లెజెండరీ సక్సెస్‌ఫుల్ దర్శకుడు-కోదండరామిరెడ్డి
- July 01, 2025
తెలుగు చిత్రసీమలో నవలా చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్ది విజయం సాధించిన దర్శకుల్లో ఏ.కోదండరామిరెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇక యాక్షన్ మూవీస్ ను తెరకెక్కించడంలోనూ, కామెడీతో కదం తొక్కడంలోనూ కోదండరామిరెడ్డి తనదైన మార్కు ప్రదర్శించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ విజయకేతనం ఎగురవేసిన కోదండరామిరెడ్డి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆ రోజుల్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. నేడు టాలీవుడ్ లెజెండరీ సక్సెస్‌ఫుల్ దర్శకుడు కోదండరామిరెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
కోదండరామిరెడ్డి 1950 జూలై 1న నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించారు. ఇందుకూరు పేట, నరసాపురంలో కోదండరామిరెడ్డి విద్యాభ్యాసం సాగింది. చదువుకొనే రోజుల్లోనే సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆరోజుల్లో కొందరు మిత్రులు ఈయనను ‘శోభన్ బాబులా ఉన్నావ్’ అంటూ ఉండేవారు. ఎస్.ఎస్.ఎల్.సి పూర్తిచేసి నెల్లూరులో పీయూసి చేరిన సమయంలోనే ఎలాగైనా సినిమాల్లో నటించాలనే ఆసక్తితో మద్రాసు పరుగులు తీశారు. అక్కడకు వెళ్ళాక నటన అంత తేలిక కాదు అన్న విషయం తెలిసింది. సమీప బంధువు ప్రభాకర్ రెడ్డి ద్వారా దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతో వి.మధుసూదనరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు.
మధుసూదనరావు తెరకెక్కించిన ‘మనుషులు మారాలి’ చిత్రానికి కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఇద్దరూ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఆ అనుబంధంతో రాఘవేంద్రరావు తెరకెక్కించిన కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ‘తపస్య’ అనే హిందీ సినిమా ఆధారంగా రూపొందిన ‘సంధ్య’ చిత్రంతో కోదండరామిరెడ్డి దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా అంతగా అలరించక పోయినా, దర్శకునిగా కోదండరామిరెడ్డికి మంచి పేరు తెచ్చింది. దాంతో క్రాంతికుమార్ డి.కామేశ్వరి రాసిన ‘కొత్త మలుపు’ నవలను సినిమాగా మలుస్తూ కోదండరామిరెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు. ఆ సినిమాయే ‘న్యాయం కావాలి’. అందులో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా కనిపించారు. ఆ సినిమాతోనే చిరంజీవి, కోదండ అనుబంధం ఏర్పడింది. ‘న్యాయం కావాలి’ ఘనవిజయం తరువాత కోదండరామిరెడ్డి మరి వెనుతిరిగి చూసుకోలేదు.
చిరంజీవిని స్టార్ హీరోగా నిలపడంలో కోదండరామిరెడ్డి పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. వారిద్దరి కాంబోలో రూపొందిన “కిరాయి రౌడీలు, శివుడు శివుడు శివుడు, ఖైదీ, గూండా, దొంగ” వంటి చిత్రాలు చిరంజీవికి ఎనలేని మాస్ ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ఇక చిరంజీవితో కోదండ తెరకెక్కించిన “అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, రక్తసిందూరం, గూండా” వంటి నవలా చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ పై చిరంజీవితో కోదండ రూపొందించిన “విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ” వంటి చిత్రాలు సైతం జయకేతనం ఎగురవేశాయి. ఆ రోజుల్లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో ఓ చిత్రం వస్తోందంటే జనం ఎనలేని ఆసక్తితో ఎదురుచూసేవారు. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ ఫలితాలూ ఉండేవి. చిరంజీవితో ఎక్కువ చిత్రాలు రూపొందించిన దర్శకునిగా ఆయన నిలిచారు.
చిరంజీవి తర్వాత అత్యధిక చిత్రాలు తీసింది బాలకృష్ణతోనే. ఆయనతో 18 సినిమాలు తెరకెక్కించారు. బాలకృష్ణతో ఎక్కువ చిత్రాలు తెరకెక్కించిన దర్శకునిగానూ కోదండరామిరెడ్డి నిలవడం విశేషం! వీరి కాంబోలో వచ్చిన “భార్గవరాముడు, అనసూయమ్మగారి అల్లుడు, రక్తాభిషేకం, భలేదొంగ, నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి సింహం” వంటి చిత్రాలు విజయవిహారం చేశాయి. మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో ఒక్క ఫైట్ కూడా లేకుండా ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హాస్యరస ప్రధాన చిత్రాన్ని కోదండరామిరెడ్డి వంటి కమర్షియల్ డైరెక్టర్ రూపొందించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. అక్కినేని నాగార్జునతో కోదండ తెరకెక్కించిన “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, విక్కీదాదా, అల్లరి అల్లుడు” చిత్రాలు మురిపించాయి. విక్టరీ వెంకటేశ్‌తో కోదండరామిరెడ్డి రూపొందించిన ‘సూర్య ఐపీఎస్’ అలరించింది. కోదండ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘పున్నామినాగు’.
నందమూరి బాలకృష్ణతో 18 సినిమాలు, నాగార్జునతో 7, వెంకటేష్‌తో 2, అక్కినేని నాగేశ్వరరావుతో 6, సూపర్‌స్టార్ కృష్ణతో 6, శోభన్‌బాబుతో 6.. ఇలా టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. అలాగే కమల్‌హాసన్, మోహన్‌బాబు, జగపతిబాబు వంటి హీరోలతో కూడా సినిమాలు చేసి వారికి సూపర్‌హిట్స్ ఇచ్చారు. ఎన్.టి.రామారావుతో తప్ప మిగిలిన అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కోదండరామిరెడ్డికి మూడు సార్లు వచ్చింది. అయితే అప్పుడు ఆయన మిగతా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయనతో సినిమా చెయ్యలేకపోయారు. దాదాపు ఎనభై చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. ఆయన రూపొందించిన చిత్రాల్లో 90 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఏకైక దర్శకుడిగా చరిత్ర సృష్టించారు.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన దర్శకుడుగా పరిచయం అవ్వకముందే భారతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సనీల్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి. ‘గొడవ’ చిత్రం ద్వారా వైభవ్ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత వైభవ్ హీరోగా ‘కాస్కో’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అయితే తమిళ్‌లో నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన పెద్ద కుమారుడు సునీల్ రెడ్డి మొదట నిర్మాతగా కొన్ని చిత్రాలు చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు హిట్ చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు.
తొలి గురువు విక్టరీ మధుసూదనరావు నుండి కథలను ఎంపిక చేసుకోవడంలో నేర్పు సంపాదించుకున్న కోదండరామిరెడ్డి, మలి గురువు రాఘవేంద్రరావు నుండి కమర్షియల్ అంశాలను అందులో ఎలా జోడించాలో తెలుసుకున్నారు. అందుకే ఆయన తోటి దర్శకులు చేయలేని విధంగా ఘన విజయాలను ‘ఖైదీ’ చేయగలిగారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయినా, ఆయన ఒకప్పుడు తెరకెక్కించిన చిత్రాలు నవతరం ప్రేక్షకులను సైతం బుల్లితెరపై ఆకట్టుకుంటూ ఉండడం విశేషం!
-డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!