విలక్షణ నటుడు-ఉత్తేజ్
- June 02, 2025
ఉత్తేజ్ పేరు వింటే ఇప్పటికీ ఆయన తొలి చిత్రం శివలోని యాదగిరి పాత్రనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా మొదటి సినిమాలోనే కనిపించింది కొన్ని నిమిషాలే అయినా, తన ప్రతిభతో ఆకట్టుకున్నారు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ అప్పటి నుంచీ తాను రూపొందించిన పలు చిత్రాలలో ఉత్తేజ్ కు అవకాశాలు కల్పించారు. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలలోనూ ఉత్తేజ్ యాదగిరిగానే కనిపించి ఆకట్టుకోవడం విశేషం. ఇలా ఒకే పాత్రలో వేర్వేరు చిత్రాలలో నటించడం అన్నది ఉత్తేజ్ కు లభించిన మంచి అవకాశం. దానిని ఆయన సద్వినియోగ పరచుకున్నారు కూడా. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
ఉత్తేజ్ అలియాస్ ఆకుపత్ని ఉత్తేజ్ 1969, జూన్ 2న ఉమ్మడి నల్గొండ జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురంలో ఆకుపత్ని శ్రీరాములు, శకుంతలమ్మకు జన్మించాడు. తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామం, భువనగిరిలలోనే పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్, సిటీ కాలేజీలో
సైన్స్ డిగ్రీ పూర్తి చేశాడు.
పల్లెటూరి పిల్లగాడా…. పశులగాసే మొనగాడా… అన్న పాట ఆ రోజుల్లో వెట్టిచాకిరిని నిరసిస్తూ తెలుగునేల అంతటా ఓ వెలుగు వెలిగింది. ఆ పాట రాసిన సుద్దాల దేవయ్య గారి కూతురు కుమారుడే ఉత్తేజ్.ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు నాటకాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు. ఆ ప్రభావమే ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే నటన పై ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి ఏర్పడి 1989లో ఆర్జీవీ మొదటి చిత్రం శివకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే చిత్రంలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు.
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొన్ని చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ లోనూ పాలు పంచుకున్నారు ఉత్తేజ్. ఇప్పటికీ తన దరికి చేరిన రచనా అవకాశాలను ఆయన వినియోగించుకుంటూనే ఉన్నారు. 90, 2000 దశకాల్లో ఎంతో మంది హీరోలకు ఉత్తేజ్ ఫ్రెండ్‌గా నటించి మెప్పించారు. శ్రీకాంత్, జేడీ చక్రవర్తితో పాటు పవన్ కళ్యాణ్ కు కూడా పలు చిత్రాలలో స్నేహితునిగా నటించి అలరించారు. ఇక టాప్ హీరోల చిత్రాల్లోనూ ఉత్తేజ్ కు తగిన పాత్రలే లభించాయి. తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయప్రవేశం చేయగల సత్తా ఉత్తేజ్ సొంతం. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా రాణిస్తున్న ఉత్తేజ్, ఆ మధ్య విజయ్ దేవరకొండ టాక్సీవాలాలో విలన్ గానూ మెప్పించారు.
తన మేనమామ, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినిమా రంగానికి పరిచయం చేశాడు. ఎక్కడైనా మేనల్లుడి మేలు కోరి మేనమామలు తమకు తెలిసిన వారివద్ద ఉద్యోగాల్లో పెడుతూ ఉంటారు. ఇక్కడ సీన్ రివర్స్! తన మేనమావ సుద్దాల అశోక్ తేజను దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేశాడు. ఇంకేముంది సుద్దాల అశోక్ తేజ తన కలం బలంతో అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకున్నారు. చిరంజీవి ఠాగూర్ చిత్రానికి సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం… పాట ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ గేయరచయితగా అవార్డు కూడా సంపాదించి పెట్టింది. దీనిని బట్టి ఇక్కడ మేనమామ మేలు కోరాడు ఈ మేనల్లుడు అని చెప్పక తప్పదు.
ఉత్తేజ్ కు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద పాప తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో నాకు కుక్క కావాలి… అంటూ మారాం చేస్తూ గారాలు పో్యి నటించింది. తరువాత పెద్దకూతురు, చిన్న కూతురు ఇద్దరూ సంగీతసాధన చేశారు. అవకాశం దొరికినప్పుడు వారి గాత్రం వినిపిస్తూ ఉంటారు. ఉత్తేజ్ ఆధ్వర్యంలో మయూఖ అనే నటనాశిక్షణాలయం కొనసాగుతోంది. శ్రీకృష్ణదేవరాయనగర్ లో ఉన్న ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా పలువురు సినిమా రంగంలో తమ కలలు నెరవేర్చుకున్నారు. నటనలో కొనసాగుతూనే భావి నటీనటులకు శిక్షణ ఇస్తున్న ఉత్తేజ్ మరింత మందిని చిత్రసీమకు పరిచయం చేస్తారేమో చూద్దాం.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!