టీడీపీలో రథసారథుల రేసు.. ఆ జిల్లాల బాస్‌లు ఎవరు?

- August 26, 2025 , by Maagulf
టీడీపీలో రథసారథుల రేసు.. ఆ జిల్లాల బాస్‌లు ఎవరు?

టీడీపీలో పార్టీ పదవుల రేసు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులు ఆశించిన నేతలు..ఇప్పుడు పార్టీ పదవి కోసం తెగ ఆరాటపడుతున్నారు.

జిల్లా అధ్యక్ష బాధ్యతల కోసం అయితే టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. కడప జిల్లా అధ్యక్ష ఎంపిక ఇప్పటికే ఉత్కంఠ రేపుతోంది.

త్రిమెన్ కమిటీ జిల్లాకు వెళ్లి నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలు..ఆశావహులు అనుకూలతలు, ప్రతికూలతలతో పాటు..వారి ట్రాక్ రికార్డును పరిశీలించి..నివేదిక రెడీ చేసి అధిష్టానానికి అందించింది.

కడప జిల్లా అధ్యక్ష రేసులో జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ భూపేష్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ఆయనకే పగ్గాలు దక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

కడప జిల్లానే కాదు ఒక్కో జిల్లా అధ్యక్ష ఎంపిక కసరత్తు పూర్తి చేస్తూ వస్తోంది పార్టీ. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా రథసారథుల ఎన్నికల కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఏడుగురి పేర్ల స్వీకరణ
అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తీసుకున్నాయి.

రెండు జిల్లాలకు అధ్యక్షులుగా త్రిసభ్య కమిటీలు ఏడుగురి పేర్లను స్వీకరించాయి.

ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్ష రేసులో బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, గన్నే నారాయణ ప్రసాద్‌, బొమ్మసాని సుబ్బారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కృష్ణాజిల్లా నుంచి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, కొనకళ్ల నారాయణరావు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల నుంచి స్వీకరించిన ఈ పేర్లను త్రిసభ్య కమిటీలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నాయి.

లోకల్ లీడర్ల అభిప్రాయ సేకరణ
వీరిలో అధ్యక్షులెవరన్నది అధినేత చంద్రబాబు నిర్ణయంతో ఫైనల్‌ అవుతోంది. ఇలా అన్ని జిల్లాల్లో లోకల్ లీడర్ల అభిప్రాయ సేకరణ చేసి..ఫైనల్‌గా ఒకేసారి అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించబోతున్నారు సీఎం చంద్రబాబు.

నామినేటెడ్‌ పదవులలో ఉన్న వారికి జిల్లా సారథ్యం బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి ఇప్పటివరకు ఏ పదవుల్లో లేని నేతలకు అవకాశం దక్కనుంది.

అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కుల సమీకరణల కంటే కూడా సమర్థవంతులైన వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది అందరి అభిప్రాయంగా ఉంది.

అటు చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగానే ఉంది. జిల్లా కమిటీ ఏర్పాటు కోసం చిత్తూరుకు కూడా త్రిమెన్ కమిటీని పంపించింది టీడీపీ అధిష్టానం. భీమినేని చిట్టిబాబు అధ్యక్ష పదవి తనకే అన్న నమ్మకంలో ఉన్నారు.

సందీప్‌తోపాటు వసంత్‌..చిత్తూరులోని భాస్కరా హోటల్‌ యజమాని, బంగారుపాళ్యం మండలానికి చెందిన జయప్రకాష్‌ నాయుడు కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారట. (TDP Leadership Race)

అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం
ఇక నగరి నియోజకవర్గానికి చెందిన పోతుల విజయ్‌బాబు కూడా అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో అర్హుల్ని ఎంపిక చేస్తారా..లేదా ఇప్పటికే జిల్లా ప్రెసిడెంట్‌గా ఉన్న సీఆర్‌ రాజన్‌ను కొనసాగిస్తారా అని పార్టీలో చర్చ జరుగుతోంది.

అయితే రాజన్‌కు ఇప్పటికే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఒక పదవి ఉన్నవారికి మరో పదవి ఇవ్వొద్దని భావిస్తే..కొత్త నేతకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కడం ఖాయం.

ఇలా ఒక్కో జిల్లాలో ఆశావహులు లిస్ట్..వారికి మద్దతు ఇచ్చే నేతలు, అభిప్రాయాలు తెలుసుకుని అధినేతకు రిపోర్ట్ పంపిస్తోంది త్రిమెన్ కమిటీ. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు.

అయితే జిల్లాలో అభిప్రాయసేకరణ అయిపోయాక కూడా నేతలు తమకు రాష్ట్రస్థాయిలో ఉన్న పరిచయాలతో అధినేత ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారట.

ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో..ప్రభుత్వంలో పదవులు ఆశించిన నేతలకు పార్టీ పదవులు అయినా దక్కుతాయో లేదో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com