హై కోర్టులో జగన్ కు బిగ్ రిలీఫ్

- June 27, 2025 , by Maagulf
హై కోర్టులో జగన్ కు బిగ్ రిలీఫ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన గుంటూరు కారు ప్రమాదం కేసులో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. గుంటూరు సమీపంలో ఓ వృద్ధుడు సింగయ్య ప్రమాదవశాత్తు జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారుకు ఢీకొని మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలను నిందితులుగా పోలీసులు నమోదు చేయడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.

జూన్ 18న జరిగిన ఘటన నేపథ్యం
జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో జగన్ కాన్వాయ్ వెళుతోంది. సింగయ్య అనే వృద్దుడు ప్రమాదవశాత్తు జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల స్పందన–కేసు నమోదు
ఈ ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు.

పిటిషన్లు–హైకోర్టు తీర్పు
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ, జగన్‌తోపాటు పై నలుగురు నేతలు హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ వీరంతా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు.

కారును తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు
మరోవైపు పల్నాడు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ ప్రయాణించిన కారును తనిఖీ చేశారు రవాణాశాఖ అధికారులు. జగన్‌ కారు ఢీకొని వృద్ధుడు సింగయ్య మృతి చెందడంతో. ఇప్పటికే కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కారు ఫిట్‌నెస్‌‌ను పరిశీలించారు.

ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకూ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com