టీపీసీసీ అధ్యక్షుడిగా క్రికెటర్ అజారుద్దీన్..
- July 14, 2016
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను నియమించాలని ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ మేరకు రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి సూచించినట్లు ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పునర్ నిర్మాణంలో భాగంగా తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అజారుద్దీన్ కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఇప్పటికే స్పష్టం చేశారని రాజకీయవర్గాలు చెపుతున్నాయి. రాహుల్ గాంధీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలీవుడ్ సినీనటుడు రాజ్ బబ్బర్ ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిపాదించిన విషయం విదితమే. మరో వైపు తమిళనాడులోనూ ప్రముఖ సినీనటి ఖుష్బూకు పార్టీ నాయకత్వం అప్పగిస్తున్నారని వార్తలు వచ్చాయి. తెలంగాణాలో 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేయడానికి అందరికీ ఆమోదయోగ్యుడైన ప్రముఖ వ్యక్తికి టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంది.
టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో విజయశాంతి...టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం క్రికెటర్ అజారుద్దీన్ తోపాటు ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలైన డీకే అరుణ, గీతారెడ్డిలు, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయని సమాచారం. పార్టీకి సినీ గ్లామర్ ఇవ్వటానికి ప్రముఖ నటి విజయశాంతికి రాష్ట్రపార్టీ నాయకత్వం అప్పగించాలని కొందరు నేతలు సూచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఏకీకృతం చేసేందుకు పీసీసీ అధినేత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు, అయితే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను మార్చాలని కోరుతూ న్యూఢిల్లీలో మకాం వేసి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణాలో ముస్లిమ్ నేతకు టీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆయా వర్గంవారి మద్ధతు కూడగట్టవచ్చని భావిస్తున్నారు. మరో వైపు గత ఎన్నికల్లో ముస్లిమ్ లకు విద్యా, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైంది. ఈ నేపథ్యంలో ముస్లిమ్ వర్గాల మద్ధతు కోసం అజారుద్దీన్‌కు టీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కాగా తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని, అధిష్ఠానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని అజారుద్దీన్ చెపుతున్నట్లు హైదరాబాద్ కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







