సీఎం రేవంత్ రెడ్డి పై అట్రాసిటీ కేసు చెల్లదు
- June 14, 2025
హైదరాబాద్: ఓ భూవివాదంలో కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు కొనసాగాయి.ఘటనాస్థలంలో లేని తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చెల్లదని రేవంత్‌రెడ్డి పేర్కొనగా..దిగువ కోర్టులో ట్రయల్ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదుదారు వాదించారు.గోపన్‌పల్లి గ్రామం సర్వే నెంబర్ 127లో ఉన్న రాజోల్ ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూమిని ఆక్రమించడంతోపాటు సొసైటీ నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారని పేర్కొంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో 2016లో ఫిర్యాదు నమోదైంది.ఆ సొసైటీ అధ్యక్షుడు ఎన్ పెద్దిరాజు ఈ ఫిర్యాదు చేశారు. ఏ-1గా కొండల్‌రెడ్డి, ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్‌రెడ్డిని చేర్చారు.దర్యాప్తు పూర్తయి ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో 2020లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ తాజాగా శుక్రవారం మరోసారి జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదిస్తూ.. రేవంత్‌రెడ్డి ఘటనా స్థలంలో లేరని.. అక్కడ లేని వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేయడం చెల్లదని పేర్కొన్నారు.భూవివాదం ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు వర్తించవని తెలిపారు.ఇది ఫిర్యాదుదారు సొంత భూమి కాదని.. సొసైటీ భూమి అని.. సొసైటీ ఎలా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతుందని ప్రశ్నించారు. పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ..ఈ కేసులో 8 మంది సాక్షులను విచారించామని..అందులో ఒక్కరు కూడా రేవంత్‌రెడ్డి అక్కడ ఉన్నట్లు చెప్పలేదని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు అయిన పెద్దిరాజు తరఫు న్యాయవాది నిమ్మ నారాయణ వాదిస్తూ..గత ఐదేళ్లుగా దిగువ కోర్టులో ట్రయల్ సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.దిగువ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి ఇచ్చిన మినహాయింపును ఎత్తేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం..ఐదేళ్ల క్రితం ఇచ్చిన ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపును ఇప్పుడు సవాల్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రధాన కేసులో వాదనలు వినిపించాలని సూచించింది. ఈ కేసుపై ఇప్పటికే చాలాసార్లు విచారించామని..ఇంకా ఏం లేదని..పది నిమిషాల సమయం కేటాయిస్తున్నామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!