మిత్ర మండలి: రివ్యూ

- October 16, 2025 , by Maagulf
మిత్ర మండలి: రివ్యూ

ఈ మధ్య గ్యాంగ్ స్టర్స్ సినిమాలే కాదండోయ్.. ఫ్రెండ్స్ గ్యాంగ్ సినిమాలు కూడా బాగానే హిట్టవుతున్నాయ్. ‘జాతి రత్నాలు’ మొదలుకొని, ‘కమిటీ కుర్రాళ్లు’, ‘ఆహా’, నిన్న కాక మొన్న వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు పెద్దగానే వుంది. అందులో కొన్నిసినిమాలు చిన్న సినిమాల్లో పెద్ద హిట్స్‌గా నిలుస్తుంటే, ఇంకొన్ని కామెడీ పరంగా సూపర్ అనిపించుకుంటూ ధియేటర్ సంగతెలా వున్నా.. ఓటీటీ ఆడియన్స్‌నైనా ఎంటర్‌టైన్ చేస్తున్నాయ్. అలాంటి కోవలోకి చెందిందే ఈ ‘మిత్ర మండలి’  సినిమా అనిపించింది ప్రచార చిత్రాలు చూస్తే. మరి, సినిమా ఎలా వుందో.? ప్రేక్షకుల్ని అలరించిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
జగ్లీపట్నంలోని నారాయణ (వీటీవీ గణేష్)కు తన కులం అంటే ఎంతో పిచ్చి. ఊరి పెద్దగా వున్న నారాయణ తన కులపోళ్ల రక్తం కూడా మరో కులస్థులకు ఇవ్వడానికి ఇష్టపడనంతగా తన కులాన్ని ప్రేమిస్తుంటాడు. ఆ కులం బలంతోనే రాజకీయాల్లో ఎదగాలనుకుంటాడు. కష్టపడి ఎలాగో ఓ పార్టీ నుంచి సీటు సంపాదిస్తాడు. అలాంటి తరుణంలో నారాయణ కూతురు స్వేఛ్చ (నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఆమె పారిపోవడానికి కారణం అదే ఊరికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్) అని తెలుస్తుంది. ఈ విషయం బయటకి తెలిస్తే పరువు పోతుందని భావించి ఎస్సై సాగర్ (వెన్నెల కిషోర్) సాయంతో తన కూతురు కిడ్నాపయ్యిందంటూ ప్రచారం చేయించి వెతకడం మొదలెడతాడు నారాయణ. నారాయణ కారణంగా ప్రియదర్శి అండ్ గ్యాంగ్‌ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు.? అసలు స్వేఛ్చ ఇంటి నుంచి ఎందుకు పారిపోయింది.? కులపిచ్చి వున్న నారాయణ ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు.? అనేది తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
ప్రియదర్శి హీరోగా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శికి ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలేమీ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. అలాంటి కోవలోకే ‘మిత్ర మండలి’ కూడా చేరిపోతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. కమెడియన్‌గా ప్రియదర్శి బలం ఏంటో అందరికీ తెలిసిందే. తనకున్న ఫ్యాన్ బేస్ కూడా అది చూసే ప్రియదర్శిని ఇష్టపడడం. అలాంటిది అదే ఈ సినిమాలో కొరవడింది. కామెడీ కోసం సినిమా నిండా ప్రియదర్శితో పాటూ వున్న గ్యాంగ్ అంతా పూర్తిగా న్యాయం చేయదగ్గ వాళ్లే. కానీ, డైరెక్టర్ ఆయా నటీ నటుల కామెడీ టైమింగ్‌ని సరిగ్గా వాడలేకపోయాడు. దాంతో నటీ నటులు ఏమీ చేయలేకపోయారు. స్పెషల్ రోల్ పోషించిన సత్య కొంత మేర నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ, అది కూడా సెట్ అయినట్లు లేదు. నిహారిక ఎన్.ఎమ్ గురించి సినిమా రిలీజ్‌కి ముందు చాలానే చెప్పారు. కానీ, ఆమెకంత సీను లేదు సినిమాలో. నారాయణగా నటించి వీటీవీ గణేష్ పాత్ర డిజైన్ కూడా ఓ మోస్తరుగానే సాగింది. వెన్నెల కిషోర్ కానీ, ప్రియదర్శి గ్యాంగ్‌గా కీలక పాత్రలు పోషించిన రాగ్ మయూర్, విష్ణు తదితరుల కామెడీ సో సోగానే నడిచింది ఈ సినిమా వరకూ. మిగిలిన పాత్ర ధారుల గురించి ఇంకేం చెప్పుకోవడానికి లేదనే చెప్పడం అతిశయోక్తి అనిపించదేమో.

సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడు విజయేందర్ ఎంచుకున్న సబ్జెక్ట్‌లోనూ కొత్తదనం లేదు. కథనాన్ని కనెక్టింగ్‌గా, కామెడీ కోణంలో నడిపించగల సత్తా కూడా ఏ సన్నివేశంలోనూ కనిపించలేదీ సినిమాలో. ఈ మధ్య వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో విషయం సంగతి పక్కన పెడితే, సినిమాని ఆధ్యంతం ఆహ్లాదంగా ఆనందంగా నడిపించడంలో కథనం, కథను పక్కన పెట్టేసింది. అది కదా కావల్సింది. అదే ఈ సినిమాలో కొరవడింది. బోరింగ్ కామెడీ. ఎడిటింగ్‌లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి వుంది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. మాటలు సో సో అంతే. ఇక, మ్యూజిక్ విషయానికి వస్తే.. బ్రహ్మానందం కనిపించిన ఓ సాంగ్ ఓ మోస్తరు ఆకర్షణగా అనిపిస్తుంది. అంతకు మించి ఆకట్టుకునే పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్‌పెక్ట్ చేయడానికేం లేదీ సినిమాలో.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్ కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. ఛేజింగ్ సీన్స్ గట్రా. పాతవే అయినా కాస్తయినా నవ్వులు పూయిస్తుందంతే. కమెడియన్ సత్య కనిపించిన కొన్ని సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
వీక్ పాయింట్‌తో కథను ఎంచుకోవడం.. అంతకన్నా వీక్‌గా కథనాన్ని నడిపించిన తీరు, అస్సలేమాత్రం ఆకట్టుకోని కామెడీ..

చివరిగా:
‘మిత్ర మండలి’ నుంచి నవ్వుల పండగ ఆశిస్తే.. అంతే సంగతి మరి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com