మయస్తీనియాకు శస్త్రచికిత్స చేయటమే ఉత్తమo

- July 27, 2016 , by Maagulf
మయస్తీనియాకు శస్త్రచికిత్స చేయటమే ఉత్తమo

కొన్ని జబ్బులు మనకు అంతగా తెలియవు. చిన్నగానే మొదలై క్రమేపీ పెద్ద సమస్యలుగా పరిణమిస్తాయి. ఇతర జబ్బుల మాదిరిగా కనిపిస్తూనే చివరికి తీవ్రంగా వేధిస్తాయి. మయస్తీనీయా గ్రేవిస్ అలాంటి సమస్యే. అలసట, నీరసం వంటి లక్షణాలతో చాలా తేలికగా మొదలవుతుంది. క్రమేపీ కనురెప్పలు వాలిపోవటం, రెండు దృశ్యాలు కనబడటం వంటివి మొదలవుతాయి. కానీ వాటిని చూసి అంతా దీన్నో కంటి సమస్యగా పొరబడుతుంటారు. నడవటం కష్టమవుతుంటుంది కాబట్టి ఎముకల జబ్బు అనుకుంటుంటారు. ఇలా అసలు సమస్యను వదిలేసి.. ఏవేవోగా అనుమానిస్తుండటం వల్ల చాలా సమయం వృథా అవుతుంది. అందుకే మయస్తీనియా లక్షణాల గురించి అవగాహన ఉంటే తప్పించి దీన్ని సత్వరమే గుర్తుపట్టలేరు. మనం ఏ పని చెయ్యాలన్నా కండరాలన్నీ చక్కటి సమన్వయంతో కదలాలి. అవసరమైతే చురుకుగా కదలాలి. వేగంగానూ కదలాలి. అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు. కానీ కండరాల చేత చురుకుగా పని చేయించే యంత్రాంగమే జావగారిపోతుంటే? మెదడు నుంచి అందాల్సిన సంకేతాలు సమర్థంగా అందకపోతే? క్రమంగా ఒక్కొక్క కండరమూ నిస్తేజమవుతూ వస్తుంది. స్తబ్దుగా మారిపోతుంది. కొద్దిపాటి పనికే కుప్పకూలుతుంది. ఇలాంటి చిత్రమైన, అరుదైన సమస్యే మయస్తీనియా గ్రేవిస్. కండరాలు, నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీసి.. మనం కావాలనుకున్నప్పుడు కదల్చగలిగే కండరాలపై నియంత్రణను కోల్పోయేలా చేయటం ద్వారా చిన్న చిన్న పనులు కూడా చెయ్యటం కష్టమైపోవటం దీని ప్రత్యేకత. ఈ సమస్య వంశపారంపర్యంగా రావొచ్చు. తీవ్రమైన శారీరకశ్రమ, ఇన్‌ఫెక్షన్‌లతోనూ రావొచ్చు. కొన్నిసార్లు విపరీతమైన వేడి, చలికి గురికావటం కూడా దీనికి దారితీయొచ్చు. తీవ్రమైన భావోద్వేగానికి, ఒత్తిడికి లోనవటమూ ఈ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ఇది స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా.. ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ 40 ఏళ్ల లోపు మహిళల్లో, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో తరచుగా కనబడుతుంది. రజస్వల ఆరంభమైన తొలినాళ్లలో యుక్తవయసు బాలికలకూ మయస్తీనియా వచ్చే అవకాశముంది.కండరాలు నిస్తేజం:మనం నడవాలన్నా, రాయాలన్నా, తినాలన్నా.. ఇలా ఏ పనులు చేయాలన్నా కండరాల సంకోచ వ్యాకోచాలే కారణం. వీటిని మన మెదడు నుంచి వెలువడే నాడీ ప్రచోదనాలు నియంత్రిస్తాయి. ఇవి నాడుల గుండా ప్రయాణించి కండరాలతో నాడులు కలిసే చోటుకి చేరుకుంటాయి. నిజానికివి నేరుగా కండరాల పోచలను తాకవు. కండర పోచలు, నాడుల చివర్ల మధ్య కొంత ఖాళీ స్థలం (నాడీకండర కూడలి) ఉంటుంది. సంకేతానికి సంబంధించిన విద్యుత్ ప్రచోదనాలు ఇక్కడికి చేరుకున్నప్పుడు అసిటీల్‌కోలైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది కండరాలు చురుకుగా, శక్తిమంతంగా పని చేయటానికి తోడ్పడుతుంది. అందువల్ల రక్తంలో దీని మోతాదు లోపిస్తే కండరాలు నిస్తేజంగా, స్తబ్ధుగా మారిపోతాయి. అసిటీల్‌కోలైన్ నాడీకండర కూడలిలో తిరుగుతూ రకరకాల గ్రాహకాలకు అంటుకుంటుంది. ఈ గ్రాహకాలు గల భాగాలు తగినంతగా ప్రేరేపితమైతే కండరాలు సంకోచిస్తాయి. అయితే మయస్తీనీయా బాధితుల్లో ఈ గ్రాహకాల భాగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం అసిటీల్‌కోలైన్‌ను దెబ్బతీసే, నిలువరించే ఏసీహెచ్ ఆర్ అనే యాంటీబాడీలే. ఇవి రక్తంలో పెద్దమొత్తంలో పేరుకుపోయి.. అదేపనిగా అసిటీల్‌కోలైన్ గ్రాహకాన్ని దెబ్బతీస్తుంటాయి. