బలహీన వర్గాల నాయకుడు-లాలూ ప్రసాద్ యాదవ్
- June 11, 2025
భారతదేశ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పార్లమెంట్ వేదికగా ఆయన మాట్లాడిన హాస్యోక్తుల మాటలు. అయితే, 90వ దశకంలోకి వెళ్తే బీహార్ రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా పాలించిన పాలకుడిగా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రాజకీయ నియంతగా కీర్తించబడిన వ్యక్తిగా లాలూ ఎవరికి తెలియదు. మండల్ కమిషన్ సిపారస్సులు అమలు చేయించడం, హిందుత్వ వాదులకు వ్యతిరేకంగా నిలవడం అనే రెండు విషయాలు మూలంగా బలమైన ఓటు బ్యాంకుగా ఉండే రెండు వర్గాలను తనవైపు తిప్పుకున్న నాయకుడిగా నిలిచారు. సీఎంగా, రైల్వే మంత్రిగా పనిచేసినప్పటికి ఆ పదవులకు ఎటువంటి న్యాయం చేయలేదు. నేడు బీహార్ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
లాలూ యాదవ్ అలియాస్ లాలూ ప్రసాద్ యాదవ్ అసలు పేరు లాలూ ప్రసాద్ రాయ్. 1948,జూన్ 11న అవిభక్త బీహార్ రాష్ట్రంలోని ఉమ్మడి సరన్ జిల్లా ఫూల్వరియా గ్రామంలోని దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో కుందన్ రాయ్, మాచరియా దేవి దంపతులకు 6వ సంతానంగా జన్మించారు. లాలూ ప్రాథమిక విద్యను గ్రామంలో పూర్తిచేసిన తర్వాత పాట్నాలో ఉన్న మేనమామలు దగ్గరికి వెళ్లి చదువుకోవడం ప్రారంభించారు. పాట్నాలో ఉన్న మిల్లర్స్ హైస్కూల్ నుంచి మెట్రిక్యులేషన్, బీఎన్ కాలేజీ నుంచి పీయూసీ, డిగ్రీ పూర్తి చేసి పాట్నా వెటర్నరీ కాలేజీలో క్లర్క్ అయ్యారు. ఆ తర్వాత పాట్నా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి లా పూర్తిచేశారు.
లాలూ పీయూసీ చదివే రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఆరోజుల్లో యాదవ సామాజిక వర్గం నుంచి అంత వరకు చదివిన వ్యక్తులు లేకపోవడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు లాలూను దగ్గరకు తీయడం మొదలుపెట్టారు. అదే సమయానికి బీహార్ రాష్ట్రంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి సోషలిజం పట్ల చదువుకుంటున్న యువతలో ఆకర్షణ ఏర్పడింది. సోషలిజం గురించి ఏమి తెలియకపోయినా, రాజకీయంగా పైకి రావడానికి ఉపయోగపడే వేదికగా లాలూ భావించి ఆ పార్టీ విద్యార్ధి విభాగంలో చేరారు. ఒకవైపు క్లర్క్ ఉద్యోగం చేస్తూనే లా చదువుతూ సోషలిస్టు విద్యార్ధి విభాగంలో క్రియాశీలకంగా ఉంటూ తన తోటి విద్యార్థులను ఆకర్షించారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్, నితీశ్ కుమార్ వంటి వారు తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
యూనివర్సిటీ రాజకీయాల్లో ఉన్నప్పుడే యాదవ రాజకీయ నేతలు లాలూను బాగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అప్పటి బీహార్ దిగ్గజ సోషలిస్టు నాయకుడైన కర్పూరి ఠాకూర్ వద్ద లాలూ పరపతి సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే, లాలూ ప్రసాద్ రాజకీయ వైఖరిని గమనించిన ఆయన ఎక్కువగా దగ్గరకి రానీయలేదు. కర్పూరికి దగ్గర కాలేకపోయినా, మిగిలిన నేతలకు లాలూ బాగా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. పాట్నా యూనివర్సిటీ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి లాలూకు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకుల పరిచయాలు అయ్యాయి. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాల్సి ఉండగా 1973లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన నవనిర్మాణ ఆందోళన తర్వాత ఆలోచన విరమించుకున్నారు.
