నిమిషా ప్రియా కేసులో ఆశలు చిగురిస్తున్నాయి

- July 15, 2025 , by Maagulf
నిమిషా ప్రియా కేసులో ఆశలు చిగురిస్తున్నాయి

యెమెన్‌: యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న జరగాల్సిన ఉరిశిక్షను నిలిపివేయడానికి తుది దశ ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రముఖ సున్నీ ముస్లిం మత నాయకుడు కంతపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ (గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా) విజ్ఞప్తితో ప్రముఖ సూఫీ మత పెద్ద షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫిజ్ నాయకత్వంలో ఈ చర్చలు కొనసాగుతున్నట్లు మంగళవారం (జూలై 15) సమాచారం లభించింది.

తాలాల్ అబ్దో మహ్దీ అనే యెమెన్ వ్యక్తిని నిమిషా ప్రియా 2017లో హత్యచేసిందని ఆరోపణలున్న నేపథ్యంలో, అతడి కుటుంబ సభ్యులతో డహ్మార్ నగరంలో జూలై 15న ఉదయం 10 గంటలకు చర్చలు జరగనున్నాయి. తాలాల్ కుటుంబం ఈ చర్చలకు అంగీకరించడం పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు.

తాలాల్ కుటుంబానికి చెందిన ఒక కీలక వ్యక్తి, హోదెయ్దా రాష్ట్ర కోర్టు చీఫ్ జస్టిస్, యెమెన్ షూరా కౌన్సిల్ సభ్యుడు ఈ సమావేశంలో పాల్గొనడానికి డహ్మార్‌కు చేరుకున్నారని కంతపురం కార్యాలయం వెల్లడించింది. అతను షేక్ హబీబ్ ఉమర్ సూఫీ ఆదేశాన్ని అనుసరించేవాడే కాకుండా, మరో ప్రముఖ సూఫీ నేత కుమారుడే కావడం ఈ చర్చలకు కొత్త ఆశలు కలిగిస్తోంది. అతను కుటుంబాన్ని ఒప్పించడమే కాకుండా, యెమెన్ అటార్నీ జనరల్‌ను కలిసి ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందిగా ప్రయత్నాలు చేయనున్నాడు.

‘‘కుటుంబం సూఫీ మతపెద్ద ప్రతినిధులతో మాట్లాడేందుకు అంగీకరించినది ఈ విషయంలో సానుకూల సంకేతమే.బ్లడ్ మనీ తగ్గింపు పై కుటుంబం అంగీకరించాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఉరిశిక్షను వాయిదా వేయాలని యెమెన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ఈరోజే పరిగణనలోకి తీసుకోనున్నారు’’ అని వర్గాలు తెలిపాయి.

తాలాల్ హత్య కుటుంబానికే కాదు, డహ్మార్ ప్రాంత వాసులకు, తెగలకు కూడా ఎమోషనల్ అంశంగా మారింది.అందుకే ఇప్పటివరకు కుటుంబంతో ఎవరూ సంప్రదింపులు చేయలేకపోయారు. కంతపురం జోక్యం వలన మొదటిసారిగా కుటుంబంతో సంభాషణ సాధ్యమైంది.

ఇటీవల ఇరాన్ కూడా ఈ కేసులో మద్దతు ప్రకటించింది. "మా వల్ల సాధ్యమైనంత సహాయం చేస్తాం" అని చెప్పింది.

అదేవిధంగా, జూలై 14న సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం ‘‘ఇందులో ఎక్కువ చేయలేమని’’ స్పష్టం చేసింది. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి పేర్కొంటూ, ‘‘ప్రభుత్వం అత్యంత కృషి చేస్తోంది, అక్కడ ప్రభావశీలులైన షేక్‌లతో కూడా చర్చలు జరుపుతోంది’’ అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com