|| మన తెలంగాణా సంస్కృతి -- బోనాలు -||

- July 21, 2016 , by Maagulf


ప్రకృతిలోని శక్తులను ఆరాధించడం అనేది పురాతన కాలం నుండి మనిషికి ఉన్న అలవాటు & సాంప్రదాయం.  పురా కాలం నాటికి చెందిన అమ్మ తల్లి సంస్కృతికి ప్రతిరూపమే ఈ ఆషాడ మాసంలో మనం జరుపుకునే "బోనాలు" అని చెప్పవచ్చు.
ఆషాఢం వచ్చిందంటే , గ్రామ దేవతల ఉత్సవాలతో ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో ఊరూ వాడా వీధులన్నీ మారుమ్రోగిపోతాయి.ఇక బోనాలు వచ్చాయంటే ముఖ్యంగా హైదరాబాద్,సికింద్రాబాద్ గోల్కోండ ,లష్కర్,పాతబస్తీ ప్రాంతాలు ఆరాధనలో హోరెత్తిపోతాయి.
చరిత్ర పూర్వానికి వెళితే , ఈ గ్రామ దేవతల ఆరాధన గూర్చి ఆసక్తికరమైన విషయాలు బయట పడతాయి. తనలాంటి రూపం ఉన్న జీవులు స్త్రీ గర్భం నుండి రావడం చూసిన మనిషికి ,"సృష్టికి మూలం స్త్రీ " అని నమ్మే సంస్కృతి మొదలయ్యింది.ఆ జన్మ స్థానం పూజనీయం అయ్యింది. అందుకే ఈ భూమిని,జీవనాధారం అయిన నదుల్ని , ప్రకృతిని స్త్రీతోనే పోల్చడం మొదలయ్యింది.క్రమంగా ఈ భావనల నుండి "మాతృస్వామ్య వ్యవస్థ" పుట్టింది. పురాతన మానవ నాగరికతలో మాతృస్వామ్య వ్యవస్థ గూర్చి ఎన్నో ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లి ని(Mother Goddess) పూజించిన మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన వారని చరిత్ర చెపుతుంది.
మొట్టమొదటి మానవ తెగలు & సమూహాల సంస్కృతి అయిన ఈ ప్రకృతి ఆరాధనను, నేడు ఆధిపత్యం చెలాయిస్తున్న ఆర్య బ్రాహ్మణ ఆచారాల్లో పడి కొట్టుకుని పోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ దేశ మూలవాసులు.,ముఖ్యంగా మన తెలంగాణా ప్రాంతం అని చెప్పవచ్చు. తమ ఆదిమ సంస్కృతి అయిన అమ్మతల్లి ఆరాధనకు ప్రతిరూపమే ఈ బోనాలు.అలాగే ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు రూపం మన "బతుకమ్మ".
అనాది నుండి మనది వ్యవసాయ సమాజం అంటే ఆహార ఉత్పత్తికి చెందిన సమాజం. ఈ ఆషాఢంలో వర్షాలు కురిసి ,వ్యవసాయ పనులు ఆరంభమవుతాయి .పంటలు బాగా పండాలని కోరుకుంటూ ప్రకృతి తల్లికి అన్నం సమర్పించడమే బోనం.ఇలా తను చేసే ప్రతి పనికీ ప్రకృతి అనుమతి తీసుకోవడం అన్నమాట.
మన దేశంలో ప్రతీ గ్రామంలో ఊరి చివర ,పొలం గట్ల వద్ద,చెరువు గట్ల కాడ ఈ గ్రామ దేవతల కొలువులుంటాయి. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మ, మహంకాళి., పైడమ్మ, అంకమ్మ, గంగమ్మ ఒక్కో చోట ఒక్కో పేర గ్రామ దేవతలు పూజలందుకుంటున్నారు.


పితృస్వామ్య వ్యవస్థకు చెందినది అయిన వైదిక  బ్రాహ్మణ వ్యవస్థలో పురుష దేవుళ్ళదే ఆధిపత్యం. బ్రాహ్మణ ,క్షత్రియ,వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా వ్యవస్థను విడదీసి , ప్రకృతి దేవతలను పురుషులతో పోల్చే సాంప్రదాయం కల్పించారు.అగ్ని ,ఇంద్రుడు,వరుణ దేవుడు ,వాయువు ..ఇలా ప్రకృతి శక్తులకు పురుష రూపం ఇవ్వడం మనకు ఋగ్వేద కాలం అయిన క్రీ.పూ.1750 నుండి కనిపిస్తుంది.మలివేద కాలంలో పురాణాల్లో విష్ణువు, శివుడు, బ్రహ్మకు స్థానం కల్పించి వీరికి  సరస్వతి ,లక్ష్మి, పార్వతి  పేరిట మాతృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ప్రతీకలను జోడించారు.
రాజుల పోషణలో బ్రాహ్మణీయ మతం వేళ్లూనుకుపోయి బలమైన వ్యవస్థగా మారిపోయింది. వేదాలు, పురాణాలు, సాహిత్యం, దేవాలయ సంపద బ్రాహ్మణీయ వ్యవస్థకు మూల స్థంభాలుగా నిలిచాయి. మన    గ్రామ దేవతల కొలువుల్లో కూడా బ్రాహ్మణులు చొరబడి యజ్ఞ యాగాదులు,వేద శ్లోకాలతో వైదికత్వం పులిమే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్యుల దోపిడీలో నాశనమైపోయిన మన దేశ పురాతన సంస్కృతి, ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా , అక్కడక్కడా బతికి ఉండడం చాలా గొప్ప విషయం. శూద్ర వర్ణం వాళ్లుగా ఆర్యులు వెలివెసిన శ్రామిక వర్గాల్లో, ప్రకృతితో మమేకమైన మాతృశక్తి ఆరాధన , ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉండడం చాలా సంతోషించాల్సిన విషయం.
మన తెలంగానాలో ఇప్పటికీ నిలిచి ఉన్న ఈ మాతృస్వామ్య చిహ్నం మనది వేల ఏళ్ల నాటి సంస్కృతి అని చెప్పకనే చెబుతుంది. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా ,చివరి ఆనవాలుగా నిలిచిన మన మూలవాసి తెగల సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. 


--శైలజ బండారి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com