జగన్నాథ రథయాత్ర....!

- June 27, 2025 , by Maagulf
జగన్నాథ రథయాత్ర....!

'వస్తున్నాయ్..వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు' అని ఎప్పుడో రాసిన శ్రీశ్రీ కవితను మరోసారి గుర్తు చేసుకునే తరుణం ఆసన్నం అయింది. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం అయింది. ఈరోజు ప్రారంభం కానున్న పూరీ రథయాత్ర కోసం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ పూరీ రథయాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ పూరీ రథయాత్ర 2025 మీద ప్రత్యేక కథనం... 


ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నాయి. హిందూ క్యాలెండర్‌లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన జగన్నాథ రథయాత్ర 2025కు వేళయింది. పూరీ రథయాత్ర , కార్ ఫెస్టివల్, శ్రీ గుండిచా యాత్ర వంటి అనేక పేర్లతో ఈ ఉత్సవాన్ని పిలుస్తారు. ప్రతి సంవత్సరం పూరీలో వైభవంగా జరిగే ఈ జగన్నాథ రథయాత్రను కళ్లారా చూసేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు.. జగన్నాథ ఆలయానికి చేరుకుంటున్నారు. 

పురాణాల ప్రకారం ఈ జగన్నాథ రథయాత్ర పండుగ జగన్నాథుడు తన మేనత్త గుండిచా దేవాలయానికి చేసే ప్రయాణాన్ని తెలుపుతుంది. ఈ ప్రయాణంలో బలభద్రుడు, సుభద్ర దేవీలు జగన్నాథుడితోపాటు ఉంటారు. ఈ ముగ్గురు దేవుళ్లు తమ జన్మస్థలానికి వెళ్లే వార్షిక ప్రయాణాన్ని ఈ రథయాత్ర సూచిస్తుంది. ఇక ఈ జగన్నాథ రథయాత్ర వార్షిక ఉత్సవం నీలాద్రి బిజయ్‌తో ముగియనుంది. ఆ రోజున ముగ్గురు దేవతలు పూరీలోని శ్రీ మందిర్‌కు తిరిగి రానున్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తిరిగి వచ్చే ప్రయాణాన్ని బాహుడ యాత్ర సూచిస్తుంది. 

రథయాత్ర రోజున ఛేరా పహన్రా అనే ఆచారాన్ని నిర్వహిస్తారు.ఇందులో పూరీ నామమాత్రపు రాజు దేవతల రథాలను ఊడుస్తారు.ఈ ఆచారం భగవంతుని ముందు అందరూ సమానమేనని సూచిస్తుంది. వార్షిక ఊరేగింపులో భాగంగా.. భక్తులు శ్రీ మందిర్ నుంచి గుండిచా దేవాలయానికి చెక్క రథాలను లాగుతారు. పురాణాల ప్రకారం రథాలపై ఉన్న దేవతలను ఒక్కసారి చూసినా భక్తులకు మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

ప్రతి సంవత్సరం రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి నాడు జరుగుతుంది. సాధారణంగా ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ లేదా జూలై నెలల్లో వస్తుంది. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూన్ 12వ తేదీ పూర్ణిమ లేదా దేవతలకు జరిగే ఆచార స్నానంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జూన్ 13 వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు అనవసర కాలం ఉంటుంది. ఈ 15 రోజుల పాటు దేవతలను దర్శించుకోవడానికి భక్తులకు అనుమతి ఉండదు. అయినప్పటికీ పూరీలోని జగన్నాథ ఆలయం మాత్రం అందరికీ తెరిచే ఉంటుంది. ద్రిక్ పంచాంగ్ ప్రకారం.. 2025లో ద్వితీయ తిథి జూన్ 26వ తేదీన మధ్యాహ్నం 1:24 గంటలకు ప్రారంభమై.. జూన్ 27వ తేదీ ఉదయం 11:19 గంటలకు ముగియనుంది.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జగన్నాథ రథయాత్రను జూన్ 27వ తేదీన నిర్వహిస్తున్నారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com