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన యాంటీబాడీలు శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లపై దాడి చేస్తుంటాయి. కానీ మయస్తీనీయా బాధితుల్లో ఇవి ఏసీహెచ్ ఆర్ గ్రాహకాలపై దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. ఫలితంగా కండర సంకోచాలు తగ్గుముఖం పడతాయి. వీరిలో కండర సముదాయం తరచుగా బలహీనమవుతూ ఉంటుంది. ఫలితంగా చిన్నపాటి పనులకే కండరాలు తీవ్ర అలసటకు లోనవుతాయి. చివరికి పూర్తిగా పనిచేయని స్థితికీ చేరుకుంటాయి. అందుకే మయస్తీనియా గ్రేవిస్ బారినపడ్డ వారికి కొద్దిదూరం నడిచినా, తేలికపాటి వ్యాయామం చేసినా వెంటనే నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. కొన్నిసార్లు ప్రాణం పోతుందేమో అన్నంతగా అలసిపోతుంటారు కూడా.్టథైమస్ గ్రంథి పెరిగితే?మయస్తీనీయా గ్రేవిస్‌కు ప్రధాన కారణం మన ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి సైజు పెరగటం. ఛాతీ మధ్యఎముక, ఊపిరితిత్తులకు మధ్యలో ఉండే థైమస్ గ్రంథి యుక్తవయసు వరకే చురుకుగా పనిచేస్తుంది. ఆ తర్వాత మనం పెద్దగా అవుతున్నకొద్దీ క్రమంగా కుంచించుకుపోతుంది. థైమస్ గ్రంథి నుంచి థైమోసిన్ అనే హార్మోన్ విడులవుతుంది. ఇది వ్యాధులతో పోరాడే టి కణాల వౄఎద్ధిని ప్రేరేపిస్తుంది. అసిటీల్‌కోలైన్‌ను దెబ్బతీసే ఏసీహెచ్ ఆర్ యాంటీబాడీల ఉత్పత్తిని ఈ గ్రంథి ప్రేరేపిస్తున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. చిన్నప్పుడు పెద్దగా, పెద్దయ్యాక చిన్నగా మారే థైమస్ గ్రంథి.. మయస్తీనియా బారినపడ్డ కొందరు పెద్దవారిలో చాలా పెద్దగా ఉంటుంది. కొందరిలో థైమస్‌గ్రంథిలో కణితులు కూడా ఉండొచ్చు. దీంతో గ్రంథి పరిమాణం పెరుగుతుంది. 90% మందిలో మయస్తీనీయాకు గ్రంథి సైజు పెరగటమే ప్రధాన కారణం. 10% మందిలో మాత్రం రోగనిరోధకశక్తి పొరపాటున మన శరీరం మీదే దాడి చేయటం వల్ల వస్తుంటుంది.శస్త్రచికిత్సతో మంచి ఫలితం:మయస్తీనియా లక్షణాలను తగ్గించటానికి కొన్నిరకాల సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటితో ద్రుష్పభావాలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువ. ఉదాహరణకు ప్రెడ్నిసలోన్ మందుతో ఒంట్లో నీరు, లవణాలు అధికంగా పేరుకుంటాయి. దీంతో ముఖం, కాళ్లు, చేతుల వంటివి ఉబ్బరిస్తాయి. ఈ ద్రుష్పభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మయస్తీనియాకు శస్త్రచికిత్స చేయటమే ఉత్తమ పరిష్కారంగా తోస్తుంది. ఇందులో ఛాతీలోని థైమస్ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ శస్త్రచికిత్స ద్వారా నాలుగు రకాల ప్రయోజనాలున్నాయి. 1. థైమస్ గ్రంథిని తొలగించటం వల్ల చాలామందిలో సమస్య దాదాపు పూర్తిగా నయమవుతుంది. 2. మయస్తీనీయా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. సమస్య ప్రాణాంతక స్థితి వరకూ చేరకుండా ఆగిపోతుంది. 3. శస్త్రచికిత్స తర్వాత అవసరమైన మందుల మోతాదు చాలావరకు తగ్గించటానికి వీలవుతుంది. 4. థైమస్ గ్రంథిలో కణితి ఏర్పడితే కొందరిలో అది క్యాన్సర్‌గానూ పరిణమించొచ్చు. అందువల్ల గ్రంథిని తొలగిస్తే ముందుగానే క్యాన్సర్ ముప్పు నివారణకూ తోడ్పడుతుంది. కాబట్టి మయస్తీనీయాకు ఇటీవలికాలంలో పాశ్చాత్యదేశాలన్నీ శస్త్రచికిత్సనే ప్రధాన పరిష్కారంగా గుర్తిస్తున్నాయి. అయితే కొందరిలో ఇతర్రతా సమస్యల కారణంగా థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స కుదరకపోవచ్చు. అలాంటి వారికి మందులు తప్ప మరో మార్గం ఉండదు. కానీ మనదేశంలో చాలామంది వైద్యులు మయస్తీనియాకు ముందుగా మందులు ఇవ్వటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మందులతో ద్రుష్పభావాలు తలెత్తటంతో పాటు ఆర్థికంగానూ భారంగా పరిణమిస్తుంది. ఒకవేళ థైమస్‌గ్రంథిలో క్యాన్సర్ కణితి ఉంటే దాన్ని తొలిదశలోనే తొలగించే అవకాశమూ తప్పిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com