కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- March 11, 2026
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) మృతి చెందారు.వయసు పైబడటంతో గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కావూరిని చికిత్స నిమిత్తం..హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బుధవారానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. అయితే రెండు రోజులుగా కావూరి మృతిపై సోషల్ మీడియా, కొన్ని ప్రధాన మీడియా ఛానెల్స్‌లో కూడా తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయి. కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కావూరి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కావూరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.
కావూరి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారి మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం తీరని లోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి గారిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
కావూరి మృతిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. “కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. కావూరి గారి సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు. సాంబశివరావు గారు మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కావూరి సాంబశివరావు..1943లో జన్మించారు. వరంగల్ నీట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాల విషయానికి వస్తే ఆయన ఐదుసార్లు ఎంపీగా, ఒక సారి కేంద్ర జౌళిశాఖ మంత్రిగా సేవలందించారు. 1984,1989, 1998 సంవత్సరాల్లో నిర్వహించి లోక్ సభ ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం లోక్ సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన జౌళిశాఖ మంత్రిగా సేవలందించారు. 2014 వరకూ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టీవ్ గా లేరు. కాగా.. కావూరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. కావూరి కుమార్తె కొడుకే.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