1973లో జెపి నాయకత్వంలో జరిగిన సంపూర్ణక్రాంతి ఉద్యమంలో నితీశ్ కుమార్, రఘువంశ్ ప్రసాద్, సుశీల్ మోడీలు క్రియాశీలకంగా పాల్గొంటున్న సమయంలో లాలూ మొక్కుబడిగా పాల్గొంటూ వచ్చారు. ఈ సమయంలో లాలూ రాజకీయ నాయకుల దగ్గర లేదా, పాట్నా వెటర్నరీ కళాశాల ఆవరణలో పశువుల పాలు పిండుకుంటూ గడిపేవారు. ఎప్పుడైతే ఇందిరా ఎమర్జెన్సీ విధించిందో అప్పటి జెపితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. అయితే, విద్యార్ధి నాయకుడిగా ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేసి పాట్నా జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న రోజుల్లో తన హాస్యచలోక్తులను విసురుతూ అందరిని కడుపుబ్బా నవ్వించేవారు. ఈ సమయంలోనే అగ్రనాయకులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.
1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత లాలూను రాజకీయాల్లోకి అనివార్యం అయ్యింది. జెపి ఆశీస్సులతో జనతా పార్టీలో చేరిన లాలూ మొదట అసెంబ్లీకి మాత్రమే పోటీ చేయాలని అనుకున్నా, సీనియర్ నేతల ప్రోద్బలంతో చాప్రా నుంచి పోటీ చేసి పార్లమెంటుకు 29వ ఏట ఎన్నికయ్యారు. 1980లో అదే స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత, ఆ ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనాపూర్ నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. జనతాపార్టీ ముక్కలైన తర్వాత చరణ్ సింగ్ నాయకత్వంలోని లోక్ దళ్ పార్టీలో చేరారు. 1985లో కూడా అదే స్థానం నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో కర్పూరి మరణంతో విపక్షనేతగా ఎన్నికయ్యారు. 1988 చివర్లో జనతాదళ్ పార్టీ ఏర్పడిన తర్వాత అందులో తన స్నేహితులైన నితీశ్ కుమార్, రఘువంశ్ బాబులతో కలిసి చేరిన లాలూ 1989లో ఛాప్రా నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
1990 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ విజయం సాధించడంతో పార్టీ అగ్రనేతలైన దేవీలాల్, చంద్రశేఖర్ ఆశీస్సులు, తన మిత్రులైన నితీశ్, రఘువంశ్ సహకారంతో బీహార్ సీఎం అయ్యారు. 1990-97 వరకు బీహార్ సీఎంగా ఉన్న లాలూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకుపోయారు. సామాజిక న్యాయం పేరుతో దోపిడీ, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చారు. లాలూ పాలన చూసి ప్రపంచం మొత్తం ఇండియాను చూసి నవ్వుకునేలా సాగింది. ఆ ఆటవిక పాలనలో తనకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపి యాదవ, ముస్లిం సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకున్నారు. 1997లో దాణా కుంభకోణం తర్వాత తన పదవికి రాజీనామా చేసి నిరక్ష్యరాస్యురాలైన తన భార్య రబ్రీ దేవిని సీఎం చేశారు. రబ్రీ సీఎంగా ఉన్నప్పటికి లాలూ వ్యక్తి పూజకే పరిమితం కావడంతో రోజువారీ పాలన వ్యవహారాల్లో జాప్యం జరిగేది. 2005 నాటికి లాలూ కుటుంబ పాలనలో రాష్ట్రం దివాళా తీసింది.
1997లో జనతాదళ్ నుంచి వేరుపడి ఆర్జేడీని స్థాపించిన లాలూ 1998లో మాధేపురా నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2002-04 మధ్య రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2004లో శరన్ నుంచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాలూ భారీ ఎత్తున అవినీతి చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేశారు. 2009లో పాట్నా నుంచి పోటీచేసి జేడీయూకు చెందిన అనామకుడి చేతిలో ఓడిపోయారు. 2012లో దాణా కుంభకోణంలో అరెస్ట్ అయ్యి 2024 దాక రాంచీ జైల్లో గడిపారు. అనారోగ్యం కారణంగా 2024లో విడుదలై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నారు. లాలూ కుమార్తె మీసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.
ఐదు దశాబ్దాల లాలూ రాజకీయ జీవితం మొత్తం అవకాశవాదం, అవినీతి అక్రమాలతో సాగింది. దేశం మెచ్చే గొప్ప నాయకుడిగా అయ్యే ప్రతి అవకాశాన్ని నాశనం చేసుకొని కుల నాయకుడిగా మిగిలిపోయారు. తన ప్రవర్తనతో అత్యంత సన్నిహితుడైన నితీశ్ కుమార్ వంటి గొప్ప ఎన్నికల వ్యూహకర్తను దూరం చేసుకున్నారు. కుల రాజకీయాలతో కాలం గడిపి ఆ రాజకీయ వారసత్వాన్ని తన పిల్లలకు అందజేశారు తప్పించి పెద్దగా సాధించింది ఏమి లేదనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది.
--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!