ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

- September 12, 2025 , by Maagulf
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

న్యూ ఢిల్లీ: గత కొన్ని నెలలుగా ప్రజా జీవితంలోనుంచి దూరంగా ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ మళ్లీ బహిరంగ వేదికపై కనిపించారు.కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన హాజరుకావడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా దేశ ప్రజల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తించింది.దన్ఖడ్ ప్రత్యక్షం కావడం అనుకోని పరిణామం కావడంతో, అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

జగదీప్ దన్ఖడ్ 2022లో ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించి, తన స్పష్టమైన మాటతీరు, పార్లమెంట్‌లో సున్నితమైన అంశాలపై తీసుకున్న ధైర్య నిర్ణయాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే, జూలై 21, 2025న ఆయన ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడం అందరినీ అయోమయంలోకి నెట్టింది. రాజీనామా తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా,కనిపించకపోవడంతో, వివిధ వర్గాల నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి.

విపక్ష పార్టీ ఆయన కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. దన్ఖడ్ ఎక్కడ ఉన్నారు? ఆయన ఆరోగ్యం బాగుందా? వంటి ప్రశ్నలు నిరంతరం లేవనెత్తింది. అంతేకాదు, కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాసి దన్ఖడ్ జాడ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ పరిణామం వల్ల ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది.

భారత 15వ ఉపరాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ దన్ఖడ్, వెంకయ్య నాయుడు, మాజీ ప్రధానులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగానే సీపీ రాధాకృష్ణన్‌కు శాలువా కప్పారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. తన పదవీకాలం మధ్యలోనే దన్ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం అప్పట్లో అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. అయినా సర్కారు స్పందించలేదు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇలా తన వారసుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.

సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈనెల 9వ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో.. గురువారం రోజు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అప్పగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com