ఆగస్టు 15 నుంచి SBI కొత్త రూల్..

- August 14, 2025 , by Maagulf
ఆగస్టు 15 నుంచి SBI కొత్త రూల్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్.. ఇన్‌స్టంట్ పేమెంట్ సర్వీసు (IMPS) ద్వారా చేసే లావాదేవీలపై ఛార్జీలను మార్చాలని ప్రభుత్వ రంగ బ్యాంక్ నిర్ణయించింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ఆన్‌లైన్‌లో బ్రాంచ్ నుంచి చేసే లావాదేవీలపై వేర్వేరు ప్రయోజనాలను అందిస్తుంది.

ఇందులో చిన్నమొత్తంలో లావాదేవీలు ఇప్పటికీ ఫ్రీగానే చేయొచ్చు. కానీ, పెద్ద మొత్తంలో ఆన్‌లైన్ లావాదేవీలపై ఇప్పుడు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ఏంటి? వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

IMPS అంటే ఏంటి?
IMPS అనేది ఇన్‌స్టంట్ పేమెంట్ సర్వీసు. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీసును నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందిస్తోంది. IMPS ద్వారా ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షల వరకు పంపవచ్చు (SMS, IVR మినహా అన్ని ఛానెల్స్‌కు).

ఆన్‌లైన్ IMPS లావాదేవీలపై కొత్త ఛార్జీలివే:
ఆన్‌లైన్‌లో IMPS లావాదేవీల కోసం SBI కొన్ని కొత్త శ్లాబ్‌లను ప్రకటించింది. అయితే కొన్ని పాత నిబంధనలను మార్చలేదు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

రూ.25వేల వరకు లావాదేవీలు: ఆన్‌లైన్ యూజర్లకు ఉచితం.
రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు లావాదేవీలు: రూ.2 + GST రుసుము
రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు లావాదేవీలు: రూ. 6 + జీఎస్టీ రుసుము
రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు లావాదేవీలు: రూ. 10 + జీఎస్టీ రుసుము
గతంలో ఈ ఆన్‌లైన్ IMPS లావాదేవీలన్నీ ఉచితం. అయితే, శాలరీ అకౌంట్ కలిగిన వినియోగదారులకు ఆన్‌లైన్ IMPS ట్రాన్సాక్షన్లపై పూర్తి మినహాయింపు ఉంటుంది. ఎక్కువగా ఆన్‌లైన్ IMPS లావాదేవీలు చేసే కస్టమర్లు ఈ కొత్త ఛార్జీలను ఓసారి చెక్ చేసుకోండి.

బ్రాంచ్ నుంచి IMPS ట్రాన్సాక్షన్లపై మార్పు లేదు:
బ్యాంకు బ్రాంచ్ ద్వారా జరిగే IMPS లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలలో ఎస్బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. బ్యాంకు బ్రాంచ్ నుంచి జరిగే లావాదేవీలు గతంలో మాదిరిగానే వసూలు చేస్తుంది. బ్రాంచ్ ఛార్జ్ అత్యల్పంగా రూ.2 + జీఎస్టీ చెల్లించాలి. అయితే అత్యధిక బ్రాంచ్ ఛార్జ్ రూ.20+ జీఎస్టీ చెల్లించాలి.

ఇతర బ్యాంకుల IMPS ఛార్జీలివే:
SBI మాత్రమే కాదు.. ఇతర బ్యాంకుల IMPS ఛార్జీలు కూడా ఓసారి లుక్కేయండి..

కెనరా బ్యాంకు:
రూ. వెయ్యి కన్నా తక్కువ లావాదేవీలు ఉచితం. రూ. 1,000 నుంచి రూ.10వేలు, రూ.3 + జీఎస్టీ, రూ.10వేల నుంచి రూ. 25వేలు, రూ. 5 + జీఎస్టీ, రూ. 25వేల నుంచి రూ. లక్ష రూ.8 + జీఎస్టీ, రూ. లక్ష నుంచి రూ. 2లక్షలు, రూ.15 + జీఎస్టీ, రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షలు రూ.20 + జీఎస్టీ వరకు చెల్లించాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్:
ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు రూ. 1,000 వరకు ఉచితం. రూ. 1,001 నుంచి రూ. 1,00,000 వరకు బ్రాంచ్ నుంచి రూ. 6 + GST, ఆన్‌లైన్‌లో రూ.5 + జీఎస్టీ. రూ. లక్ష కన్నా ఎక్కువ లావాదేవీలపై బ్యాంక్ నుంచి రూ. 12 + జీఎస్టీ, ఆన్‌లైన్‌లో రూ.10 + జీఎస్టీ చెల్లించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com