ఒమ‌న్ పై పాక్ విజ‌యం..

- September 13, 2025 , by Maagulf
ఒమ‌న్ పై పాక్ విజ‌యం..

దుబాయ్: ఆసియాక‌ప్ 2025లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్ర‌వారం దుబాయ్ వేదిక‌గా ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 93 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన త‌రువాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. మహ్మద్‌ హారిస్‌ (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (29), ఫఖార్‌ జమాన్‌ (23) లు రాణించడంతో పాక్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో షా ఫైజల్‌, ఆమిర్‌ కలీమ్ లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

అనంత‌రం 161 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్ 16.4 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో పాక్ 93 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. పాక్ బౌల‌ర్ల‌లో స‌యిమ్ అయూజ్, సుఫియాన్ ముఖీమ్‌, ఫ‌హీమ్ అష్రాఫ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. ఒమ‌న్ బ్యాట‌ర్ల‌లో హమ్మద్‌ మీర్జా (27) టాప్‌స్కోరర్‌.

ఇక మ్యాచ్‌లో విజ‌యం సాధించిన త‌రువాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన‌ప్ప‌టికి కూడా బ్యాటింగ్‌లో త‌మ జ‌ట్టు ఇంకా చాలా మెరుగుప‌డాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. టాపార్డ‌ర్ వైఫ‌ల్యం కొంత నిరాశ‌ప‌రిచింద‌న్నాడు. అయితే.. బౌలింగ్ విభాగం మాత్రం చాలా అద్భుతంగా రాణించింద‌న్నాడు.

ముఖ్యంగా స్పిన్న‌ర్లు చాలా బాగా బంతులు వేశార‌ని, ఒమ‌న్‌ను చాలా త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేశార‌న్నాడు. ముగ్గురు స్పిన్న‌ర్లు కూడా ఎవ‌రికి వారు చాలా భిన్నంగా ఉంటార‌న్నారు. బౌలింగ్‌లో చాలా మంచి ఆప్ష‌న్లు ఉండ‌డం త‌మ బ‌లం అని చెప్పుకొచ్చాడు. యూఏఈ లాంటి పిచ్‌ల‌పై స్పిన్న‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తార‌ని తెలిపాడు. అందుక‌నే జ‌ట్టులో ఎక్కువ మంది స్పిన్న‌ర్లు ఉండ‌డం చాలా మంచి విష‌యం అని తెలిపాడు.

తాము గ‌త రెండు మూడు నెల‌లుగా చాలా మంచి క్రికెట్ ఆడుతున్నామ‌ని తెలిపాడు. ‘ఇటీవ‌లే దుబాయ్ వేదిక‌గానే జ‌రిగిన ట్రై సిరీస్‌ను గెలుపొందాము. మేము మా ప్రణాళిక‌ల‌ను స‌రిగ్గా అమలు చేయ‌గ‌లిగితే ప్ర‌పంచంలో ఏ జ‌ట్టునైనా ఓడిస్తాం.’ అని అఘా తెలిపాడు. ఇక భార‌త్‌తో ఆదివారం జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని, బ‌లాబ‌లాల‌ను నిరూపించుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com