ చేశారు. చౌదరితో ఏకీభవించిన చంద్రబాబు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రంగంలో దిగి భాజపా పెద్దలకు అత్యంత దగ్గరైన నాయకులతో పొత్తు చర్చలు ప్రారంభించారు. అదే సమయంలో వెంకయ్య నాయుడును కలిసి భాజపాతో పొత్తు పట్ల బాబు సుముఖతను తెలియజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ మరియు ఇతర కీలక నేతలను ఒప్పించి తెదేపాతో పొత్తు కుదిర్చారు. ఆ విధంగా చౌదరి వల్ల ఆ ఎన్నికల్లో భాజపా, తెదేపా మధ్య పొత్తు ఏర్పడింది.
2014 ఎన్నికలకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చడానికి చౌదరి కీ రోల్ పోషించారు. హైదరాబాద్, కోస్తా ప్రాంతంలో తనకు అత్యంత సన్నిహితులైన వ్యాపారవేత్తలు, ఆయా జిల్లాలలో ఉన్న అతిపెద్ద ఆటోమొబైల్ షో రూమ్స్ యాజమానల ద్వారా పార్టీ నుంచి అభ్యర్థులకు అందాల్సిన డబ్బుకు లోటు లేకుండా చేశారు. ఇవే కాకుండా ఏయే జిల్లాలలో అభ్యర్థులకు కావాల్సిన లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ వంటి వ్యవహారాలను పర్యవేక్షణ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తెరపైన చంద్రబాబు ఎంత కష్టపడ్డారో, తెరవెనుక పార్టీ అభ్యర్థుల అవసరాలు తీర్చడానికి చౌదరి అంతే కష్టపడ్డారు. ఆ ఎన్నికతో అప్పటి వరకు చౌదరిని విమర్శించే పార్టీ నేతలందరూ ఆయనతో సన్నిహితంగా మెలిగేందుకు క్యూ కట్టడం మొదలుపెట్టారు.
పార్టీ గెలుపు కోసం కృషి చేసినందుకు కేంద్రంలో కొలువైన ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపాకు దక్కిన రెండు మంత్రివర్గ పదవుల్లో కేంద్ర సహాయ మంత్రి పదవికి సుజనా చౌదరిని బాబు నామినేట్ చేశారు. 2014-18 వరకు మోడీ మంత్రివర్గంలో కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి రావడంతో పాటుగా బాబు ప్రతినిధిగా ఢిల్లీ రాజకీయాల్లో కీలకమైన గుర్తింపు ఆయన్ని ఒక్కసారిగా ల్యూటెన్స్ వర్గాల్లో అత్యంత ప్రముఖుడిని చేశాయి. చంద్రబాబుకు దగ్గరవ్వాలంటే చౌదరిని మచ్చిక చేసుకోవాలని భావించిన పలువురు మీడియా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సోషలైట్లు ఆయన్ని కలిసేందుకు, పరిచయాలు పెంచుకునేందుకు బాగా ఉవ్విళ్ళూరేవారు. ఆరోజుల్లో ఢిల్లీలో చౌదరి ద్వారానే చంద్రబాబు వద్ద అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయించుకున్న వారు చాలా మంది ఉన్నారు.
కేంద్రమంత్రిగా తీరికలేకుండా గడుపుతున్నప్పటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంస్థలు మరియు పలు స్పెషల్ ఆర్థిక ప్యాకేజీల విషయంలో వెంకయ్యనాయుడు ద్వారా ప్రధాన మంత్రిని, అమిత్ షాకు విన్నవించడాన్ని తన విధిగా మార్చుకున్నారు. చౌదరి పనితీరు, వ్యవహారాలను చక్కబెట్టే తీరు పట్ల ప్రధాని సైతం సంతృపి వ్యక్తం చేసేవారు. వెంకయ్య, అశోక్ గజపతిరాజు, వీరు కలిసి రాష్ట్రానికి రావాల్సిన మెజారిటీ జాతీయ విద్యాసంస్థలు, పరిశ్రమలు మరియు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అయితే, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల వ్యాపారాలు బాగా దెబ్బతిని బ్యాంకులకు ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల జాబితాలోకి సుజన గ్రూప్ వెళ్లడం చౌదరిని కొంత ఇబ్బందికి గురిచేసిన మాట వాస్తవం.
మంత్రి పదవి, ఢిల్లీలో ప్రత్యేకమైన గుర్తింపు ఇలా బాగా సాగుతున్న సమయంలోనే 2016లో తిరిగి రెండోసారి రాజ్యసభకు సుజనా చౌదరి ఎన్నికయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అంశం మరియు ఇతర రాజకీయ వ్యవహారాల్లో భాజపా, తెదేపాల మధ్య విభేదాలు రావడంతో 2018లో ప్రభుత్వం నుంచి తెదేపా బయటకు రావడం జరిగింది. ఇది అప్పటి కేంద్రమంత్రులుగా ఉన్న అశోక్ గజపతి రాజు గారికి, చౌదరికి కొంచం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా చౌదరికైతే భాజపాతో తెదేపా ఇలా తెగతెంపులు చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మోడీతో రాజకీయ వైరం పెట్టుకోవడం కొరివితో తల గోక్కోవడం లాంటిదేనని తన సన్నిహితుల వద్ద అనేక సార్లు అనేవారు. తన వాదన వాస్తవ రూపంలోకి రావడానికి అట్టే సమయంలో పట్టలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెదేపాను గెలవనీయకుండా భాజపా పెద్దలు అష్ట దిగ్బంధనం చేయడంతో ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యింది. ఈ ఎన్నికలో బాబు తనయుడు లోకేష్ అతి జోక్యం కూడా పార్టీ కొంపముంచిందనేది వాస్తవం. ఆ దశలోనే లోకేష్ తన తండ్రి బాబులాగా చౌదరితో చక్కగా సమన్వయం చేసుకోలేక పోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పార్టీ బాగా నష్టపోయింది. ఆ ఎన్నికల తర్వాత చౌదరి సైలెంట్ అయిపోయారు. కేవలం ఢిల్లీకే పరిమితం తన సంస్థలను ఈడీ జాబితాలోకి వెళ్లకుండా తనుకున్న పాత పరిచయాల ద్వారా లాబీయింగ్ చేసుకుంటూ గడిపేస్తూ వచ్చారు.
