డ్రగ్స్‌ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్

- September 30, 2025 , by Maagulf
డ్రగ్స్‌ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్

హైదరాబాద్: నగర నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు,సైబర్ నేరాలు, డ్రగ్స్ సమస్య వంటి కీలక అంశాలపై తమ కార్యాచరణను ప్రకటించారు.హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా ఉంచేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైనప్పటికీ, ఇక్కడ డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించి చర్యలు చేపడతామని అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ సమస్యను అరికడతామని తెలిపారు. వీటితో పాటు కల్తీ ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని, ఇందుకోసం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు, మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

సైబర్ నేరాలపై(Cyber ​​crimes) అవగాహన, అప్రమత్తత కొరవడటంతో చాలామంది నష్టపోతున్నారని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. నేరగాళ్లు ఎక్కువగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, డిజిటల్ అరెస్టులు, అరుదైన వ్యాధులకు ఔషధాల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని హితవు పలికారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల యువత చెడిపోతోందని, అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని ప్రముఖులను కోరారు. ఆన్‌లైన్ మోసాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని సీపీ సజ్జనార్ అంగీకరించారు. ట్రాఫిక్ సమస్య వల్ల సమయం వృథా కావడంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com