తొలి వన్డేలో న్యూజిలాండ్‌ పై భారత్ విజయం

- January 11, 2026 , by Maagulf
తొలి వన్డేలో న్యూజిలాండ్‌ పై భారత్ విజయం

వడోదర: న్యూజిలాండ్‌తో  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేసింది.వడోదర వేదికగా ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ సమష్టిగా రాణించి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (93), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs NZ) లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (26) ఓ మోస్తరు స్కోరుకే అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ ఔటైనా… కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (49) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.

సెంచరీకి చేరువైన దశలో కోహ్లీ ఔటవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వెంటనే రవీంద్ర జడేజా (4), అయ్యర్ కూడా ఔటవడంతో కివీస్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి.ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (29 నాటౌట్), హర్షిత్ రాణా (29) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రాణా వేగంగా ఆడి ఒత్తిడిని తగ్గించాడు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (7 నాటౌట్)తో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు.

మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ (84) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడిన మిచెల్ జట్టు స్కోరును 300 మార్కుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 14న రాజ్ కోట్ లో జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com