ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
- July 19, 2015
తెలుగు సినిమాల్లో హీరోలు వేరు... కమెడియన్లు వేరు! కానీ రాజేంద్ర ప్రసాద్ ఆగమనంతో వీరిద్దరూ ఒక్కరే అయిపోయారు. హీరోనే కామెడీ పండించడం ఓ ఎత్తు అయితే సినిమా అంతా వినోదమే పరుచుకోవడం మరో ఎత్తు అయ్యింది. అలా తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఓ సామాన్య కుటుంబంలోనే పుట్టాడు. అయితే అతని బాల్యం, యవ్వనం అంతా నిమ్మకూరులోని మహానటుడు ఎన్టీయార్ ఇంటి ఆవరణలో జరగడమే ఓ భాగ్యం అని చెప్పాలి. ఆ మహానటుడి గాలి రాజేంద్ర ప్రసాద్ కూ సోకబట్టే... నటుడు కావాలనే కాంక్షతో చెన్నపట్నం చేరాడు. పెద్దాయన ఎన్టీయార్ సలహాతోనే 1977లో బాపు దర్శకత్వంలో 'స్నేహం' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు' వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నలుగురితో భేష్ అనిపించుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు వంశీ ద్వారా 'లేడీస్ టైలర్' రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఆ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమించి చూడు...', 'ఏప్రిల్ ఒకటి విడుదల' చిత్రాలతో ఇక నవ్వుల తుఫాన్ కు తెరతీసినట్టు అయ్యింది.తెలుగు చిత్రసీమలో ఎనిమిదో దశకం వరకూ హీరోలు నడిచిన తీరు వేరు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఆ ట్రాక్ లోకి వచ్చాక, దాని రూట్ ను మార్చాడు. కామెడీ హీరో అనే కొత్త ట్రాక్ లోకి హీరోయిజాన్ని నడిపించాడు. అంతకు ముందు ఒకరిద్దరు కమెడియన్లు ఈ దారిలో ప్రయాణం చేసినా... సెంటిమెంట్ తో సక్సెస్ సాధించారు తప్పితే... కామెడీతో కాదు! కానీ రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోల రేంజ్ పెంచేశాడు. వంశీ, జంధ్యాల, రేలంగి నరసింహరావు, విజయ బాపినీడు, ఇవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల సహకారంతో కామెడీ హీరో నుండి స్టార్ కామెడీ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఒకానొక సమయంలో అతనితో పాటు సమానంగా కామెడీని పండించకపోతే.... హీరోగా నిలబడలేమేమోననే భయాన్నీ తోటి హీరోలలో కలిగించాడు... కొందరైతే అదే బాటలో ప్రయాణమూ మొదలెట్టారు. దటీజ్ రాజేంద్ర ప్రసాద్!!దశాబ్దాల పాటు కామెడీని పండించి 'హాస్యరాష్ట్రపతి' అని పించుకున్న రాజేంద్ర ప్రసాద్... నటకిరీటిగానూ పేరు తెచ్చుకున్నాడు. స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న సమయంలోనే 'ఎర్రమందారం' చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించి... ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అయితే... ఆ తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలను పోషించాలనే తలంపుతో కామెడీనే కాకుండా సెంటిమెంట్ నూ పండించే ప్రయత్నం చేశారు. 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ ను తప్పితే మరొకరిని ఈ పాత్రల్లో ఊహించుకోలేం. సోలో ప్రొడ్యూసర్ గా 'రాంబంటు', 'మేడమ్' వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు!సహజంగా ఒక వయసు వచ్చిన తర్వాత నటీనటులు విశ్రాంతిని కోరుకుంటారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అందుకు భిన్నంగా తాను నిత్య శ్రామికుడినని చాటుతున్నారు. కొడుకు బాలాజీ వివాహం చేసి... కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత ఆయన చిత్రసీమకు మరింత సేవ చేసేందుకు సిద్ధపడ్డారు. ఫలితంగా ఈ యేడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచారు. వృద్ధకళాకారులకు తగిన ఆర్థిక సాయం అందించడంతో పాటు 'మా' సొంత కార్యాలయ నిర్మాణం కోసం రాజేంద్ర ప్రసాద్ కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో చక్కని పాత్రలూ ఆయన్ని పలుకరిస్తున్నాయి. ఈ యేడాది ప్రధమార్థంలో 'ట్యాప్ ర్యాంకర్స్', 'టామి', 'నూతిలో కప్పలు', 'దాగుడుమూతల దండాకోర్', 'సన్నాఫ్ సత్యమూర్తి' తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు రాజేంద్ర ప్రసాద్. ద్వితీయార్థంలోనూ పలు చిత్రాల్లో నటుడిగా తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. 'మా' అధ్యక్షుడిగా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్న ఈ నటకిరిటి మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను, ఇంకొన్ని వసంతాలు అలరించాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







