స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య

- October 29, 2025 , by Maagulf
స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య

తెలంగాణ: కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఎంపీటి శ్రీనివాస్ (42) తీవ్రమైన మానసిక ఆవేదనకు గురయ్యాడు. స్నేహితులు తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందాడు. వింజనూరి కరుణాకర్ రూ.1.50 కోట్లు, కిరణ్, కవిత, వెంకట నరహరి ముగ్గురు కలిసి రూ.1.35 కోట్ల బ్యాంకు రుణం, బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి రూ.28 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే ఎవరూ ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక శ్రీనివాస్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తేవగా, స్నేహితులు “ఏం చేసుకుంటావో చేసుకో” అని బెదిరించినట్లు సమాచారం.

స్నేహితులు రుణం తీర్చకపోవడంతో, శ్రీనివాస్ బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేని స్థితికి చేరుకున్నాడు. బ్యాంకు అధికారులు నిరంతరం అతనిపై ఒత్తిడి తెచ్చారు. ఈ రెండు ఒత్తిడుల మధ్య చిక్కుకున్న శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు అనుకోని అడుగు వేసిన అతను, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనస్థీషియా ఇంజక్షన్ను మోతాదుకు మించి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతనిని రక్షించడం సాధ్యం కాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, శ్రీనివాస్ నుంచి అప్పు తీసుకున్న వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నారు. కష్టపడి డాక్టర్ చదివి ఈ విధంగా మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com