ఉపాధి హామీ పథకం రూపకర్త...!
- June 06, 2025
బీహార్ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో రఘువంశ్ ప్రసాద్ ఒకరు. నితీశ్, లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ వంటి వారు ఏళ్లకు ఏళ్ళు పదవులు చేపట్టిన రాని గుర్తింపును ఉపాధి హామీ పథకం రూపకల్పన, అమలు చేయడం ద్వారా ఆయన సాధించారు. సోషలిజం భావజాలానికి ఆకర్షితుడై జీవితాంతం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. నేడు సోషలిస్టు రాజకీయ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
రఘువంశ్ బాబు అలియాస్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ 1946, జూన్ 6వ తేదీన అవిభక్త బీహార్ రాష్ట్రంలోని ఉమ్మడి ముజాఫర్‌పూర్ జిల్లాలోని షాపూర్ అనే కుగ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన రామ్ వృక్ష్ సింగ్ దంపతులకు జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే సాగింది. ఆ తర్వాత హైస్కూల్, ఇంటర్ విద్యను ముజాఫర్‌పూర్ పట్టణంలో పూర్తి చేసిన తర్వాత చాప్రాలోని రాజేంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సి మ్యాథ్స్, ముజాఫర్‌పూర్ పట్టణంలో ఉన్న లంగత్ సింగ్ కళశాలలో మ్యాథ్స్‌లోనే ఎంఎస్సీ.1992లో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పూర్తి చేశారు.
రఘువంశ్ ప్రసాద్ ముజాఫర్‌పూర్ పట్టణంలో చదువుతున్న రోజుల్లోనే రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ మరియు బస్వాన్ సింగ్ దిగ్గజ సోషలిస్టు నేతలను అభిమానించేవారు. 1967లో పాట్నా యూనివర్సిటీలో పిహెచ్‌డి కోసం వెళ్లిన తర్వాత అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ వంటి పలువురు ఆయనకు పరిచయం అయ్యారు. వీరందరిలో లాలూకు రఘువంశ్ బాగా దగ్గరయ్యారు. వీరందరూ సోషలిస్టు భావజాలం పట్ల ఆకర్షితులై సంయుక్త సోషలిస్టు పార్టీ విద్యార్ధి విభాగంలో పనిచేయడం మొదలుపెట్టారు. లాలూ యూనివర్సిటీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో రఘువంశ్, నితీష్‌లు కలిసి పనిచేశారు.
1973లో జెపి ఉద్యమంలో లాలూ, నితీష్‌లతో పాటుగా చేరారు. ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న సమయంలోనే సీతామర్హి జిల్లా సోషలిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపార్టీ నుంచి పోటీ చేసి బెల్సాద్ నుంచి ఎన్నికయ్యారు. 1977 -79 వరకు కర్పూరి ఠాకూర్ మంత్రివరంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. 1980,1985లలో అక్కడి నుంచే ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో కర్పూరి ఠాకూర్ మద్దతుదారుగా ఉన్నారు. 1988లో ఠాకూర్ మరణం తర్వాత లాలూకు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలోనే జనతా పార్టీ, లోక్ దళ్ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
1988 మధ్యలోనే జనతాదళ్ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత లాలూ, నితీష్, అబ్దుల్ బారీ సిద్దిఖీలతో కలిసి ఆ పార్టీలో చేరారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ బీహార్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎంగా ఎవరు ఉండాలనే సందిగ్ధత చోటు చేసుకున్న సమయంలో నితీశ్, వీరు మరియు పార్టీ అగ్రనేతలైన దేవీలాల్, చంద్రశేఖర్‌లు లాలూకు మద్దతుగా నిలిచి సీఎం అయ్యేలా సహకరించారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 1991లో బీహార్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 1991-94 వరకు బీహార్ శాసనమండలి ఉపనేతగా వ్యవహరిస్తూ లాలూ ప్రభుత్వ తీసుకున్న చర్యలకు మద్దతుగా మండలిలో తన వాదనలను బలంగా వినిపిస్తూ వచ్చారు.
1994-95 వరకు శాసనమండలి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సమయంలోనే లాలూతో నితీశ్ విభేదించి పార్టీకి రాజీనామా చేసి సమతా పార్టీ పెట్టుకోవడం వల్ల పార్టీలోని అన్ని వ్యవహారాలను నడిపించేందుకు రఘువంశ్ మీదే ఆధారపడ్డారు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి బెల్సాద్ ఎన్నికైన తర్వాత లాలూ మంత్రివర్గంలో ఇంధన వనరులు, కరువు సహాయక పునరావాస, భాషా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో వైశాలి నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత దేవెగౌడ మంత్రివర్గంలో 1997-97 వరకు కేంద్ర పశుసంవర్థక, డెయిరీ శాఖల (స్వతంత్ర) మంత్రిగా, 1997-98 వరకు ఐ.కె. గుజ్రాల్ మంత్రివర్గంలో కేంద్ర ఆహార మరియు వినియోగదారుల శాఖల (స్వతంత్ర) మంత్రిగా పనిచేశారు.
