ఆధునిక సాంకేతికలో టీజీఎస్ఆర్టీసీ ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

- June 30, 2025 , by Maagulf
ఆధునిక సాంకేతికలో టీజీఎస్ఆర్టీసీ ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలతో ఆర్టీసీ ముందుకువెళ్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైద‌రాబాద్‌లో అమ‌లు చేస్తోన్న ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం(AFCS)తో ఆర్టీసీ సిబ్బంది వేగంగా సేవ‌లందిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ముషీరాబాద్ డిపోను ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్‌తో క‌లిసి మంత్రి పొన్నం ప్రభాక‌ర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఏఎఫ్‌సీఎస్‌లో భాగంగా  ఐటిమ్స్, డిజిట‌ల్ పేమెంట్స్ అమ‌లు తీరును స్వ‌యంగా ప‌రిశీలించారు. క్షేత్ర‌స్థాయిలో ఈ వ్య‌వ‌స్థ ఎంత సులభ‌త‌రంగా ఉందో కండ‌క్ట‌ర్లు ఆయ‌న‌కు వివ‌రించారు. అంతకముందు ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ముషీరాబాద్ డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు.

హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ బ‌స్సుల్లో ఏఎఫ్‌సీఎస్ అమ‌లు చేస్తోన్న తీరుపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. ''గ‌త మూడు నెల‌లుగా ఏఎఫ్‌సీఎస్‌ను త‌మ బ‌స్సుల్లో ఆర్టీసీ అమ‌లు చేస్తోంది. ప్ర‌తి రోజు స‌గ‌టున 20 శాతం మంది ఈ స‌దుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. త్వ‌ర‌లోనే అన్ని బ‌స్సుల్లోనూ ఈ వ్య‌వ‌స్థ‌ను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువ‌స్తుంది.'' అని పొన్నం ప్రభాకర్ అన్నారు. 

భారతదేశంలో ఎక్క‌డ లేని విధంగా టీజీఎస్ఆర్టీసీలో ఆధునిక సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌హాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ స‌దుపాయం ఆర్టీసీకి ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోంద‌ని అన్నారు. ఈ ప‌థ‌కంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 191 కోట్ల జీరో టికెట్ల‌ను ఆర్టీసీ జారీ చేసింద‌ని, త‌ద్వారా రూ.6300 కోట్ల‌ను మ‌హిళ‌లు ఆదా చేసుకున్నార‌ని తెలిపారు. 

త్వ‌ర‌లోనే ఔట‌ర్ రింగ్ రోడ్డు లోప‌ల మొత్తం ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను న‌డిపేలా ఆర్టీసీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు. అలాగే, కొత్త కాల‌నీల‌కు ప్ర‌జా ర‌వాణా సేవల‌ను విస్త‌రింపజేస్తామ‌ని, అందుకు ఆర్టీసీ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. 

ఏఎఫ్‌సీఎస్‌లో భాగంగా ప్ర‌స్తుతం క్యూఆర్ కోడ్ టికెటింగ్ అందుబాటులో ఉంద‌ని, త్వ‌ర‌లోనే వాట్సాప్ టికెటింగ్, డిజిట‌ల్ బ‌స్ పాస్‌ల స‌దుపాయాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ తెలిపారు. వాట్సాప్ యాప్‌లో ప్ర‌యాణ వివ‌రాల‌ను న‌మోదు చేసి సులువుగా టికెట్లు పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు. ఆర్టీసీ యాప్‌లో డిజిట‌ల్ బ‌స్ పాస్‌ల‌ను పొందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. వాట్సాప్, డిజిట‌ల్ బ‌స్ పాస్‌ల‌ను కండ‌క్ట‌ర్ల వ‌ద్ద ఉండే ఐటిమ్స్‌తో స్కాన్ చేసి.. రాక‌పోక‌లు సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. 

ముషీరాబాద్ డిపో ప్రాంగ‌ణంలో జ‌రిగిన ప‌ద‌వీ విర‌మ‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ పాల్గొన్నారు. బ‌స్ భ‌వ‌న్‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన జె.భాస్కర్, సీసీఈ, జి. సుధాకర్ రెడ్డి, పీవో, పి.శ్రీనివాస రావు, అకౌంట్స్ ఆఫీసర్‌తో పాటు డిప్యూటి సూప‌రింటెండెంట్‌లు రామచంద్రయ్య, సత్యనారాయణ రావు, శ్రీనివాస రెడ్డిల‌ను స‌న్మానించారు. అలాగే, ముషీరాబాద్ డిపోలో రిటైర్డ్ అయిన భగవంత్ టీఐ3, జీఎం చారి, ఏడీసీ, ప్రభు సింగ్, ఏఎస్సై, సీహెచ్ రమేశ్, కండక్టర్, డ్రైవ‌ర్లు ఎల్. నరేందర్‌, మ‌హేందర్ రావు, కె. యాదగిరి, హెల్ప‌ర్‌ను స‌త్క‌రించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖ‌ర్, వెంక‌న్న, రాజ‌శేఖ‌ర్, ఫైనాన్స్ అడ్వ‌జైర్ విజ‌య‌పుష్ఫ‌, సీపీఎం ఉషాదేవి, సీఈఐటీ శ్రీదేవి, హైద‌రాబాద్ ఆర్ఎం సుధా ప‌రిమ‌ళ, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com