చుండ్రు సమస్యలకు చెక్‌!

- July 18, 2016 , by Maagulf
చుండ్రు సమస్యలకు చెక్‌!

ఈ కాలంలో చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంది. తెల్లగా పొట్టు మాదిరి రాలిపోతుంటుంది. మరి ఈ సమస్యను వదిలేయకుండా.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే పరిష్కరించుకోవచ్చు.
వెనిగర్‌: మూడు కప్పుల నీళ్లలో కప్పు వెనిగర్‌ కలిపాలి. తల మీద మెల్లగా మర్దన చేసుకుంటూ.. ఆ నీళ్లను పోసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.
ఆముదం: దీనిలో యాంటీఫంగల్‌ గుణాలు ఎక్కువ. ఆముదంతో మర్దన చేయడం వల్ల రకరకాల ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. రక్తప్రసరణా మెరుగవుతుంది. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
పెరుగూ, తేనె: ఓ నిమ్మకాయ తీసుకుని దానిని కప్పు పెరుగులో పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పూతలా వేయాలి. గంటయ్యాక గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అందడంతోపాటూ జుట్టు జిడ్డుగా మారకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా అదుపులోకి వస్తుంది.
వేప: ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్‌ గుణాలు అధికం. బకెట్‌ నీళ్లలో నాలుగైదు గుప్పెళ్ల వేపాకు వేయాలి. తరవాత వడకట్టి తలస్నానానికి ఉపయోగించాలి. ఈ నీళ్లు చుండ్రును తొలగించి.. ఇతర సమస్యలనూ దూరంపెడతాయి.
నిమ్మరసం: ఒక నిమ్మ చెక్కతో మాడుకు మర్దన చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. నిమ్మరసం పలు ఇన్‌ఫెక్షన్లు దూరం చేసి ఆ సమస్యను అదుపు చేస్తుంది. తలలో పుండ్లు, గాయాల వంటివి ఉన్నప్పుడు నిమ్మకాయ జోలికి వెళ్లకపోవడం మంచిది. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చుండ్రు తగ్గకపోతే నిపుణులను సంప్రదించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com