పొట్టను కరిగించే పండు అనాసపండు!

- July 13, 2016 , by Maagulf
పొట్టను కరిగించే  పండు అనాసపండు!

చాలా మందికి పొట్ట సాగిపోయి, ముందుకు వచ్చేసి ఇబ్బందులు పడుతుంటారు. పొట్టను కరిగించుకునే మార్గం తెలియక అయోమయానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారికి అనాసపండు ఔషధంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంటుంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్థం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది. అనాస పండు ముక్కలను తేనెలో కలిపి తింటే శారీరక శక్తి పెరుగుతుంది. నిగారింపు సంతరించుకుంటుంది. అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకే నాలుగు సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. ఒక అనాసపండును చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకుపోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి. అనాసపండు పచ్చకామెర్లను నయం చేసే గుణాన్ని కలిగి ఉంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి. అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com