పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్‌లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు

- December 09, 2025 , by Maagulf
పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్‌లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు

విజయవాడ: విజయవాడలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ఈఎన్టీ విభాగంలో ఇటీవల పలు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. మహానగరాల్లోని అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాత్రమే నిర్వహించగలిగే ఈ శస్త్రచికిత్సలను పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు, హాస్పిటల్ సీఈవో డాక్టర్ ఆకాశ్ పల్లెం మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలనే లక్ష్యంతో తమ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగాన్ని ప్రారంభించామని అన్నారు. ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ నేతృత్వంలో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రపంచ శ్రేణి చికిత్సలను అందిస్తున్న డాక్టర్ పవన్ కుమార్ బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం, ప్రముఖ ఈఎన్టీ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ ఈఎన్టీ విభాగం ద్వారా గడచిన ఆరునెలల కాలంలో 200 పైగా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. వాటిలో కొన్ని అత్యంత అరుదైన, అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ఉన్నాయని వెల్లడించారు. ఛాతీ భాగంలో గుండె వరకు థైరాయిడ్ వ్యాపించిపోయిన 89 ఏళ్ల ఓ వృద్ధురాలికి శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ లోని పలు పెద్ద హాస్పిటల్ తో పాటు, నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఈ కేసులో చికిత్స చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో.. సదరు కేసును చాలెంజింగ్ గా తీసుకుని అత్యంత క్లిష్టమైన సర్జరీ నిర్వహించామని చెప్పారు. ఛాతీ భాగం ఓపెన్ చెయ్యకుండా శస్త్రచికిత్స పూర్తి చేసి, ఏ విధమైన చికిత్సానంతర సమస్యలు తలెత్తకుండా పేషెంట్ మూడు రోజుల్లోనే కోలుకునేలా చేశామని వివరించారు. మరో కేసులో.. స్కల్ బేస్ డిఫెక్ట్ రిపైర్ సర్జరీ చేశామని చెప్పారు. పేషెంటుకు అసాధారణ రీతిలో ఒక సెంటీమీటర్ డిఫెక్ట్ ఉండటంతో బ్రెయిన్ ఫ్లూయిడ్ లీకవుతోందని.. మామూలుగా నాలుగైదు మిల్లీమీటర్ల వరకు మాత్రమే డిఫెక్ట్ ఉంటుందని, ఈ కేసులో ఒక సెంటీమీటర్ వరకు డిఫెక్ట్ ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, బ్రెయిన్ ఫ్లూయిడ్ ముక్కు వరకు వ్యాపించిపోయిందని అన్నారు. ఈ తరహా హైరిస్క్ కేసులో అత్యంత ఆధునికంగా ఎండోస్కోపీ విధానంలో సర్జరీ చేసి, సమస్యను పరిష్కరించామని తెలిపారు.ఈ తరహా సర్జరీ ఈ ప్రాంతంలో ఇదే మొట్టమొదటిదని తెలియజేశారు.ఈ తరహా అత్యంత అరుదైన, అత్యంత క్లిష్టమైన అనేక కేసుల్లో విజయవంతంగా చికిత్సలందిస్తున్నామని డాక్టర్ పవన్ కుమార్ పేర్కొన్నారు.పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ఈఎన్టీ విభాగంలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో ప్రపంచ శ్రేణి చికిత్సలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com