అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- March 13, 2026
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు.దాదాపు 18 ఏళ్ల పాటు కంపెనీని విజయవంతంగా నడిపించిన ఆయన, సంస్థలో కీలక మార్పులకు నాంది పలికారు. అయితే, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తన పదవిలో కొనసాగుతారని సంస్థ స్పష్టం చేసింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, బోర్డు ఛైర్మన్‌గా కంపెనీకి తన మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటారు.
శంతను నారాయణ్ వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను అడోబ్ బోర్డు ఇప్పటికే ప్రారంభించింది.ఇందు కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కంపెనీలో ఉన్న అంతర్గత సమర్థులైన అధికారులతో పాటు, బయటి నుండి కూడా అనుభవజ్ఞులైన నిపుణులను ఈ పదవి కోసం బోర్డు పరిశీలిస్తోంది.అత్యంత పారదర్శకంగా, సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
శంతను నారాయణ్ నాయకత్వంలో అడోబ్ సాధించిన పరివర్తన అద్భుతమని, ఏఐ యుగంలో కంపెనీ విజయానికి ఆయన బలమైన పునాది వేశారని అడోబ్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోనీ ప్రశంసించారు.ఈ సందర్భంగా శంతను నారాయణ్ ఉద్యోగులను ఉద్దేశించి ఒక సందేశం పంపారు. “18 ఏళ్ల తర్వాత సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా హయాంలో కంపెనీ 3,000 మంది ఉద్యోగుల నుంచి 30,000 మందికి పెరిగింది. ఆదాయం బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్లకు చేరింది. మనం కలిసి సాధించిన ఈ ఘనత పట్ల చాలా గర్వంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
శంతను నారాయణ్ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. “అడోబ్‌లో మీది ఒక గొప్ప ప్రస్థానం.ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటిగా అడోబ్‌ను నిలబెట్టారు” అంటూ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.శంతను నారాయణ్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం అడోబ్‌లో చేరారు. 2007లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించి, కంపెనీ వ్యాపార నమూనాను ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ నుంచి క్లౌడ్ ఆధారిత సబ్స్క్రిప్షన్ సేవలకు మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలోనే ఫొటోషాప్, క్రియేటివ్ క్లౌడ్ వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్‌లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







