విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..

- December 18, 2025 , by Maagulf
విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రముఖ పర్యాటక నిర్వాహకుల సంఘం అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో విశాఖపట్నంలో ‘ADTOI నేషనల్ టూరిజం మార్ట్ 2025’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.ఈ జాతీయ స్థాయి కార్యక్రమం 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది.

ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ADTOI ప్రతినిధులతో కలిసి అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అద్భుతమైన తీరప్రాంతం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖ నగరం ఇలాంటి జాతీయ కార్యక్రమానికి వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

ఈ టూరిజం మార్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో-టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఏజెన్సీ ప్రాంతాల పర్యాటక అవకాశాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, పర్యాటక రంగ నిపుణులు పాల్గొంటారని వివరించారు.

బీ2బీ సమావేశాలు, ప్యానెల్ చర్చల ద్వారా స్థానిక పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయని, దీని వల్ల పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతమవుతాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటిడిసి ఎండీ ఆమ్రపాలి కాట, ADTOI ప్రెసిడెంట్ వేద్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com