1997లో లాలూ జనతాదళ్ పార్టీ నుంచి వేరుపడి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్లమెంట్లో ఆర్జేడీ పక్ష నేతగా వ్యవహరించారు. 1998లో ఎన్డీయే కూటమి బీహార్లో ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన విధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ పార్లమెంట్లో పోరాడారు. రఘువంశ్ బాబుకు మద్దతుగా అప్పటి విపక్షాలు సైతం గట్టిగా ప్రతిఘటించడం వల్ల వాజపేయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1999లో లాలూ ఎంపీగా ఓటమి పాలైన తర్వాత 1999-2004 వరకు ఆర్జేడీ పార్లమెంటరీ పక్షనేతగా పనిచేశారు. 2004లో మూడోసారి వైశాలి నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2009 వరకు కొనసాగారు.
భారతదేశ రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాల దుర్భరమైన పరిస్థితులు, అక్కడి ప్రజల సతిగతుల గురించి పూర్తి అవగాహన ఉన్న అతికొద్ది మంది నాయకుల్లో రఘువంశ్ ప్రసాద్ ఒకరు. గ్రామాల్లో వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని సన్నకారు రైతులు, అనుబంధ రంగాల కార్మికులు బ్రతుకుతున్నారు. కరువులు, వరదలు వల్ల పంటలు నష్టపోయి, గొడ్డు గోదా మరణిస్తే ఎటువంటి ఆదాయం లేక వారు బలవనతంగా పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఈ పరిస్థితిని రూపుమాపడానికి ప్రభుత్వమే వారికి పనికల్పించి నెలనెలా జీతం రూపంలో వారికి అందించడం ద్వారా పరిస్థితిని మెరుగుపర్చవచ్చని నమ్మిన రఘువంశ్ బాబు, అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో ఆలోచనను పంచుకోగా మన్మోహన్ సింగ్ మొదట్లో కొంత వ్యతిరేకత చేసినప్పటికి సోనియా మాత్రం పూర్తి సమ్మతిని తెలపడం జరిగింది.
2005లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లును రఘువంశ్ ప్రవేశపెట్టగా సంపూర్ణ మద్దతుతో ఆమోదం బిల్లు ఆమోదం పొందింది. 2006 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో విజయవంతంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ పథకాన్ని మొదట్లో విమర్శించిన ప్రతి ఒక్కరు తర్వాతి కాలంలో ప్రశంసలు వర్షం కురిపించారు. పేదరిక నిర్ములనకు రూపొందించే ప్రజా ఉపాధి కార్యక్రమాల్లో ఇండియాలో అమలు చేసిన ఉపాధి హామీ పథకం చాలా మెరుగైనదిగా ప్రపంచస్థాయి ఆర్థిక వేత్తలు కొనియాడారు. గత రెండు దశబ్దాల నుంచి ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలు పేదరికపు అంచుల నుంచి బయటికి వచ్చారు. ఈరోజు గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ కార్మికులు ఏడాది పాటు ఉపాధి పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.
ఉపాధి హామీ పథకం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాల్లో రఘువంశ్ ప్రసాద్ పలుకుబడి పెరిగింది. అయితే, తనకంటే ఎక్కువ గుర్తింపు రావడాన్ని సహించలేని లాలూలో ప్రసాద్ పట్ల ఈర్ష్య మొదలైంది. 2009లో బీహార్ నుంచి ఆర్జేడీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికి గ్రామీణభివృద్ధి శాఖను తిరిగి ప్రసాద్‌కు ఇచ్చేందుకు సోనియా, ప్రధాని మన్మోహన్ సుముఖుంగా ఉన్నా, లాలూ అడ్డుపడటంతో ఏమి చేయలేకపోయారు. ప్రసాద్ సైతం లాలూ నిర్ణయానికి కట్టుబడి సాధారణ సభ్యుడిగానే కొనసాగారు. అయినప్పటికి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే సమయంలో మన్మోహన్ రఘుబాబు సూచనలు తీసుకునేవారు. సోనియా గాంధీ సైతం తన అధ్యక్షత వహిస్తున్న జాతీయ సలహాదారు మండలి(NAC) తీసుకున్న ప్రో పూర్ మాస్ ప్రోగ్రామ్స్ నిర్ణయాలను రఘువంశ్ బాబుకు పంపి ఆయన సలహాలు, సూచనలు తీసుకునేవారు. 2009-14 వరకు మంత్రివర్గంలో సభ్యుడు కాకపోయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాల్లో భాగమయ్యేవారు.
2014,2019లలో మోడీ మానియా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్‌లలో బలంగా ఉండటంతో పాటుగా తానూ ప్రాతినిధ్యం వహించిన వైశాలిలో ఉప్పునిప్పులా ఉండే భూమిహార్, బనియా కులస్తులు ఏకమై రఘువంశ్ బాబును ఓడించారు. ఎన్నికల్లో ఓటమి ఒక ఎత్తు ఒకటైతే ఆర్జేడీలో లాలూ తనయుల హవా మొదలైన ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లాలని గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికి తనను పక్కన పెట్టి వ్యాపారవేత్తలకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడంతో నొచ్చుకున్నారు. లాలూ జైల్లో ఉండటం వల్ల కూడా తన సహచరుడైన రఘువంశ్ బాబును పట్టించుకోవడం తగ్గిపోయింది. వీటన్నిటితో మనస్థాపం చెంది పార్టీ కార్యక్రమాలకు క్రమంగా జరుగుతూ వచ్చారు. 2020, సెప్టెంబర్ నెలలో కరోనా సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. 2020, సెప్టెంబర్ 13న తన 74వ ఏట కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..