టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్

- January 25, 2026 , by Maagulf
టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించేందుకు నటుడు విజయ్ మరింత దూకుడు ప్రదర్శించారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు ఎన్నికల గుర్తుగా ‘విజిల్’ను అధికారికంగా ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

చెన్నై సమీపంలోని మహాబలీపురంలో జరిగిన భారీ పార్టీ సమావేశంలో విజయ్ ఈ గుర్తును ఆవిష్కరించారు. వేదికపై స్వయంగా విజిల్ ఊదుతూ, ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్, ప్రస్తుత డీఎంకే పాలనను ‘దుష్ట శక్తి’గా, గత ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ‘అవినీతి శక్తి’గా అభివర్ణించారు. ఈ రెండు శక్తులు ఇకపై తమిళనాడును పాలించే అర్హత కోల్పోయాయని, వాటిని ఎదుర్కొనే ధైర్యం టీవీకేకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

రెండు ద్రావిడ పార్టీలు బీజేపీ ఒత్తిడికి లోనయ్యాయని ఆరోపించిన విజయ్,(Vijay) ఏఐఏడీఎంకే బహిరంగంగా, డీఎంకే పరోక్షంగా లొంగిపోయిందని విమర్శించారు. తాము మాత్రం ఎలాంటి ఒత్తిడికీ తలవంచబోమని ప్రకటించారు. 2026 ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, అవి ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధమని పేర్కొన్నారు. ఈ పోరులో కార్యకర్తలే నాయకులు, కమాండర్లని చెబుతూ వారిలో ఉత్సాహం నింపారు. తన సినీ కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలను మరియు ఈ నేలను రక్షించడమే తన లక్ష్యమని విజయ్ వెల్లడించారు. ఇటీవల ఎన్నికల సంఘం టీవీకేకు ‘విజిల్’ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com