నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ

- January 11, 2026 , by Maagulf
నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ

యూఏఈ: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం విస్తరిస్తున్న ఈ రోజుల్లో, తన యూట్యూబ్ వీడియోల్లో చెప్పే ప్రతి మాట కూడా పూర్తిగా ఫ్యాక్ట్ చెక్ చేసి మాత్రమే విడుదల చేస్తానని ప్రముఖ భారతీయ ఇన్ఫ్లూయెన్సర్ ధృవ్ రాఠీ  తెలిపారు.

దుబాయ్ లో జరుగుతున్న 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.ప్రపంచం నలుమూలల నుంచి కంటెంట్ క్రియేటర్లను కలిపే ఈ సమ్మిట్, అతిపెద్ద ఇన్ఫ్లూయెన్సర్ ఈవెంట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
30 మిలియన్లకు పైగా యూట్యూబ్ సబ్స్క్రైబర్లున్న ధృవ్ రాఠీ మాట్లాడుతూ,
“నా దగ్గర ప్రత్యేకంగా రీసెర్చ్ టీమ్, ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ ఉంది. నేను వీడియోలో చెప్పే ప్రతి లైన్ను వారు ధృవీకరిస్తారు. అంతేకాదు, ప్రతి వీడియోకి ఒక రిసోర్స్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి పబ్లిక్గా అందుబాటులో ఉంచుతాం” అని తెలిపారు.

రాజకీయాలు, పాలన, వాతావరణ మార్పులు, సామాజిక అంశాలపై ఎక్స్ప్లైనర్ వీడియోలతో ధృవ్ రాఠీ ప్రసిద్ధి చెందారు. 19 ఏళ్ల వయసులో కంటెంట్ క్రియేషన్ ప్రారంభించిన ఆయన, ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన అభిప్రాయాలకు ప్రశంసలు వచ్చినప్పటికీ, విమర్శలు కూడా ఎదురవుతుంటాయి.

ఏ అంశం పై వీడియో చేయాలనే నిర్ణయం కూడా ఒక విధానపూర్వక ప్రక్రియ ద్వారా జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల ఆసక్తి, ప్రస్తుత సామాజిక–రాజకీయ పరిస్థితులు, తన వ్యక్తిగత ఆసక్తి వంటి అంశాలను పరిశీలించి, స్కోర్లు ఇచ్చి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.

కంటెంట్ క్రియేషన్తో పాటు గత ఏడాది AI Fiesta అనే ఆల్-ఇన్-వన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించి వ్యాపారవేత్తగా మారిన ధృవ్, ఇది తన జీవితంలో అతిపెద్ద సవాలుగా మారిందని చెప్పారు.
“10 ఏళ్లు వీడియోలు చేసిన అనుభవం వ్యాపారం నడపడానికి సరిపోలేదు. HR, కస్టమర్ సపోర్ట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి” అని అన్నారు. ప్రస్తుతం ఆయన టీమ్లో 10 నుంచి 15 మంది పని చేస్తున్నారు.ఆన్లైన్ ట్రోలింగ్, లీగల్ నోటీసులు తనకు కొత్త కాదని, వాటిని ఎదుర్కోవడం అలవాటైపోయిందని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక లీగల్ టీమ్ కూడా ఉందన్నారు.

భవిష్యత్తు పై ఆందోళన
ప్రజాస్వామ్య చర్చల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ,
“ఎక్కువ మంది ప్రజలు పట్టించుకోకపోవడమే నాకు పెద్ద భయం. ప్రజలు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి” అని ధృవ్ రాథీ అన్నారు.
ఇటీవల తండ్రిగా మారిన ఆయన, ఇప్పుడు కుటుంబం–పని మధ్య సమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానన్నారు.
ప్రతి ఏడాది 1 బిలియన్ సమ్మిట్కు హాజరవుతున్న ధృవ్ రాఠీ, ఈ ఏడాది సమ్మిట్ మరింత భారీగా నిర్వహించబడిందని ప్రశంసించారు.
“ఇక్కడ ఒక చిన్న నగరాన్ని నిర్మించినట్లే ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

--బాజీ షేక్(మాగల్ఫ్ యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com