అజిత్ దోవల్ రహస్య మిషన్...పాకిస్తాన్ రహస్యాలను దైర్యంగా ఛేదించిన వైనం

- August 26, 2025 , by Maagulf
అజిత్ దోవల్ రహస్య మిషన్...పాకిస్తాన్ రహస్యాలను దైర్యంగా ఛేదించిన వైనం

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు దేశం మొత్తం తెలుసు. ఆయన్ని చాలామంది ఇండియన్ జేమ్స్‌బాండ్ అని పిలుస్తారు. గూఢచారి ప్రపంచంలో ఆయన ఒక లెజెండ్‌గా నిలిచారు. ఆయన చేపట్టిన అనేక రహస్య మిషన్లలో, పాకిస్తాన్‌ (Pakistan) లో చేసిన అండర్ కవర్ ఆపరేషన్ అత్యంత విశేషమైనది.

పాకిస్తాన్‌లో అణు రహస్యాల వేట
1980లలో పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను (Nuclear weapons) అభివృద్ధి చేస్తున్నట్లు భారతదేశం గుర్తించింది. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు అజిత్ దోవల్‌ను రహస్యంగా పాకిస్తాన్‌కు పంపించారు. ఆ సమయంలో ఆయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) లో పనిచేస్తున్నారు. కఠిన భద్రత కింద ఉన్న కహుటా న్యూక్లియర్ రీసెర్చ్ సైట్ ఆయన లక్ష్యం.

భిక్షగాడి వేషంలో రహస్య మిషన్
పాకిస్తాన్‌లో ఎవరూ గుర్తించకుండా ఉండటానికి, దోవల్ ఒక సాధారణ భిక్షగాడి వేషంలో ఇస్లామాబాద్ వీధుల్లో తిరిగేవారు. కహుటా సెంటర్‌లో పనిచేసే శాస్త్రవేత్తలు, సైనికులు, అధికారులు చేసే కదలికలను ఆయన క్షుణ్ణంగా గమనించేవారు. ఈ సమయంలో ఆయనకు ఒక బార్బర్ షాప్ కీలక ఆధారం అందించింది.

వెంట్రుకలలో దాగిన నిజం
కహుటాలోని శాస్త్రవేత్తలు తరచుగా వెళ్ళే ఒక చిన్న బార్బర్ షాప్ దగ్గర దోవల్ తిరుగుతుండేవారు. ఆ షాపులో కత్తిరించిన వెంట్రుకలను ఆయన రహస్యంగా సేకరించి భారత్‌కు పంపించారు. పరిశీలనలో ఆ వెంట్రుకలలో యురేనియం, రేడియేషన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో పాకిస్తాన్ నిజంగానే అణు పరిశోధనలు చేస్తోందని భారతదేశం ధృవీకరించింది.

పాకిస్తాన్ అణు పరీక్షలు ఆలస్యం
ఈ సమాచారం ఆధారంగా భారతదేశం తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. నిపుణుల అంచనాల ప్రకారం, అజిత్ దోవల్ సేకరించిన ఆధారాలు పాకిస్తాన్ అణు పరీక్షలను దాదాపు 15 సంవత్సరాలు ఆలస్యం చేయించాయి. ఇది భారత భద్రతకు కీలక మలుపుగా నిలిచింది.

ఆరు సంవత్సరాల గూఢచర్యం
దాదాపు ఆరు సంవత్సరాలపాటు దోవల్ పాకిస్తాన్‌లోనే రహస్యంగా గూఢచర్యం కొనసాగించారు. ప్రతి రోజు ఆయన ప్రాణాపాయంలో గడిపినా, తన లక్ష్యం కోసం వెనుదిరగలేదు. ఈ సాహసోపేతమైన సంఘటన ఆయన ధైర్యం, పట్టుదల, అసాధారణ గూఢచారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.

పుస్తకంలో వెలుగులోకి వచ్చిన నిజం
‘అజిత్ దోవల్ – ఆన్ ఎ మిషన్’ అనే పుస్తకంలో రచయిత డి. దేవదత్ ఈ మిషన్‌ను వివరించారు. ఇందులో ఆయన పాకిస్తాన్‌లో ఎదుర్కొన్న సాహసాలు, చేసిన త్యాగాలు, సేకరించిన ఆధారాల ప్రాముఖ్యత స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కథనం దేశానికి సేవ చేసిన ఒక గూఢచారి మహత్తర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com