పార్టీ ఓటమిలో తనయుడి తప్పులను గుర్తించిన బాబు, తిరిగి చౌదరిని పిలిపించుకొని మాట్లాడారు. బాబు మళ్ళీ తన పట్ల నమ్మకాన్ని ఉంచడంతో ఉత్సాహంగా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటూ, ఢిల్లీలో మళ్ళీ భాజపా అగ్రనేతలతో స్నేహ హస్తం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాబు సూచనల మేరకు సీఎం రమేష్‌ను కలుపుకొని భాజపా కొత్త అధ్యక్షుడు జెపి నడ్డాను కలుస్తూ వచ్చారు. నడ్డాతో ఉన్న పరిచయం వల్ల బాబు పట్ల మోడీ- షా ద్వయం ఆలోచనలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. తమకు తెలిసిన ప్రతి వార్తను బాబుకు చేరవేస్తూ వచ్చారు.
చౌదరి పట్ల కొంత సానుకూలత ఉండటంతో పార్టీలో చేర్చుకోమని, చేరకపోతే అతని సుజన సంస్థలపై ఈడీ, సీబీఐలను వదలమని చెప్పడంతో భయపడ్డ చౌదరి, అదే విషయాన్ని బాబుకు తెలియజేశారు. బాబు కూడా పరిస్థితులకు అనుగుణంగా అలోచించి ఆ పార్టీలోకి వెళ్ళమనడంతో ఢిల్లీ భాజపా కేంద్ర కార్యాలయంలో నడ్డా, షాల సమక్షంలో తనతో పాటుగా ఇతర టీడీపీ రాజ్యసభ సభ్యులైన రమేష్, టీజీ వెంకటేష్‌లు చేరారు. తెదేపాతో బంధం తెగిపోయినప్పటికి బాబుతో మాత్రం నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలకు దగ్గరగా మసులుతూ బాబు పైన క్రమ క్రమంగా వ్యతిరేకతను పోగొట్టి సానుకూలతను తీసుకురావడంలో చాలా వరకు విజయం సాధించారు.
2022లో తన రాజ్యసభ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో ఉండి రాబోయే ఎన్నికల్లో తెదేపాతో మళ్ళీ పొత్తు కట్టేలా పార్టీ పెద్దలను ఒప్పిస్తూ వచ్చారు. చౌదరితో పాటుగా వెంకయ్యనాయుడు ముఖ్యఅనుచరుడైన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సైతం బాబు పట్ల సానుకూల వైఖరితో ఉండటం వల్ల తనవంతుగా మోడీ - షాలను ఒప్పించారు. అలా, 2024 ఎన్నికల నగారా మోగే నాటికి మళ్ళి తెదేపా - జనసేన- భాజపాలు పొత్తు కుదుర్చుకున్నాయి. చౌదరి విజయవాడ లేదా ఏలూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు అని వార్తలు వచ్చినప్పటికి కొన్ని కారణాల వల్ల విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. మొదట్లో ఎమ్యెల్యేగా పోటీ చేయడానికి ఇష్టం లేకున్నా, బాబు అభయం ఇవ్వడంతో పోటీ చేసి ఎమ్యెల్యేగా విజయం సాధించారు.
చౌదరి ఎమ్యెల్యేగా ఉన్నా, మనసంతా ఢిల్లీ చూట్టే తిరుగుతుందంటారు. ఎందుకంటే, ఇప్పటి వరకు రాజకీయాలతో తన వ్యాపారాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కంపెనీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ సమయంలో ఎంపీగా ఢిల్లీలో ఉండటం ద్వారా పలు నిర్మాణ, పవర్ ప్రాజెక్ట్స్ సాధించడానికి వీలుగా ఉండేదని అనుకున్నప్పటికి అది నెరవేరలేదు. అయితే, తన కోసం కష్టపడిన సుజనాచౌదరిని మళ్ళీ ఆర్థికంగా నిలబెట్టేందుకు బాబు బాగానే కృషి చేస్తున్నారని అమరావతి వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ నిర్మాణంలో చౌదరి కంపెనీలను భాగస్వామిగా చేయించారు అని విశ్వసనీయ వర్గాల కథనం. ఏది ఏమైనప్పటికి తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన బాబు విపత్కర పరిస్థితుల్లో చౌదరి అండగా నిలవడాన్ని బట్టి చూస్తే రాజకీయాల్లో ఇలాంటి కార్పొరేట్ పొలిటిషియన్ల అవసరం చాలా ఉందనే భావన కలుగుతుంది.
--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!