భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- March 27, 2026
యూఏఈ: యూఏఈని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాలలోని వీధులలో వరద నీరు నిలిచింది. దీంతో ఇళ్లు, కార్లు నీట మునిగాయని నివాసితులు తెలిపారు.
అల్ నుఐమియా, అల్ ఖోర్ నుండి అల్ రషీదియాలోని లోతట్టు ప్రాంతాలలోని నివాస ప్రాంతాలలో వరదనీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇళ్లలోకి నీరు చేరడం, పార్కింగ్ ప్రదేశాలు నీటి గుంటలుగా మారడం, బలమైన గాలుల వల్ల కిటికీలు, బాల్కనీలు దెబ్బతినడం వంటివి జరిగాయని పలువురు పేర్కొన్నారు.
అల్ రషీదియాలో చాలా మంది నివాసితులు చిన్న విల్లాలలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్లు, టైలర్లు, బేకర్లుగా పనిచేస్తుంటారు. ఇక్కడి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. "వర్షం పడటానికి ఒక రోజు ముందు, మేము పరుపు, దిండ్లు, మా సామాను వంటివి తరలించడం ప్రారంభించాము. టీవీని ఎత్తైన అరలో పెట్టి, ముఖ్యమైన వస్తువులను నేల మీద నుండి పక్కకు జరిపాము. 2024 ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షం మా మదిలో ఉంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అనుకున్నాము." అని డ్రైవర్ రఫీకుల్ హుస్సేన్ తెలిపాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇళ్లలోకి నీరు చేరిందని పేర్కొన్నాడు. దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నీరు లోపలే ఉండిపోయామని తెలిపాడు. భారీ వర్షం కురుస్తున్నప్పుడు తాము చేయగలిగింది ఏమీ లేకపోవడంతో, నిలబడి చూస్తూ ఉండిపోయామన్నారు. భారీ వర్షాల తర్వాత ముంపునకు గురైన ఇళ్లు, దెబ్బతిన్న కార్లతో యూఏఈ నివాసితులు ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు.
ఇక ఎత్తైన భవనాల్లో నివసించే నివాసితులు ఒక విభిన్నమైన సమస్యను ఎదుర్కొన్నారు. సిటీ టవర్‌లో నివసించే జెబా ఖాన్ మాట్లాడుతూ.. నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి తీవ్రంగా మారిందని చెప్పారు. “గాలి చాలా బలంగా వీచింది. బాల్కనీలో ఉంచిన వస్తువులు కదలడం ప్రారంభించి గోడలను తాకాయి. నా బాల్కనీ తలుపు బలంగా మూసుకుపోయి పగిలిపోయింది. అదే సమయంలో వంటగది కిటికీ కూడా పగిలిపోయింది. రెండు వైపుల నుండి వర్షపు నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. మేము హడావిడిగా అన్నింటినీ మూసివేసి, చుట్టూ టవల్స్ ఉంచాల్సి వచ్చింది.” అని ఖాన్ అన్నారు.
మరోవైపు పరిస్థితులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సమాచారం అందగానే వేగంగా స్పందిస్తున్నామని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము ఇరవై నాలుగు గంటలూ సిద్ధంగా ఉన్నామని అజ్మాన్ పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. వర్ష సంబంధిత సంఘటనల వల్ల వాహన నష్ట ధృవీకరణ పత్రాలు పొందడానికి లేదా నంబర్ ప్లేట్లు పోయినట్లయితే ఫిర్యాదు చేయడానికి నివాసితులు తమ స్మార్ట్ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చని కూడా వారు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని అజ్మాన్ రవాణా అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







